ఎండల కోసం ఎదురు చూపులు

విజయవాడ నగర వాసులు వర్షాలు, వరదలతో విసుగెత్తి పోయారు. ఎండలు ఎప్పుడు కాస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

Update: 2024-09-10 06:27 GMT

సహజంగా అందరు వర్షాల కోసం ఎదురు చూస్తారు. వర్షాలు వస్తే వ్యసాయానికి అవసరమైన సాగు నీటితో పాటు తాగు నీటి సమస్యలు తీరతాయని, కరువుకు ఆస్కారం లేకుండా పోతుందని భావిస్తారు. వర్షాల వల్ల పంటలు పండి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని ఆలోచనలు చేస్తారు. కానీ ప్రస్తుతం విజయవాడలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నం. ఎండలు కోసం ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల విసిగెత్తి పోయారు. వదరలు, వర్షాలకు తడిసి ముదై్ద కంపుకొడుతున్న వస్తువులను ఎండబెట్టుకునేందుకు ఎండల కోసం ఎదురు చూస్తున్నారు. నేటికీ చిత్తడిగానే ఉండటం వల్ల ఎండలు ఎప్పుడు కాస్తాయోనని ఆశతో ఎదురు చూస్తున్నారు.

రెండు వారాలుగా వదర నీటిలో విజయవాడ నగరం నానుతోంది. దాదాపు 90 శాతం నగరం వరద ముంపునకు గురైంది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరం పక్కనే ప్రవహిస్తున్న కృష్ణా నది పవళ్లు తొక్కుతోంది. నగరానికి ఆనుకుని ఉన్న బుడమేరు, నగరంలోని డ్రెయిన్లు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. బుడమేరు కట్టలు తెంచుకోవడంతో నగరంపై వరద నీరు విరుచుకు పడిపోయింది. దీంతో విజయవాడ నగరం విలవిలలాడి పోయింది. అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక, పైపులరోడ్డు, రాజరాజేశ్వరావుపేటలు, అయోధ్యనగర్, బుడమేరు మద్దికట్ట, శాంతినగర్, ప్రశాంతినగర్, పీఎన్టీకాలనీ, వశిష్ట కాలనీ, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, డాబొకొట్టు సెంటర్ల, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, ప్రజాశక్తి నగర్, గణదల, విద్యాధరపురం, కబేళా, కుమ్మరిపాలెం, కొత్తపేట ఇలా అనేక కాలనీలు, ప్రాంతాలు నీట మునిగి పోయాయి. కృష్ణా నదరి తీరం వెంబడి ఉన్న ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. రీటైనింగ్‌ వాల్‌ నిర్మించినా వరదల నుంచి రక్షణ లేకుండా పోయింది. దానికి ఉన్న రంద్రాల ద్వారా సమీపంలోని కాలనీలన్నీ ముంపునకు గురయ్యాయి. ఆర్‌టీసీ బస్టాండ్‌ నుంచి యనమలకుదురు వరకు రీటైనింగ్‌ వాల్‌కు పక్కన ఉన్న కాలనీలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న వారి కంటే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్న వాసులు సర్వస్వం పోగొట్టుకున్నారు. ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరడంతో కష్టపడి సమకూర్చుకున్న వస్తువులన్నీ వరద నీటి పాలయ్యాయి. తడిసి ముదై్ద పోయాయి. కట్టు బట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. బియ్యం, పప్పు, ఉప్పులతో సహా బట్టలు, పుస్తకాలు, బీరువాలు, ఫ్రెజ్‌లు, టీవీలు, వాషింగ్‌ మిషన్లు, మంచాలు ఇలా అన్నీ వరద నీటికి బలైపోయాయి. బుడమేరు వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఈ రకమైన నష్టం తీవ్రంగానే వాటిల్లింది. కృష్ణా తీరంలో కొన్ని కాలనీల్లో వరద నష్టం తీవ్రంగానే నెలకొంది.
వరదలు తగ్గినా, ఇంట్లో తడిసిన వస్తువులను ఎండబెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. తడిసి ముదై్దన వస్తువుల్లో కొన్నింటినైనా కాపాడుకునేందుకు అవకాశం లేకండా పోయిందని, ఆరబెట్టుకునేందుకు కూడా వాతావరణం సహకరించడం లేదని తారకరామనగర్‌కు చెందిన దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు చివరి వారం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు వారాలుగా ఇదే పరిస్థితులు నెలకొనడంతో అటు వర్షాలకు, ఇటు వరదలకు విసుగెత్తి పోతున్నామని అన్నారు. వరదలు లేకుండా వర్షాలు కురిస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవని, కానీ విజయవాడలో వర్షాలు పడితే తరచుగా వరదలు చోటుచేసుకోవడం వల్ల ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయని పోలీసు కాలనీకి చెందిన సునీల్‌కుమార్‌ చెప్పారు.
Tags:    

Similar News