అడవి పల్లెలకు ఆకాశ మార్గాన ఔషధాలు!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-12-09 03:46 GMT
ఇన్నాళ్లూ నిఘాకు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలను షూట్ చేసేందుకు వినియోగిస్తున్న డ్రోన్లు ఇప్పుడు ఔషధాలను మోసుకెళ్లేందుకూ రంగంలోకి దిగుతున్నాయి. కాకులు దూరని కారడవుల్లోకి చొచ్చుకుపోతూ అక్కడున్న గిరిజనులకు అవసరమైన మందులు అందించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, అరుణాచలప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి సేవలందిస్తున్న డ్రోన్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి అడుగు పెట్టనున్నాయి. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’గా పిలిచే ఈ డ్రోన్ల కథాకమామిషూ ఏమిటంటే?
తెలంగాణలోని వికారాబాద్‌లో మందులను తీసుకెళ్తున్న డ్రోన్ (ఫైల్)
తొలిసారిగా తెలంగాణలో..
దేశంలోనే మొట్టమొదటి సారిగా 2021 సెప్టెంబర్ 11న తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును చేపట్టింది. దీనిని వికారాబాద్‌లో అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. వికారాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్ నుంచి సమీపంలోని పీహెచ్‌సీకి మందులతో తొలి డ్రోన్ ఎగిరింది. అనంతరం 2022 ఆగస్టు 15 నుంచి అరుణాచలప్రదేశ్‌లోనూ దీనిని అమలు చేస్తున్నారు. అరుణాచలప్రదేశ్‌లోని కొండ కోనల్లోని గిరిజనులకు మందుల పంపిణీకి ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు అక్కడ విజయవంతంగా నడుస్తోంది.
ఏపీలో అల్లూరి జిల్లా ఎంపిక..
మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే అరుణాచలప్రదేశ్‌లో డ్రోన్లను నడుపుతున్న సంస్థతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఆ సంస్థ రాష్ట్రంలో తొమ్మిది నెలల పాటు డ్రోన్ సేవలందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా గిరిజనుల ఆవాసాలు అధికంగా ఉండే అల్లూరి సీతారామరాజు జిల్లాను ఎంపిక చేసింది. ఆ జిల్లాలోని మారుమూల గిరిజన పల్లెలకు అత్యవసరమైన ఔషధాలను ఈ డ్రోన్ల ద్వారా సత్వరమే అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికొచ్చింది.
డ్రోన్ల ద్వారా ఏమేమి తరలిస్తారు?
ప్రస్తుతం జిల్లా కేంద్రం పాడేరు నుంచి దూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వాహనాలు, సిబ్బంది ద్వారా మందులను పంపుతున్నారు. ఈ ప్రాజెక్టు అమలు చేస్తే పాడేరు నుంచి నిర్దేశించిన ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ఏరియా ఆస్పత్రులకు, ఎంపిక చేసిన ఇతర ప్రాంతాలకు మందులను డ్రోన్ల ద్వారా పంపిస్తారు. వీటిలో వ్యాక్సిన్లు, మందులు, రక్తం యూనిట్ల ప్యాకెట్లు, వైద్య పరీక్షల శాంపిళ్లను చేరవేస్తారు. ఫలితంగా వైద్య సాయం అవసరమైన ప్రాంతాలకు సత్వరమే మందులను పంపడానికి వీలవుతుంది. ఈ డ్రోన్లు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందువల్ల రోడ్డు మార్గంతో పోల్చుకుంటే నిమిషాల వ్యవధిలోనే వీటిని తరలించవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది.
డ్రోన్లకు కూలింగ్ సదుపాయం కూడా..
టీకాలు (వ్యాక్సిన్లు) వంటివి పాడవకుండా ఈ డ్రోన్లలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత సదుపాయం కూడా ఉంటుంది. 3–5 వేల వరకు వ్యాక్సిన్లను తీసుకెళ్లగలుగుతుంది. 5 కిలోల బరువు గల మందులను మోసుకెళ్లగలుగుతుంది. ఔషధాలను బట్వాడా చేసిన తర్వాత సదరు ఆస్పత్రి నుంచి రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకుని డ్రోన్లు తిరిగి పాడేరుకు చేరుకుంటాయి. అనుమతులు లభిస్తే విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్) నుంచి పాడేరుకు మందులు తీసుకురావడానికి కూడా ఈ డ్రోన్లను వినియోగించాలని భావిస్తున్నారు. ఒక్కో డ్రోన్ 60–80 కి.మీల దూరం ప్రయాణించగలుగుతుంది. భూమికి 500–700 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణంలో తప్ప మిగిలిన రోజుల్లో ఇవి విజయవంతంగా పనిచేస్తాయి. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు పూర్తి స్థాయి సమాచారం లేదని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కృష్ణనాయక్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి’తో చెప్పారు.