‘పవన్‌ను విమర్శిస్తే ప్రతిఘటిస్తా’.. ముద్రగడకు కూతురు కౌంటర్..

పవన్‌పై ముద్రగడ పద్మనాభరెడ్డి చేసిన విమర్శలకు ముద్రగడ కూతురు క్రాంతి ఘాటుగా స్పందించారు. శేష జీవితాన్ని ఇంటికి పరిమితై గడపాలని సలహా కూడా ఇచ్చారు.

Update: 2024-06-22 07:05 GMT

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు క్రాంతి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ కల్యాణ్ విషయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. పవన్ ఓడించకుంటే తన పేరు మార్చుకుంటా అన్న ముద్రగడ శపథాన్ని క్రాంతి అప్పట్లో తప్పుబట్టారు. ‘నాన్న ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నాన్న చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకే కాదు నాకు కూడా నచ్చడం లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ విజయానికి తాను కృషి చేస్తానని వెల్లడించారు. కూతురు వ్యాఖ్యలకు ముద్రగడ కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాంతో అన్న మాట ప్రకారం ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ఈ మేరకు ఆయన తన గెజిట్‌ను కూడా విడుదల చేశారు.

ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అధికార పార్టీల అభిమానుల నుంచి వస్తున్న విమర్శలపై తాజాగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. ‘‘మమ్మల్ని తిట్లతో ఇంతలా హింసించే కన్నా చంపేయండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను అసమర్థుడనని, చేతకాని వాడనని ఒప్పుకుంటున్నానని, మరి అన్నిటికీ సమర్థుడైన పవన్ కల్యాణ్.. కాపుల చిరకాల కోరికను నెరవేర్చాలని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాజాగా ముద్రగడ చర్యలపై ఆయన కూతురు క్రాంతి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మారింది పేరొక్కటే

మారింది మా నాన్న పేరొక్కటే తీరు కాదంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా క్రాంతి పోస్ట్ పెట్టారు. ‘‘మా తండ్రి ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన పేరు మార్చుకున్నారు గాని అలోచనా విధానం మార్చుకోక పోవడం ఆందోళనగా ఉన్నది. జగన్ మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని ఆయనకు పవన్ కల్యాణ్‌ను ప్రెశ్నించే అర్హత ఉందా? తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డి గా మార్చుకున్న తర్వాత కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి, యువత భవిష్యత్ ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్థం కావడం లేదు. ఏం చేయాలి అన్న విషయంపై పవన్ కల్యాణ్‌కు ఒక స్పష్టత ఉంది. కానీ మా నాన్నకే స్పష్టత లేదనిపిస్తోంది. ఆయన తన శేషజీవితం ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాలని ఒక కూతురుగా సలహా ఇస్తున్నాను. అలా కాదని మళ్ళీ పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తాను’’ అంటూ పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News