మద్యం మాఫియా గుప్పెట మందు బాబుల విలవిల
కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ లో విషపు జాడ్య మైంది. చక్రంలో తిరిగే బంతిలా మద్యం ప్రియులు కల్తీ మద్యం దారుల చేతుల్లోకి చెప్పకుండా వెళ్లారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఒక చిన్న గ్రామం.. ఒక సాధారణ ఇల్లు.. కానీ లోపల? విషపు ఫ్యాక్టరీ! రూ.1.75 కోట్ల విలువైన కల్తీ మద్యం, 10 మంది నిందితుల అరెస్ట్, టీడీపీ నుంచి ఇద్దరు నేతల సస్పెన్షన్.. ఈ కల్తీ మద్యం తయారీ ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇది కేవలం మద్యం కథ కాదు.. రాజకీయ క్రినీడ. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం ములకలచెరువులోని కదిరినాథునికోటలో ఒక ఇంట్లో దాగిన రహస్యం బయటపడింది. ఎక్సైజ్ పోలీసుల దాడిలో 1,470 లీటర్ల కల్తీ మద్యం, 421 బాక్సుల్లో 41 బాటిళ్ల చొప్పున నింపిన డంప్, 30 లీటర్ల క్యారమల్, వేలాది ఖాళీ సీసాలు, ఫేక్ లేబుల్స్, క్యాపులు ఉన్నాయి. ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు!
అడ్మిరల్ బ్రాంది, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్.. ఈ పేర్లతో విషం నింపి మార్కెట్‌లోకి పంపారు. ఇబ్రహీంపట్నంలో 22,000 ఖాళీ బాటిళ్లు, 90 క్యాన్ల మద్యం పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఇది కేవలం మద్యం కాదు.. ప్రజల ఆరోగ్యంతో ఆట! మద్యం ప్రియుల లొంగుబాటును ఆసరా చేసుకున్న మద్యం వ్యాపారులు ఆడిన, ఆడిస్తున్న మాయావి ఆట.
ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం యూనిట్
నిందితులు ఎవరు?
మొత్తం 14 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. 10 మంది అరెస్ట్ అరెస్ట్ అయ్యారు. మిగిలిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కొందరు పరారీలో ఉన్నారు. ఈ కేసు నిందితుల వివరాలు ఎక్సైజ్ శాఖ రిపోర్టుల ఆధారంగా పరిశీలిస్తే... నిందితుల్లో చాలామంది తమిళనాడు, ఒడిషా నుంచి వచ్చిన కార్మికులు, స్థానికులు.
వరుసనెం. | పూర్తి పేరు | వివరాలు / పాత్ర |
1 | అద్దేపల్లి జనార్ధన రావు (Addepalli Janardhana Rao) | ప్రధాన నిందితుడు, విజయవాడ బార్ లైసెన్స్ ధారకుడు. తయారీ, సరఫరా నిర్వహణ. (విదేశంలో దాగి ఉన్నాడు, అరెస్ట్ కాని నిందితుడు) |
2 | అద్దేపల్లి జగన్ మోహన్ రావు (Addepalli Jaganmohan Rao) | జనార్ధన రావు సోదరుడు. ఇబ్రహీంపట్నం ANR బార్‌లో బాట్లింగ్. అరెస్ట్. |
3 | దాసరిపల్లి జయచంద్రారెడ్డి (Dasaripalle Jayachandra Reddy) | తంబళ్లపల్లి మండలం TDP ఇన్-చార్జ్. సస్పెండ్. తయారీలో సహకారం. (దర్యాప్తులో ఉన్నారు, అరెస్ట్ కాని వ్యక్తి) |
4 | కట్టా సురేంద్ర నాయుడు (Katta Surendra Naidu) | స్థానిక TDP నేత. సస్పెండ్, అరెస్ట్. సరఫరాలో పాత్ర. |
5 | కట్టా రాజు (Katta Raju) | సురేంద్ర సంబంధితుడు. ఇబ్రహీంపట్నంలో అరెస్ట్. సరఫరా దారు. |
6 | రాజేష్ (Rajesh) | రాక్‌స్టార్ వైన్స్ (ములకల చెరువు) ఓనర్. అరెస్ట్. స్థానిక షాపు ద్వారా సరఫరా. |
7 | మరిమరన్ (Marimaran) | తమిళనాడు నుంచి వచ్చిన కార్మికుడు. తయారీలో పాల్గొన్నాడు. అరెస్ట్. |
8 | సురేష్ (Suresh) | తమిళనాడు/స్థానిక కార్మికుడు. అరెస్ట్. |
9 | సూర్య (Surya) | కార్మికుడు. అరెస్ట్. |
10 | అనందన్ (Anandan) | తమిళనాడు కార్మికుడు. అరెస్ట్. |
11 | అనందదాస్ (Anandadas) | కార్మికుడు. అరెస్ట్. |
12 | మితున్ (Mithun) | కార్మికుడు. అరెస్ట్. |
13 | సయ్యద్ అలీ (Syed Ali) | కార్మికుడు. అరెస్ట్. |
14 | నాగరాజు (Nagaraju) | స్థానిక కార్మికుడు. అరెస్ట్. |
తొమ్మది మంది ఇంటిపేర్లు రికార్డుల్లో లేవు. తరువాత పోలీసులు వారిని సమగ్రంగా విచారించి రాస్తారని పోలీస్ శాఖ వారు చెబుతున్నారు.
అరెస్ట్ కాని నిందితులు
కొడాలి శ్రీనివాసరావు (Kodali Srinivas Rao): 12వ నిందితుడు. గుంటూరులో ఇంటి సోదాలు జరిగాయి. సరఫరా లింక్ ఇతని వద్దే ఉంది.
1,2 నిందితుల డైరీలో 78 బార్ షాప్ ఓపరేటర్ల పేర్లు ఉన్నాయి. కానీ పూర్తి వివరాలు దర్యాప్తులో బయటకు రావాల్సిందే. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు సమాచారం మారుతూ వస్తోంది.
ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్థన్ రావు (విజయవాడ బార్ లైసెన్స్ హోల్డర్) విదేశంలో దాక్కున్నాడు. అతను చెప్పిన పేరు కట్టా రాజు. ఇతన్ని ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేశారు. ఈ విషపు జాడ్యం ఇబ్రహీంపట్నం నుంచి ప్రభుత్వ డిపోలకు సరఫరా అయ్యింది. ములకల చెరువు, పెద్ద తిప్పసముద్రం షాపులు పోలీసులు సీజ్ చేశారు.
ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం నిల్వలు
టీడీపీలో కలకలం!
ఈ కల్తీ మద్యం కుంభకోణంలో రాజకీయ రంగు లేకపోలేదు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, స్థానిక నేత కట్టా సురేంద్ర నాయుడు లను ఇద్దరినీ టీడీపీ సస్పెండ్ చేసింది. సురేంద్ర నాయుడు అరెస్ట్ అయ్యాడు. జయచంద్రారెడ్డిపై దర్యాప్తు జరుగుతోంది. వీరి పాత్ర? తయారీ, సరఫరాలో సహకారం ఏమిటనే అంశంపై సమగ్రమైన దర్యాప్తులో కాని అసలు నిజాలు బయటకు రావు. టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఫైర్ సోమవారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ "ఇద్దరూ మాజీ టీడీపీ నేతలు. కల్తీ మద్యం మాఫియాకు ఆశ్రయం!" వైఎస్సార్‌సీపీ నేత జగన్ మోహన్ రెడ్డి కారకుడు అంటూ ఆరోపించారు.
వైఎస్సార్సీపీ వారు ఆరోపణలు చేస్తూ "చంద్రబాబు పాలనలో మద్యం మాఫియా విజృంభిస్తోంది." అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు తీవ్రంగా స్పందించారు. "ఇది వ్యక్తిగత దోషం, పార్టీకి సంబంధం లేదు!" అని తెలుగుదేశం పార్టీ వారు అంటున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలాంటి కల్తీ మద్యం తయారీ జరిగిందా? ఈ ఇంట్లో తయారీ ఉందా? ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తేల్చాలి.
ములకల చెరువు ఎందుకు?
ఈ గ్రామం ఎందుకు ఎంచుకున్నారు? రిమోట్ లొకేషన్, పోలీస్ దృష్టి తప్పించడం సులభమని భావించారా? లేక రాజకీయ బ్యాకింగ్ ఉందని ఇక్కడ చేపట్టారా అంటే...? ఈ ప్రశ్నలు ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మార్కెట్‌లో 30 శాతం బాటిళ్లు కల్తీ అని విపక్షం ఆరోపణ. ఇది నిజమైతే? పేదలు, కూలీలు, కార్మికులు కొనే చౌక బాటిళ్లలో విషం ఉన్నట్లే.
కల్తీ అంటే ఏమిటి? ఎలా గుర్తించారు?
కల్తీ అంటే అనుమతి లేని తయారీ కాదు. చౌక రసాయనాలు, క్యారమల్, హానికర పదార్థాలు కలిపి విషపు మద్యం! ఎక్సైజ్ పోలీసులు బార్‌కోడ్ స్కాన్, ఫేక్ లేబుల్స్, తమిళనాడు-ఒడిషా కార్మికుల టీమ్‌తో గుర్తించారు.
భారీగా మద్యం క్యాన్లు
ప్రభుత్వ స్పందన?
సీఎం చంద్రబాబు "కల్తీ మద్యం అరికట్టాలి" అని ఆదేశాలు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కమిషనర్ శ్రీధర్ హామీ ఇస్తూ ఈ కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. "కఠిన చర్యలు తీసుకుంటాం." కానీ ఇది మాటలతో ఆగిపోతుందా? లేక చర్యలు చూస్తామా? పోలీసుల పనితీరు చెప్పాలి. కల్తీ మద్యానికి పాల్పడిన వారు తెలుగుదేశం పార్టీ వారైనా అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు.
మద్యం ప్రియుల గ్లాస్‌లో విషమా?
ఆంధ్ర ప్రజలారా ఈ కల్తీ మద్యం వ్యాపారం మీ ఆరోగ్యంతో ఆట! మద్యం కొనేటప్పుడు బార్‌కోడ్ చూస్తారా? బ్రాండ్ వెరిఫై చేస్తారా? లేక చౌక ధరకు లొంగిపోతారా? కల్తీ మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. మరణాలను మిగుల్చుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు రాష్ట్రాన్ని వణికించాయి. రాజకీయ నేతలు, మద్యం మాఫియా.. ఈ నెక్సస్ ఎంత లోతైనదో ఊహించండి. ప్రభుత్వం బాధ్యత? డిపోల్లో రెగ్యులర్ చెక్స్, కెమికల్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు. కానీ అమలు ఎక్కడ?
ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం నిల్వ ఉంచిన గోడౌన్
రాజధాని చుట్టపక్కలే కల్తీ మద్యం
ములకలచెరువులో తయారైన కల్తీ మద్యం విజయవాడకు ఎలా చేరింది. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నానికి ఎలా చేరుకుంది. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఏమి చేస్తోంది. ఇంత భారీ మొత్తంలో ప్రతి రోజూ ఇబ్రహీంపట్నం వరకు వచ్చి షాపులకు సరఫరా అవుతూందంటే ఇందులో తప్పకుండా ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. విజయవాడ, గుంటూరు, నగరాలు, చుట్టుపక్కల గ్రమాల్లోని బార్లు, వైన్ షాపుల్లో భారీ ఎత్తున కల్తీ మద్యం సరఫరా అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ములకలచెరువు, పెద్ద తిప్పసముద్రం షాపులు పోలీసులు సీజ్ చేశారు. ఈ షాపుల్లో కల్తీ మద్యం పూర్తి స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
30 శాతం కంటే ఎక్కువే సరఫరా
అందరూ అంటున్నట్లుగా కొన్ని షాపులకు కల్తీ మద్యం 30 శాతం చేరి ఉండొచ్చు. కానీ రాజధాని ప్రాంతంలో కల్తీ మద్యం వ్యవహారం దాదాపు 50 శాతం పైనే ఉంటుందని మద్యం ప్రియులు అంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తకొత్త బ్రాండ్స్ బ్రాంది షాపుల్లోకి వచ్చి ఇష్టమైతే కొనండి. లేకుంటే వెళ్లిపోండి అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు హూంకరించాయి. అప్పట్లోనూ ఇలా కల్తీ మద్యం సరఫరా కాలేదని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ చూడని బ్రాండ్స్ బ్రాంది షాపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇలా భారీగానే కల్తీ మద్యం షాపులకు సరఫరా అయిందని మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిల్స్
మార్పు కోసం గళమెత్తండి!
ప్రజలారా, మీ ప్రాణాలు రాజకీయ బెట్టింగ్‌లో పావులు కాకూడదు. కల్తీ మద్యం మాఫియాపై కఠిన చట్టాలు, రెగ్యులర్ రైడ్లు, పారదర్శక వ్యవస్థ కావాలి. రాజకీయాలు మారాలి, మాఫియా మూలాలు తెగనరకాలి. ఈ కల్తీ కాండ మీలో ఆగ్రహం రగిలించాలి, మార్పు కోసం డిమాండ్ చేయాలి. లేకపోతే మరో ములకల చెరువు, మరో విషపు ఫ్యాక్టరీ.. మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.