విశాఖలో యుద్ధం కాని యుద్ధం

పాకిస్తాన్‌తో యుద్ధం సంభవిస్తే ప్రజలను సన్నద్ధత చేయడం కోసం కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు విశాఖలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.;

Update: 2025-05-07 15:34 GMT
విశాఖ క్వీన్‌మేరీ స్కూలులో మాక్‌ డ్రిల్‌ సన్నివేశం

అది విశాఖలోని వన్‌టౌన్‌ ప్రాంతం. అంతా ఎవరి పనుల్లో వారి నిమగ్నమై ఉన్నారు. సరిగ్గా సాయంత్రం నాలుగ్గంటలకు సైరన్‌ మోగింది. ఆ ప్రాంతంలో సైరన్‌ మోగే పరిశ్రమలు లేకపోవడంతో అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ సైరన్‌ అదే పనిగా మోగుతూనే ఉంది. అ పరిసర వాసులంతా అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ఓ భవనంలో పొగలు వస్తున్నాయి. అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు, పోలీసులు, ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గందరగోళంగా ఉంది. అక్కడున్న వారికి అదేమీ అర్థం కాలేదు. తెల్లవారుజామునే పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులపై భారత్‌ సైన్యం దాడులు జరిపిన సంగతిని ఎరిగిన వారు.. అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చూసి పాక్‌ విశాఖపై ఏదైనా అటాక్‌ చేసిందేమోనని, యుద్ధం మొదలైందేమోనని ఆందోళన చెందారు. కాసేపటికి అది యుద్ధం కాదని, ఒకవేళ యుద్ధమే వస్తే ప్రజలు ఎలా జాగ్రత్త పడాలో, అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో అవగాహనకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్టు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.


                                            క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ

 పాకిస్తాన్‌తో యుద్ధం సంభవిస్తే ప్రజలను సన్నద్ధత చేయడం కోసం కేంద్ర హోం శాఖ బుధవారం వివిధ ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేటగిరి–2లో విశాఖపట్నం ఉంది. విశాఖలో తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంతో పాటు పలు రక్షణ రంగ సంస్థలు, హెచ్‌పీసీఎల్, హిందుస్థాన్‌ షిప్‌యార్డు, బీహెచ్‌ఈఎల్, అంతర్జాతీయ విమానాశ్రయం, స్టీల్‌ప్లాంట్‌ వంటి భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. దీంతో శత్రు దేశాల గురి విశాఖపై ఉండడంతో కేంద్ర హోంశాఖ ఈ నగరాన్ని మాక్‌ డ్రిల్‌కు ఎంపిక చేసింది. దీనిలో భాగంగా బుధవారం ఉదయం నగరంలోని కొన్ని చోట్ల అధికారులు యుద్ధ సన్నద్ధతపై మినీ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.


                                                పక్క భవనానికి మంటలు అంటుకుని పొగచిమ్ముతున్న దృశ్యం

 సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన మాక్‌ డ్రిల్‌కు వన్‌టౌన్‌ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ రాణిబొమ్మ సెంటర్‌లో తొలుత సైరన్‌ను మోగిస్తూ శత్రు దేశం ఓ భవనంపై బాంబులతో దాడి చేసిన సన్నివేశాన్ని సృష్టించారు. క్షణాల్లో అక్కడకు అగ్నిమాపక శకటాలతో చేరుకున్న సిబ్బంది పొగలు చిమ్ముతున్న ఆ భవనంలో ఉన్న వారిని రక్షించారు. అనంతరం భవనంలో రేగిన మంటలను అదుపు చేశారు. ఇంతలో ఆ పక్క భవనానికి మంటలు అంటుకుని పొగలు వ్యాప్తి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హుటాహుటీన అ భవనంలోకి వెళ్లి మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో మెరుపు కమెండోలు కూడా ఆ భవనంలోకి చొరబడి శత్రు సైన్యం కోసం గాలించారు. ఇలా రెండు భవనాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాక అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించినట్టు మాక్‌ డ్రిల్‌ను రక్తి కట్టించారు. దీనినంతటినీ విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షించారు. మరోవైపు రాణిబొమ్మ సెంటరుకు సమీపంలోనే ఉన్న క్వీన్‌ మేరీస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శత్రు దేశం/ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రాణాపాయం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే సన్నివేశాన్ని సృష్టించారు.


                                            ఉగ్రదాడి నుంచి తప్పించుకోవడానికి స్కూలు బెంచిల కింద దాక్కున్న విద్యార్థులు

 వారు బాంబులు, క్షిపణులు వంటి పేలుళ్ల శబ్దం నుంచి ఉపశమనం పొందడం, యుద్ధం వేళ మనుషులు నిటారుగా నిలబడి వెళ్లకుండా వంగి, చెవులు మూసుకుంటూ వెళ్లడం వంటి వాటిపై ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పర్యవేక్షించారు. అనంతరం మాక్‌ డ్రిల్‌లో భాగంగా రాత్రి 7 గంటలకు సీతమ్మధారలోని ఆక్సిజన్‌ టవర్స్‌లో బ్లాక్‌ అవుట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ టవర్స్‌లో పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపి వేసి ఉగ్రమూకలు దాడులకు తెగబడితే ఎలా స్పందించాలి? ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై ఆక్సిజన్‌ టవర్స్‌లో నివాసం ఉంటున్న వారికి అవగాహన కల్పించారు. ఈ మాక్‌ డ్రిల్‌లో ఎస్డీఆర్‌ఎఫ్‌ ఐజీ రాజకుమారి, విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్, సివిల్‌ డిఫెన్స్, పోలీసు, జీవీఎంసీ, రెవిన్యూ, వైద్యారోగ్యశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


                                                బాంబు దాడికి గురైన భవనం నుంచి వ్యక్తిని నిచ్చెనపై నుంచి దించుతున్న దృశ్యం

 భారత్‌ నిర్ణయాన్ని స్వాగతించిన విశాఖ వాసులు

బుధవారం తెల్లవారకముందే పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసిందని.. వారి స్థావరాలను నేలమట్టం చేసి పలువురు ఉగ్రవాదులు మట్టుబెట్టిందని.. ప్రసార మాధ్యమాల ద్వారా విశాఖ ప్రజలు తెలుసుకుని ఔరా! అనుకున్నారు. ఇటీవల జమ్ము–కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చివేయడంపై యావత్‌ భారతదేశం అట్టుడికి పోతోంది. పాక్‌కు తగిన గుణపాఠం చెప్పాలంటూ గొంతెత్తుతోంది. ఈ తరుణంలో బుధవారం ఉదయాన్నే పాకిస్తాన్‌లో టెర్రరిస్టులుండే ఆవాసాలపై ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరిట భారత్‌ సైన్యం దాడులు జరిపిందన్న వార్త అందరితో పాటు విశాఖ వాసులూ ఊరడిల్లారు. ఉదయం నుంచీ నగరవాసులు ఎక్కడ చూసినా భారత్‌ సైన్యం సాహసోపేత దాడులపైనే చర్చించుకుంటున్నారు. ఇంతలో సాయంత్రం విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ సన్నద్ధతను తెలియజేసే మాక్‌ డ్రిల్‌ నిర్వహించడాన్ని నగరవాసులు స్వాగతించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని ముక్తకంఠంతో ఘోషించారు. మాక్‌ డ్రిల్‌ అనంతరం జైహింద్‌.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

                                                    బ్లాక్‌ అవుట్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఆక్సిజన్‌ టవర్స్‌
Tags:    

Similar News