మళ్లీ మారిన కడప జిల్లా పేరు
తాము అధికారంలోకి వస్తే కడప జిల్లా పేరు మారుస్తామని గతంలో చంద్రబాబు కడప పర్యటనలో హామీ ఇచ్చారు.;
By : The Federal
Update: 2025-05-26 12:07 GMT
కడప జిల్లాకు మళ్లీ పేరు మార్చారు. వైఎస్‌ఆర్ జిల్లాకు బదులుగా వైఎస్‌ఆర్ కడప జిల్లాగా కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. ఆ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా పేరు మార్చడంపైన కూటమి ప్రభుత్వం తొలి నుంచి ఆసక్తిగానే ఉంది. పైగా గత ప్రభుత్వ హయాంలో పెట్టిన చాలా వరకు పేర్లను, ప్రభుత్వ పథకాల పేర్లను అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లోనే కూటమి ప్రభుత్వం మర్చేసింది. కడప జిల్లా పేరు మార్పుపై ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా చర్చించారు. జిల్లా పేరు మార్చాలని, వైఎస్‌ఆర్ జిల్లాకు బదులుగా వైఎస్‌ఆర్ కడప జిల్లాగా మార్చాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా గతంలో చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో తాము అధికారంలోకి వస్తే ఈ జిల్లా పేరు మారుస్తామని కూడా కడప జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించక ముందు వరకు దీనికి కడప జిల్లాగానే పేరుంది. వైఎస్‌ఆర్ అకాల మరణం తర్వాత ఆయన స్మారకార్థం నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లా పేరును వైఎస్‌ఆర్ కడప జిల్లాగా మార్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో కూడా వైఎస్‌ఆర్ కడప జిల్లా పేరునే కొనసాగించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్‌ఆర్ కడప జిల్లా పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాకు బదులుగా అందులోని కడపను తొలగించి వైఎస్‌ఆర్ జిల్లాగా పేరును మార్చారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ పేరును మార్చుతూ.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన వైఎస్‌ఆర్ కడప జిల్లా పేరునే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు సమావేశాలు జరుగుతున్న తరుణంలో కడప జిల్లా పేరు మార్పు చోటు చేసుకోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.