ఏపీలో హద్దులు, పేర్ల మార్పులకు మంత్రుల సబ్ కమిటీ
జిల్లా, మండలం, గ్రామాల పేర్లు/సరిహద్దుల మార్పులపై సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.;
జిల్లా, మండలం, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (క్యాబినెట్) విభాగం జీవో ఆర్టీ నెం. 1378 జారీ చేసింది.
రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ బృందానికి కన్వీనర్‌గా వ్యవహరించి, కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. అవసరమైనప్పుడు సంబంధిత అధికారులను ఆహ్వానించవచ్చు.
జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మార్పులు, ప్రజలకు సౌలభ్యం కోసం హెడ్‌క్వార్టర్స్ నుంచి దూరాన్ని పరిగణనలోకి తీసుకుని వివాదాలను పరిష్కరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
చారిత్రక, సాంస్కృతిక అనుబంధాలను కాపాడుతూ సరిహద్దు మార్పులు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లను మంత్రుల బృదం పరిశీలిస్తుంది. ప్రాంతాల మధ్య సమాన సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, జిల్లా సరిహద్దులు, హెడ్‌క్వార్టర్స్, పేర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఏర్పాట్లు, వనరుల కేటాయింపుపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను అధ్యయనం చేయడం మంత్రుల బృదం చేస్తుంది.
ఈ బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించి, తుది నిర్ణయం తీసుకునేందుకు సహకరిస్తుంది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ బృదానికి నేత్రుత్వం వహిస్తారు.
బృందంలో ఈ మంత్రులు సభ్యులుగా ఉంటారు
1. అనగాని సత్య ప్రసాద్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ మంత్రి
2. పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి
3. అనిత వంగలపూడి, హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ మంత్రి
4. బిసి జనార్ధన్ రెడ్డి, రోడ్లు & భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి
5. డాక్టర్ నిమ్మల రామానాయుడు, నీటిపారుదల అభివృద్ధి మంత్రి
6. నాదెండ్ల మనోహర్, ఆహారం & సివిల్ సప్లైస్, వినియోగదారుల వ్యవహారాల మంత్రి
7. సత్య కుమార్ యాదవ్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య మంత్రి