ఎబిసిడిలు సాధించేందుకు మాదిగలకు మిగిలిన ఒకే ఒక ‘ఆప్షన్’

ఎబిసిడి వర్గీకరణ అమలు కోసం తదుపరి రాజకీయ కార్యాచరణ వైపు అడుగులు వేయడమే మాదిగల కు మిగిలిన ‘ఆప్షన్’.

Update: 2024-09-08 05:30 GMT


రిత్రలో ఒక్కొక్కసారి అయాచితంగా కొందరికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఐతే వాటిని సకాలంలో వినియోగించుకుంటూ, దాని నుంచి ప్రయోజనం పొందడానికి  తెలివి ఒక్కటే చాలదు, అందుకు తగిన చాకచక్యం కూడా అవసరం. అది కనుక ఉంటే ఎలా ఉంటుంది అంటే- ‘ఇద్దరం ముద్ద లేకుండా బతుకులు మొదలెట్టిన వాళ్ళమే కనుక, ఏ రోజు ఎలా ఉంటుందో అని, మనం బ్రతకడమే కాదు మనతోపాటుగా నలుగురిని కలుపుకు పోదాం’ అనే మనోవైశాల్యం పెరుగుతుంది.

ఇక్కడ- ‘ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మూడవ చూపు మాటేమిటి?’ అంటున్నప్పుడు, మాదిగల విషయంలో మాలలు చేసిన దానిని, ఇలా కాకుండా మరోలా చూడడం కుదరడం లేదు. ఒక్కరు కాదు వీరిద్దరూ కూడా ఐదుపది కాదు, ఏకంగా ముప్పై ఏళ్ళ విలువైన కాలాన్ని వారి చేజేతులా వృధా చేసుకున్నారు.

ఏమిటి ఈ కాలానికి వున్న ప్రత్యేకత అన్నప్పుడు, ఈ కాలంలోనే అమలులోకి వచ్చిన- ‘మండల్’ కమీషన్ నివేదిక, ఆ వెంటనే మన దేశం అనుసరించిన ఆర్ధిక సంస్కరణలు. వెనువెంటనే వచ్చిన ‘వో.బి.సి (OBC).’ రిజర్వేషన్లు ఇదంతా సరళీకరణ కాలం. దాని ప్రతిఫలనాలపై ఉన్న భిన్న అబిప్రాయాలు మాట అటుంచి, దేశ రాజకీయ పర్యావరణంలో అదొక కొత్త కుదుపు కావడం మాత్రం విస్మరించలేని అంశం. అటువంటప్పుడు, ఈ రెండు మౌలిక అంశాలు మన ‘పొలిటికల్ ఫిలాసఫీ’లో ఎంత ప్రధానంగా ఉండాలి? అది లేకపోవడం వల్లనే కదా ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక న్యాయ అంశం ఇంతగా అభాసుపాలు అయింది.

నూతన ఆర్ధిక విధానం మొదలైన పదమూడు ఏళ్ళకే 2004 తర్వాత మొదలైన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ఎటువంటివి? సమాచార హక్కు చట్టం, వంద రోజులు పనిదినాల ఉపాధి హామీ చట్టం (MGNREGA) విద్యాహక్కు చట్టం, ఆహారపు హక్కు చట్టం, ఇటువంటి చట్టాలు వచ్చింది ఈ కాలంలోనే.

ఇటువంటి ‘సరళీకరణ’ పరిపాలన సాగుతున్న కాలంలో వచ్చిన అనేక అస్తిత్వ ఉద్యమాలలో ఒకటి ‘మాదిగ దండోరా’ (Madiga Dandora). ఒకానొక కాలంలో సహజమైన రీతిలో వచ్చిన సామాజిక పరిణామం తప్ప అది మరొకటి కాదు. అందుకే, వామపక్షాలు, ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు మొదలు అన్ని రాజకీయ పక్షాలు మాదిగల ‘డిమాండ్’కు మద్దత్తు తెలిపాయి. అయినప్పటికీ ఒక్క మాలలకు మాత్రమె మాదిగ (Madiga) ల ‘డిమాండ్’లో హేతువు కనిపించలేదు.

అయినా మాలలలో ఇటువంటి ధోరణి మాదిగలు విషయంలోనే కాదు, మాల ఉపకులాల విషయంలో కూడా అది అందుకు భిన్నంగా లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, తదుపరి వ్యూహంపై చర్చ కోసం ఏ.పి.లో జరుగుతున్న మాలల సమావేశాల్లో వారి ముఖ్యనాయకులు వేదికపై కూర్చుని ఉండగా, వారి ముందు మాల ఉపకులాలలో ఒకటైన ‘మాస్టీన్’ కులస్తులను వేదికపైకి పిలిపించి, వారితో సాముగరిడీ విద్యల ప్రదర్శన ఏర్పాటు చేసి, దాన్ని వారు ఆస్వాదిస్తున్న వీడియోలు ‘యూట్యూబ్’లో ప్రదర్శనకు పెట్టారు.

ఎక్కడిది వీరికి ఈ సంస్కృతి? అది వారిలోని వైదిక ఆలోచనా ధోరణి, దాని నుంచి వచ్చిన ‘ఫ్యూడల్’ లక్షణాలు కావా? ఆ విషయం తెలిసీ వాటిని వీరు అనుమతిస్తున్నారా? లేదా రేపు ఒక పాలక కులానికి ఉండవలసిన లక్షణాలు ఇవి అని బలంగా వారు నమ్ముతున్నారా? అక్కడికి వచ్చిన ఆ ‘మాస్టీన్’ కళాకారులు వేదికపై ఉన్న మాలనాయకుల్ని- ‘ప్రభువులు... మా మాల మహారాజులు...’ అంటుంటే, దాన్ని వారు నిలువరించడం లేదేమి? వీరు పాటిస్తున్నది ఎటువంటి- ‘అంబేడ్కరిజం’?

అయినా ఇంత జరిగాక కూడా ఇప్పటికైనా వెనక్కి తిరిగి గతించిన కాలాన్ని సమీక్షించుకునే సంయమనం లేక, పళ్ళ బిగువున తమ వైఖరిలో న్యాయం ఉందని వాదించడానికి మాలలు సిద్దం అవుతున్నారు. ఇటువంటి వివాదానికి ఏనాటికైనా ఉండే ముగింపు ఏమై ఉంటుందో, స్థలకాలాదులు వివరం తెలిసిన ఎవరికైనా స్పష్టమే. అయినా ఓ క్షణం ఆగి వెనక్కి తిరిగిచూసి తనతో రాలేక, నాలుగు అడుగులు వెనకబడిన వాణ్ని తమతో కలుపుకుని పోదామనే వివరం మాలలకు లేకపోయింది. ‘మాదిగ దండోరా’ మొదలయినప్పుడు అదే కనుక జరిగిఉంటే, ఈ రోజున ‘దళిత మహాసభ’ ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టి కంటే కూడా తీసిపోని ప్రభలమైన రాజకీయ శక్తి అయ్యుండేది.

అయినా మాదిగలతో ‘ఏ.బి.సి.డి.’ (SC Categoriazation) వంటి చిన్న పంపిణీ న్యాయం పంచాయతీ అపరిష్కృతంగా ఉండగానే, వీరు ‘లాల్-నీల్’ (Lal- Neel) అంటూ 2014 నుంచి కమ్యూనిస్టులతో (సి.పి.ఎం) ఉమ్మడి వేదిక పంచుకుంటూ, కొత్తగా సవర్ణ రాజకీయ శక్తిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ‘మాదిగ దండోరా’ ఉద్యమంలో న్యాయం ఉందని మద్దత్తు ఇచ్చిన వామపక్ష పార్టీలు ఇప్పుడు తమకే మరొకరి ఊతం అవసరమైన నిస్సహయ స్థితికి చేరేసరికి మాలలతో కలిసి, ఉన్నట్టుండి ‘కులం’ ఈ దేశంలో విస్మరించే అంశం కాదని కొత్త రాగం అందుకున్నారు.

అందుకు మాలలతో పీటముడి పడిన ‘మాదిగ దండోరా’ వివాదం కూడా పక్కన పెట్టి మాల నాయకులను తమతో కలుపుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ‘మా కదలికకు మార్క్స్- అంబేద్కర్ ఇద్దరూ మాకు రెండు అడుగులు అంటున్నారు’ పోనీ అది నిజం అనుకున్నా వీరి ‘కలయిక’కు ఒక విధాన పత్రం ఏది? అనే విమర్శకు ఈ పదేళ్ళలో వీరిద్దరి వద్ద జవాబు లేదు.

రాష్ట్ర విభజనతో ‘లాల్-నీల్’ అంటూ మాలలు వామపక్షాలతో మొదలెట్టిన ఈ కొత్త కలయిక, వారి ఎన్నికల రాజకీయాల కోసం కనుక అయితే, మొదటి నుంచి ‘రాజ్యాధికారం’ తమ లక్ష్యం అంటూ అన్నిస్థాయిల్లో అందుకు సిద్దమవుతూ వచ్చిన మాలలు, తమ తోటి మాదిగలు కంటే వామపక్షాలు తమకు మెరుగైన జోడీ అని కనుక అనుకుంటే; అప్పుడు మాదిగలు తమ దారి తాము వెతుక్కోవడం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడీ ‘లాల్-నీల్’ కోసం వారిద్దరి మధ్య కొత్తగా కలిసిన ‘కెమిస్ట్రీ’ ఎటువంటిది? అనే విచారణ కూడా మాదిగలకు ఈ దశలో వృధా కాలయాపన అవుతుంది.

ఇప్పటికే ‘ఏ.బి.సి.డి.’ అత్యున్నత న్యాయస్థానం పరిధిలోని అంశం అయ్యి, చివరికది అమలు చేయకతప్పని అంశం అయ్యాక, దాని అమలుకు వారికి తదుపరి స్వతంత్ర రాజకీయ కార్యాచరణ వైపుకు అడుగులు వేయడమే మాదిగల కు మిగిలిన ‘ఆప్షన్’ అవుతుంది. (సశేషం)


Tags:    

Similar News