గోదావరి డెల్టా ఆధునీకరణకు లైడార్ సర్వే

ముంపు సమస్యలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు

Update: 2025-12-09 12:43 GMT
ఇరిగేషన్ అధికారులతో సచివాలయంలో సమీక్షిస్తున్న మంత్రి రామానాయుడు

గోదావరి డెల్టాలో ముంపు సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇరిగేషన్ సమస్యలను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డెల్టా ప్రాంతంలో లైడార్ సర్వే నిర్వహణకు రూ.13.4 కోట్లు మంజూరు చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ డిసెంబర్ నాటికి గోదావరి జిల్లాల్లో ముంపు సమస్యలు, లాకులు, గేట్ల మరమ్మత్తులకు సమగ్ర డీపీఆర్ తయారు చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.

లైడార్ (LiDAR - Light Detection and Ranging) సర్వే అంటే లేజర్ పల్సెస్ ఉపయోగించి భూమి దూరాలను కొలిచి, అధిక రిజల్యూషన్‌తో 3D టోపోగ్రఫిక్ మ్యాప్స్ సృష్టించే రిమోట్ సెన్సింగ్ పద్ధతి. ఇది నీటి వనరుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఫ్లడ్ రిస్క్ అసెస్‌మెంట్, డ్రైనేజ్ ప్లానింగ్, వాటర్ మూవ్‌మెంట్ అనాలిసిస్, టెరైన్ మోడలింగ్, ఎరోషన్ మానిటరింగ్ మరియు ఫ్లడ్ ప్రిడిక్షన్ వంటి అంశాల్లో లైడార్ డేటా ఉపయోగపడుతుంది. రివర్ బేసిన్లు, ఫ్లడ్ ప్లైన్లలో లేజర్ పల్సెస్ ఎమిట్ చేసి, రిఫ్లెక్టెడ్ లైట్‌ను క్యాప్చర్ చేసి డేటా సేకరిస్తారు. ఇది ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో హై-రిస్క్ ఏరియాలను గుర్తించడానికి, డ్రైనేజ్ సిస్టమ్స్ డిజైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది భూమి ఎలివేషన్ డేటాను ఖచ్చితంగా అందిస్తుంది.

గత 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో గోదావరి డెల్టా మోడర్నైజేషన్‌కు నిధులు ఉన్నప్పటికీ పనులు చేయకపోవడమే కాకుండా, సగంలో ఉన్న పనులను ప్రీక్లోజర్ చేసి, 150 ఏళ్లలో ఎవరూ చేయలేనంత ద్రోహం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఆధునీకరణ పనులు మధ్యలోనే నిలిపేయడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య తలెత్తిందని, లాకులు, గేట్ల మరమ్మత్తు పనులు, డ్రైన్లలో పూడిక తీత, ఏటిగట్ల బలోపేతం వంటి పనులు నిలిచిపోయాయని అన్నారు. దీంతో పంటలు నాశనమై, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారంగా పేరున్న గోదావరి డెల్టాలో ఇప్పుడు మొదటి పంట వేయలేని పరిస్థితి వచ్చిందని, రెండో పంట మాత్రమే వేయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గోదావరి డెల్టాకు పూర్వవైభవం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వెంటనే లైడార్ సర్వే పూర్తి చేసి, డెల్టా ఆధునీకరణ పనులు మొదలుపెట్టాలని సూచించారు.

గత ప్రభుత్వంలో నిధులు ఉన్నప్పటికీ కాలువలు, డ్రైన్లలో మట్టి తీయకపోగా, లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి కూడా ఒక్క రూపాయి విడుదల చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజికి కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.150 కోట్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ చర్యలతో గోదావరి డెల్టా రైతులకు ఊరట లభించనుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News