కాంగ్రెస్‌లోకి ఆమంచి కృష్ణమోహన్
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మూడో సారి ఓటమి చెందారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-04-10 11:09 GMT
చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, రెండో సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మూడో సారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఐదేళ్ల కాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తిరిగి చీరాల టిక్కెట్ ఆశించిన కృష్ణమోహన్‌కు చీరాల టిక్కెట్ దక్కలేదు.
వైఎస్సార్ అంటే ఎంతో అభిమానం
వైఎస్సార్‌పై అభిమానంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చెప్పిందే జరగాలనుకునే వ్యక్తి. ఆయన వద్ద ఆమంచి మాటామంచి పనిచేయడం లేదు. దీంతో ఆపార్టీలో ఉండటం కంటే పూర్వపు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు వైఎస్‌ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల వచ్చారు. ఆమె వైఎస్సార్ ఆశయాలు నెరవేర్చగలరనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అందువల్ల ఆమెతో రాజకీయ పయనం మంచిదని భావించిన ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కలిసారు. కాంగ్రెస్ పార్టీలో మారిన పరిణామాలు, జరుగుతున్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో చర్చించారు. తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిలతో చెప్పినట్లు సమాచారం. అయితే అధికారికంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించలేదు.
కరణం వెంకటేష్‌ను ఓడించాల్సిందేనట..
చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని ఓడించి తీరాలనే పట్టుదలతో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచిన బలరామ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో చీరాల రాజకీయ చరిత్ర కొత్తపుంతలు తొక్కింది. అప్పటి వరకు ఏకచ్ఛత్రాదిపత్యంగా వ్యవహరించిన ఆమంచి కృష్ణమోహన్‌కు చుక్కెదురైంది. దీంతో ఆయనను పర్చూరు ఇన్‌చార్జ్‌గా నియమించారు. చీరాల టిక్కెట్ తిరిగి బలరామ్ కుమారుడు వెంకటేశ్‌కు వైఎస్సార్‌సీపీ కేటాయించింది. దీంతో అక్కడ బెర్త్‌లేకుండా పోయింది. ఎలాగైనా చీరాల నుంచి గెలిచి చూపించాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు సాధిస్తాననే నమ్మకంలో ఆమంచి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అందుకు అడ్డుగా మారే అవకాశం ఏమైనా ఉందా? లేక కలిసొస్తుందా? అనే అంశంపై కూడా ఆయన సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతున్నారు. ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు ఆమంచి వచ్చారని సన్నిహితుల ద్వారా సమాచారం అందింది.
అన్నా తమ్ముళ్లు ఒకటయ్యారు...
ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన పార్టీలో చేరి తిగిరి రాజీనామా చేశారు. ఆయన కూడా తమ్ముడి గెలుపుకోసం గతంలో పనిచేసినట్లుగానే చేయాలనే ఆలోచనకు వచ్చారు. అన్నాతమ్ముళ్లు కలిసి ఎన్నికల్లో పనిచేసి తిరిగి విజయం సాధించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం వెంకటేష్‌పై ఓటర్లకు సదాభిప్రాయం లేదని, ఎంఎం కొండయ్య కూడా అందుబాటులో ఉండడనే ఆలోచనను ఓటర్లలో కలిగించడంలో ఆమంచి సక్సెస్ అయ్యారని పలువురు రాజకీయ శిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎన్నికల్లో ఆమంచి గెలుసు నల్లేరుపై నడకేననే వాదన కూడా చాలా మంది ఓటర్లలో ఉంది. పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో స్వాములును మించిన వారు లేదనే ప్రచారం కూడా సాగుతోంది. అంటే గతంలో ఆ విషయంలో స్వాములు తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు తమ్ముడి గెలుపును సునాయాసం చేశాయి. అందువల్ల అన్న స్వాములు తమ్ముడి గెలుపులో భాగస్వామి అవుతున్నందున ఇక చీరాలలో వెనుకంజకు తావులేదనే వాదన కూడా ఉంది.
అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి..
చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పేరును ప్రకటించడమే తరువాయని పలువురు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీల సీట్లు పోను మిగిలిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇంకా మరో 29 సీట్ల వరకు ప్రకటించాల్సి ఉంది.