ఇంటర్వ్యూ కోసం బయలుదేరి మృత్యువు ఒడికి చేరింది
కూతురి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. సాఫ్ట్‌వేర్ జాబ్‌తో తిరిగి వస్తుందనుకుంటే శవమై వచ్చిందని బోరున విలపిస్తున్నారు.;
హోమిని కల్యాణి ప్రస్తుతం ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఫైనల్ ఇయ్యర్‌లో ఉండగానే ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది. జాబ్‌లో సెటిల్ అయిన తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని పరితపించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ బయలు దేరింది. జాబ్ తప్పకుండా వస్తుందని, మీరేమి దిగులు పడొద్దని తల్లిదండ్రులకు చెప్పింది. కూతురుకి జాబ్ వస్తుందనే సంతోషంలో వారు ఉన్నారు. కానీ కల్యాణిని దురదృష్టం వెంటాడింది. యముడు ఆమెను వెంటాడాడు. మృత్యువు పగబట్టింది. ఇంటర్వ్యూకెళ్లి జాబ్‌తో సంతోషంగా తిరిగి రావలసిన ఆ యువతి డ్రైవర్ చేసిన తప్పుకు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక గుండెలు బాదుకుంటున్నారు. కూతురి భవిష్యత్‌ను ఎంతో ఉన్నతంగా ఉంటుందని కలలు కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురైనా ఓ కొడుకులా తన కుటుంబానికి అండగా ఉంటుందని ఆశ పడిన ఆ తల్లిదండ్రులను శోక సముద్రంలో మునిగి పోయారు. అత్యంత బాధాకరమైన ఈ దుర్ఘటన విశాఖపట్నం మర్రిపాలెంలో చోటు చేసుకుంది.