అనంతపురం జిల్లాలో లోకేష్‌ మూడు రోజుల పర్యటన

గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి అనంతపురం జిల్లాలోనే బస చేయనున్నారు.;

Update: 2025-05-15 06:05 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అనంతపురం జిల్లాలో పర్యటన చేయనున్నారు. అనంతపురం జిల్లాలో గురువారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పొల్గొననున్నారు. కడపలో జరగనున్న మహానాడుకు సిద్ధం కావాలని సూచించనున్నారు. భవిష్యత్‌ కార్యక్రమాల గురించి దిశా నిర్థేశం చేయనున్నారు. గురువారం రాత్రికి అనంతపురంలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రూ. 22 వేల కోట్లతో చేపట్టనున్న రీన్యూ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతపురం జిల్లాలో రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్ట నున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టు. గుంతకల్లు అసెంబ్లీ నియోజక వర్గం బేతపల్లిలో ఈ ఎనర్జీ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్ట నున్నారు. దీని కోసం ఇది వరకే మంత్రి నారా లోకేష్‌ చర్చలు జరిపారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో మంత్రి నారా లోకేష్, రీన్యూ చైర్మన్‌ సుమంత్‌ సిన్హాల మద్య జరిగిన చర్చల్లో దీని గురించి ప్రస్తావించారు.

అక్కడ నుంచి మధ్యాహ్నం బయలుదేరి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహానికి మంత్రి నారా లోకేష్‌ హజరు కానున్నారు. శుక్రవారం రాత్రికి కూడా అనంతపురంలోనే లోకేష్‌ బస చేస్తారు. మే 17 శనివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే జేఎన్టీయూ స్నాతకోత్సవం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొంటారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
Tags:    

Similar News