‘కూతురు నా ప్రాపర్టీ కాదు’.. ముద్రగడ

ముద్రగడ తీరును ఆయన కూతురు క్రాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె వ్యాఖ్యలపై ముద్రగడ కూడా ఘాటుగా స్పందించారు. ఇంతకీ వారు ఇద్దరూ ఏమన్నారంటే..

Update: 2024-05-03 06:49 GMT

పిఠాపురం రాజకీయం మరింత వేడెక్కింది. పవన్‌ను ఓడించడానికి వైసీపీ బలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పిఠాపురం రాజకీయాల్లోకి కాపు ఉద్యమనేతగా పేరొందిన ముద్రగడ పద్మనాభంను దింపింది. ఆయన ఫోకస్ అంతా పిఠాపురంలో వైసీపీ జెండా ఎగిరేలా చేయడంపైనే పార్టీ అధిష్టానం పెట్టించింది. ఇందులో భాగంగా ఆయన పిఠాపురంలో వైసీపీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకుంటూ వైసీపీ అభ్యర్థి వంగా గీత.. జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్‌పై భారీ మెజారిటీతో గెలిచేలా వ్యూహాలు రిచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌పై ముద్రగడ కీలక విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన విమర్శలు, వ్యవహార శైలిపై ఆయన కూతురు క్రాంతి స్పందించారు.

పవన్ గెలుపుకు కృషి చేస్తా..

‘‘వంగా గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు కానీ పవన్ కల్యాణ్‌ను, ఆయన కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదు. పవన్‌ను తిట్టడానికే మా నాన్నను జగన్ వాడుకుంటున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాన్న ఎటూ కాకుండా పోతారు. ఆయనను అలా వదిలేయడం కూడా పక్కా. ఈ విషయంలో మా నాన్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. నేను పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తా’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘నాన్నను పవన్‌కు వ్యతిరేకాస్త్రంగా వైసీపీ వాడుకుంటుంది’ అంటూ క్రాంతి కీలక వ్యాఖ్యాలు చేశారు.

క్రాంతి ఏమన్నారంటే..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటా అంటూ ముద్రగడ చేసిన ఛాలెంజ్ రాష్ట్రమంతా సంచలనంగా మారింది. తాజాగా దీనిపై ఆయన కూతురు క్రాంతి ఘాటుగా స్పందించారు. ‘‘పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి నాన్న చేయాల్సిందంతా చేస్తున్నారు. అందులో భాగంగానే నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి తరిమేయకపోతే తన పేరును రెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ప్రకటన నాకే కాదు. ఆయన అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చలేదు’’అని ఇసుమంత ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు క్రాంతి. ఆమె వ్యాఖ్యలకు ముద్రగడ కూడా ఘాటుగా స్పందించారు. క్రాంతి ఇప్పుడు తన ప్రాపర్టీ కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది బాధాకరం

తనపై కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలను ముద్రగడ పద్మనాభం కీలకంగా స్పందించారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ‘‘నా కూతురుకు పెళ్ళి అయింది. తాను పెళ్ళి కాకముందు నా ప్రాపర్టి. ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ. నా కూతురుతో కొంతమంది నన్న తిట్టించారు. అది తీవ్ర బాధాకరం. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే. నేను ఒకసారి వైసీపీలో చేరాక మళ్లీ పక్క చూపులు చూడను. ఎవరు ఎన్ని అనుకున్నా సీఎం జగన్‌ మళ్ళీ సీఎంగా గెలవడం ఖాయం. దాన్ని ఎవరూ ఆపలేరు. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. నాకు పదవులు కావాలని కూడా అడగను. నేనో సేవకుడిని మాత్రమే’’ అని స్పందించారు ముద్రగడ.

ఇది జనసేన పనా..!

పిఠాపురం రాజకీయం, పవన్ కల్యాణ్ గెలుపుపై మద్రగడ పద్మనాభం, ఆయన కూతురు మధ్య నెలకొన్ని చర్చ రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముద్రగడతో ప్రమాదమని భావించే జనసేన.. ఆయన కూతురును బెదిరించో భయపెట్టో కెమెరా ముందు కూర్చోబెట్టి ఇలాంటి వీడియోను విడుదల చేయించిందని ముద్రగడ అభిమానులు కొందరు, వైసీపీ కార్యకర్తులు కొందరు ఆరోపిస్తున్నారు. ఓటమి భయం పట్టుకోవడంతోనే జనసేన ఇలాంటి నీచ రాజకీయాలకు పూనుకుంటుందని, అధికారం కోసం ఇంత దిగజారాలా అంటూ విమర్శల వర్షం కురిపిస్తోంది.

Tags:    

Similar News