కలకలం రేపుతున్న జెత్వానీ వాగ్మూలం

ముంబై సినీనటి కాదంబరీ జెత్వానీ విజయవాడ కోర్టులో వాగ్మూలం ఇచ్చింది. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆమె చెప్పారు.

Update: 2024-10-07 06:03 GMT

ప్రముఖ సినీ నటి కాదంబరి జెత్వానీ వాంగ్మూలం ఇప్పుడు కలకలం రేపుతోంది. నా పై తప్పుడు కేసు పెట్టారు. అరెస్టు చేసి భయ బ్రాంతులకు గురి చేశారు. ఇందుకు కుట్ర జరిగింది నాటి సీఎం క్యాంపు కార్యాలయంలోనే. అని కాదంబరి జెత్వానీ కోర్టులో న్యాయవాది ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. నాటి ఇంటిలెజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు సీఎంఓకు జనవరి 31న అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్‌గున్నీలను పిలిపించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌తో పోలీసులు కుమ్మక్కయ్యారు. తనపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసులు నమోదు చేశారు. అని ఆమె చెప్పారు. శనివారం విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలను బహిర్గతం చేసింది. ఆమెతో పాటు సాక్షిగా ఉన్న గొరిపర్తి శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు.

పారిశ్రామిక వేత్తపై తాను పెట్టిన అత్యాచార కేసును వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే తనపై కేసు నమోదు చేశారని తనతో పాటు తన తల్లిదండ్రులను ముంబాయి వచ్చి అరెస్టు చేసి, విజయవాడకు తీసుకొని రావడం కుట్రలో భాగమేనన్నారు. పోలీసు కస్టడీలో ఉదయం 8 గంటల నుంచి అర్థ రాత్రి 12 గంటల వరకు ఏసీపీ హన్మంతరావు, సీఐ కాశీవిశ్వనాథ్‌ తనను విచారించారని తెలిపారు. ముంబాయిలో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. కుక్కల విద్యాసాగర్‌ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టు కథ అల్లారని వెల్లడించారు.

తనను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్‌ తెచ్చిన ప్రతిపాదనను 2015లోనే తిరస్కరించినట్లు చెప్పారు. దీన్ని మనసులో పెట్టుకొని కుట్రలకు పాల్పడ్డారని అన్నారు. తనను, తన అమ్మా, నాన్నలను అరెస్టు చేసే సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్, శ్రీను, ఏడీసీపీ రమణమూర్తి, ఎస్‌ఐ షరీఫ్, దుర్గా తదితరులు తనపై దురుసుగా ప్రవర్తించారని వెల్లడించారు. తన ఫోన్‌ను జనవరి 31 నుంచి ట్రాకింగ్‌లో పెట్టి తన కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. తన కారు తాత్కాలిక డ్రైవర్‌ను బందువుగా చూపించి మమ్మల్ని అరెస్టు చేసిన సమాచారం ఆయనకు చేరవేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసులు తప్పుడు సాక్షులు, బోగస్‌ ఒప్పంద పత్రం పెట్టి కేసు నమోదు చేయడం వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో కాదంబరి జెత్వానీ పేర్కొన్నారు.

Tags:    

Similar News