జగన్ బొట్టు వెనుక ఇంత కథుందా?

మత విమర్శలపై ప్రత్యుత్తరమా? హిందుత్వానికి జగన్ నుంచి కొత్త సంకేతమా?;

Update: 2025-07-30 10:42 GMT
బొట్టుతో పీఏసీ సమావేశానికి హాజరైన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా స్టైల్ మార్చారు. గతానికి భిన్నంగా కనిపిస్తున్నారు. విజయవాడకు సమీపంలోని తాడేపల్లిలో జూలై 29న జరిగిన వైసీపీ రాజకీయ సలహా కమిటీ సమావేశానికి ఆయన వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ ఎప్పుడు వచ్చినా మల్లెపూవు లాంటి తెల్లచొక్కా, తేలికపాటి గోధుమ రంగుండే ప్యాంటు, మెడలో కనీకనపడని సన్నటి బంగారు గొలుసు, చేతికి వాళ్ల నాన్న పెట్టుకున్న గడియారం, జేబులో నల్లటి పెన్ను పెట్టుకుని వస్తారు. గతంలో కొన్నిసార్లు శుభ్రంగా గడ్డం గీసుకుని, మరికొన్ని సార్లు ట్రిమ్ చేసుకుని వచ్చేవారు. ఇటీవల కాలంలో కాస్తంత నెరిసిన గడ్డంతో వస్తున్నారు. అయితే నిన్న అందుకు భిన్నంగా నుదుట సింధూరం, మాసిన గడ్డంతో వచ్చారు. ఈ తీరు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది.

జగన్ సాధారణంగా ప్రజల ముందుకు బొట్టు పెట్టుకోకుండా కనిపిస్తస్తారు. ఏదైనా గుళ్లు, గోపురాలకు పోయినపుడు మాత్రమే ఆయన నుదుట బొట్టు ఉండేది. తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లో పూజల సమయంలో బొట్టు పెట్టుకుని కనిపించే వారు. రాజకీయ లేదా అధికారిక సమావేశాల్లో ఇలా ఎన్నడూ కనిపించిన దాఖలాలు లేవు.
ఈ PAC సమావేశంలో మాత్రమే ఇలా కనిపించారు. రాబోయే కొత్త వ్యూహాలకు ఇది సంకేతమా అనే చర్చ సాగుతోంది. నిన్న ఆయన పెట్టుకున్న సింధూరం ఏదైనా ఆంజనేయ స్వామి పూజ చేయించినపుడు పెట్టుకుంటుంటారు. తాను క్రైస్తవాన్ని ఆచరిస్తున్నా హిందూ సంప్రదాయాలనూ గౌరవించే వారిగా ప్రజల్లో కనిపించేందుకు ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఇటీవలి కాలంలో క్రైస్తవ మత పూజల్లో కూడా కొందరు బొట్టుపెడుతున్నారు. అలా ఎవరైనా ఆయన తరఫున ప్రార్థన చేసి ఈ బొట్టు పెట్టారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.
ఏదిఏమైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయనలో వచ్చిన పెద్ద మార్పుగా దీన్ని విశ్లేషకులు పరిగణిస్తున్నారు. తన రాజకీయ బద్ధశత్రువు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'హిందుత్వాన్ని తలకెత్తుకుని సనాతన ధర్మాన్ని' ప్రబోధిస్తున్న తరుణంలో జగన్ కూడా హిందు సంప్రదాయాలకు దగ్గరయ్యే ప్రయత్నంగా దీనిని కొందరు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ వాతావరణం, ముఖ్యంగా టీటీడీ పాలక మండలి, తిరుమల విషయంలో వచ్చిన విమర్శలు, మతపరమైన నెపాల నేపథ్యంలో జగన్ ఆత్మ రక్షణ చర్యగా ఇలా కనిపించారా అనేది కూడా రాజకీయ వర్గాలలో కనిపిస్తోంది.
ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలు పెద్దగా ప్రస్తావించకపోయినా, సామాజిక మాధ్యమాల్లో మాత్రం "జగన్ ఇలా ఎందుకు బొట్టు పెట్టుకున్నారు?" అనే ప్రశ్న చర్చకు తెరదీసింది. కొందరు ఇది ఆయన వ్యక్తిగత మార్పుగా చెబుతుండగా మరికొందరు దీన్ని రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు.
వైఎస్ జగన్ ఆహార్యంలో జరిగిన ఈ చిన్న మార్పు- నాయకత్వ వైఖరిలోని మార్పుని, దిశానిర్దేశాన్ని ప్రజలకు తెలియజేసే సంకేతంగా చెప్పవచ్చు లేదా ఓ వ్యూహాత్మక చర్యగా చూడవచ్చు. రూపం మార్చుకున్న జగన్... తన నాయకత్వ ధోరణిలోనూ మార్పుకు సంకేతమివ్వాలనుకుంటున్నారా? లేక ప్రజల మనోభావాలకు స్పందించాలన్న ఆత్మరక్షణ చర్యేనా?
Tags:    

Similar News