ఆంధ్రాలో ‘లిక్విడ్ పాలిటిక్స్’ మొదలు

పదేళ్ల విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు-1 జాన్సన్ చోరగుడి విశ్లేషణ

Update: 2024-07-18 05:55 GMT

రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు, గడిచిన ఐదేళ్లలో ఆసక్తికరమైన పరిణామ క్రమం కనిపించింది. ఏపీలో 2024 నాటికి నెలకొని ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల కోసం ఇప్పటికి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం 1994లో జరిగిన ఎన్నికల ముందు, పంజాబ్ కు చెందిన మాజీ రక్షణ శాఖ అధికారి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం ఏడాది పాటు హైదరాబాద్ లో ‘క్యాంప్’ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం అప్పట్లో ఆయన వెతుకులాడారు.

అప్పట్లో ఒక దశలో ఎన్టీఆర్.. కాన్షీరాంతో సమాలోచనలు కూడా జరిపారు. చివరికి ఆయన ఆశించిన సామాజిక సమీకరణాలు ఇక్కడ లేవని నిర్ధారించుకున్నాక, కాన్షీరాం తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే, అప్పట్లో ఆయన ప్రయత్నం ఫలించి ఉత్తరప్రదేశ్ లో 1995లో సమాజ్‌వాదీ పార్టీ మద్దత్తుతో బిఎస్పీ నుంచి మాయావతి దేశంలో తొలి ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యారు. అవే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ను ఓడించి ఎన్టీఆర్ గెలవడంతో- 1995లో చంద్రబాబు (సిబిఎన్) ‘మార్క్’ టిడిపి రాజకీయాలకు తెలుగునాట మార్గం సుగమం అయింది.

అప్పటి నుంచి యూపీ–ఏపీ రాజకీయాలు రైలు పట్టాలు మాదిరిగా సమాంతరంగానే ఉంటూ ఎక్కడా సారూప్యత లేని రీతిలో ఉన్నాయి. ఉత్తర-దక్షిణాన ఉన్న రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాల పైబడిన ఆర్థిక సంస్కరణల ప్రభావం దేశ సామాజిక రంగం మీద ఆయా రాష్ట్రాలను బట్టి ఎక్కువ తక్కువగా కనిపించడం అయితే కాదనలేనిది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వెనుక ఉన్నది కూడా ఈ సంస్కరణల కాల ప్రభావమే. అలాగే సంస్కరణలలోని ‘సరళీకరణ’ అంశం మన వద్ద సిబిఎన్ సరికొత్త- ‘ద్రవ రాజకీయాలకు’ (‘లిక్విడ్ పాలిటిక్స్’) ప్రాతిపదిక అయింది.

ద్రవ లక్షణం సులభ ప్రవాహం కనుక దాన్ని మనం ఏ పాత్రలో పోస్తే ఆ- ‘షేప్’కు అది మారుతుంది. టిడిపి రాజకీయాలు 2004 నుంచి చూసినప్పుడు ఒకసారి వామపక్షాలతోను, మరోసారి బిజేపితోను సర్దుబాట్లు ఇప్పటికే చూశాము. మారుతున్న కాలంతో పాటుగా సిబిఎన్ దాన్ని ‘అడాప్ట్’ చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా కాంగ్రెస్‌తో కూడా కలిశారు.

అయితే ‘సరళీకరణ’ ను తమకు తగినట్టు ‘అడాప్ట్’ చేసుకుకోవడం అనేది, ఏ ఒక్కరి గుత్త సొత్తో కాదు కనుక, సంస్కరణలు మొదలైన పదేళ్ళకే వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు, 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛతీస్‌గఢ్, బీహార్ నుంచి ఝార్ఖండ్ లు విడిపోయాయి. మరో పదేళ్లకు ఈ రాష్ట్రాల సరిహద్దున ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. విభజనకు వ్యతిరేకంగా ఆధిపత్య వర్గాల నాయకత్వంలో జరిగిన సమైఖ్యాంధ్ర ఉద్యమానికి వారు ఎన్ని కారణాలు చెప్పినా చివరికి దాన్ని వారు ఆపలేక పోయారు. అయితే ‘సరళీకరణ’ అనబడే ‘లిబరలైజేషన్’ ఉపరితలాల్లో పైకి కనిపించకుండా లోపల ఉంటూ, అది భూగర్భ పొరలలోకి చొచ్చి దాన్ని మొత్తంగా కుదిపే తాత్విక అంశం.

అది- ఈ ముప్పై ఏళ్లలో ఐదు కొత్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణం అయితే, ఆ రాష్ట్రాల్లో కొత్తగా- ‘ఝార్ఖండ్ ముక్తి మోర్చా’ వంటి కొత్త ప్రాంతీయ పార్టీలు అధికారాల్లోకి వచ్చాయి. అలా 1947 తర్వాత జరిగిన రాష్ట్రాల విభజన వల్ల కొత్త సమాజాలకు అవకాశాలు వచ్చాయి. ఇక్కడ కూడా ‘టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ’ వంటి కొత్త ప్రాంతీయ పార్టీలు ఈ విభజన క్రమంలోనే ఏర్పడ్డాయి. ఇటువంటి జాతీయ పరిణామం చూసినప్పుడు, ప్రాంతాల మధ్య విభజన జరిగిన తర్వాత గానీ, ముప్పై ఏళ్ల క్రితం కాన్షీరాం ఆశించిన కులాలవారీగా విడిపోయిన రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏర్పడ లేదు.

ఇప్పటికీ కొందరు దీన్ని ‘నెగిటివ్’ దృష్టి నుంచి చూసినా, గడచిన పదేళ్ళలో అది ‘మర్యాద’ ముసుగును తొలగించుకుని మరీ ‘ఓపెన్’గా మనమధ్య స్థిరపడింది. గడచిన పదేళ్ళలో ఎపిలో కులాల పేర్లు ఎత్తి మరీ మాట్లాడుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. ‘మీడియా’ కూడా అందుకు మినహాయింపు కాదు. కనుక బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ‘కులం’ పోషించే సూక్ష్మ స్థాయి పాత్రను, ఒక సామాజిక నమూనాగా ఏపిలో ఇకముందు మనం అన్వయించి చూడవచ్చు. ఇప్పుడు అదేమంత ‘బూతు’ అవదు. ఎంత త్వరగా ‘కులం’ విషయంలో మన వైఖరి ఏమిటో మనం స్వీయ ప్రకటన చేసుకుంటే, అంత మేర మనకు సమయం వృధా అవదు.

అయితే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత, ఏపిలో నెలకొని ఉన్న సామాజిక రాజకీయ సమీకరణాలను చూసినప్పుడు, ఇప్పటికే అవి కాన్షీరాం దృష్టి దాటి విస్తరించాయా? అనేది ‘కేస్ స్టడీ’ అవుతుంది. అలా కావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది- గత ప్రభుత్వం కోనసీమ జిల్లాకు పేరు మార్చినప్పుడు, మే 2022లో అమలాపురంలో జరిగిన ఆందోళన, ధ్వంసం, గృహదహనాలు విభజిత ఏపి చరిత్రలో మొదటి సామాజిక కారణంగా జరిగిన హింసాత్మక సంఘటన. అన్ని రాజకీయ పార్టీలు సామాజికంగా అదొక సున్నితమైన తొలికూతగా గుర్తించాలి.

రెండవది- కొంచెం లోతైన విస్తృతమైన చర్చ అవసరమైనది. కాపు కులం నుంచి ముఖ్యమంత్రి రావాలి, అంటూ తన సొంత జిల్లా చిత్తూరు నుంచి కాకుండా గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు, తిరుపతి మాజీ కాంగ్రెస్ ఎంపి చింతా మోహన్ కొంత కాలంగా కోరుతున్నారు. ఆయన ఆశకొద్దీ రేపు అదే కనుక జరిగితే, ఆ తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రి అవుతారు, అనేది ఉద్దేశ్యం కావొచ్చు. నిజానికి వారు అటువంటి అవకాశం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు.

ఈ మొత్తాన్ని సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల పూర్వరంగం సరైన ‘ఎరీనా’ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లో 1995లో సమాజ్‌వాదీ పార్టీ మద్దత్తుతో బిఎస్పీ నుంచి మాయావతి తొలి ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో తొలి ఎస్సీ ముఖ్యమంత్రిగా ఆమె చెప్పుకోదగ్గ పరిపాలనా సంస్కరణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ‘ఎస్సీ సిఎం’ కాకపోయినా, ఓసీలోని పేదలు నుంచి అన్ని కులాలలోని పేదల వరకూ అందరికీ 2019-2024 మధ్య గరిష్ట స్థాయిలో సంక్షేమ ఫలాలు అందాయి.

కేవలం ఆర్థిక పరమైన ఊరట లభించడమే కాకుండా, ఈ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన వైఖరి కారణంగా- ‘పవర్ పాలిటిక్స్’ స్థానంలోకి సూక్ష్మ స్థాయికి ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ప్రవేశించి, శ్రేణుల సాధికారికతను (‘ఎంపవర్ మెంట్’) శక్తివంతం చేసింది. ఇక ఇప్పుడు చివరి మైలు వరకు ‘డెలివరి’ ప్రధానం తప్ప, రాజకీయ పార్టీల పట్ల ప్రజల విశ్వాసంతో పెద్దగా పని ఉండదు. శ్రేణులలో కూడా మొదలైన ఇటువంటి ‘లిక్విడ్ పాలిటిక్స్’ ధోరణి కారణంగా ఇకముందు ప్రయోజనం ప్రధానం తప్ప ముఖ్యమంత్రి కులం ఏది? అనేది ప్రజల తీర్పుకు ప్రాతిపదిక కాకపోవచ్చు.

Tags:    

Similar News