అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే అపవాదు మూటగట్టుకున్న జగన్‌

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలలో జగన్‌ వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. తొలి సమావేశాల్లోనే జగన్, ఆ పార్టీ సభ్యులు అపవాదును మూటగట్టుకున్నారు.

Update: 2024-06-22 15:43 GMT

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ్యుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
చేసిన ప్రమాణాన్ని జగన్‌ ఉల్లంఘించారనే చర్చ
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కలిపి 175 మంది సభ్యులు కొలువు దీరిన నిండు సభలో ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌ చేసిన ప్రమాణం ఇది. ఈ ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ఒక ప్రజా ప్రతినిధిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌పై ఉంది. కానీ ప్రమాణం చేసిన రోజునే వీటిని పక్కన పెట్టారు. సభలోని సభ్యులందరూ ప్రమాణం చేసేంత వరకు కూడా సభలో ఉండలేక పోయారు. ఇతర పార్టీల సభ్యుల విషయం పక్కన పెట్టినా.. తన సొంత పార్టీ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా సభలో కూర్చుని ఉండ లేక పోయారు. తన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. ఇది తొలి రోజు సభా మర్యాదలు, సంప్రదాయాలు, గౌరవానికి జరిగిన ఉల్లంఘనగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
ఇక రెండో రోజు కూడా సభా సంప్రదాయాలను, మర్యాదలను ఏ మాత్రం కూడా గౌరవించ లేదు. అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక, అనంతరం అన్ని పార్టీల ముఖ్య నేతలు స్పీకర్‌ సీటు వరకు తీసుకొని వెళ్లి ఆయన్ను ఆసీట్లో కూర్చో పెట్టి స్పీకర్‌ స్థానాన్ని గౌరవించడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇది రాష్ట్ర ప్రజలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల బాధ్యతగా భావిస్తారు. అనంతరం జరిగే చర్చల్లో పాల్గొని మాట్లాడతారు. సభ నిర్వహణ, ప్రజా సమస్యలపై చర్చల అంశాలు, స్పీకర్‌ వ్యవహరించాల్సిన తీరుపై జరిగే చర్చలో ప్రసంగించే బాధ్యత కూడా వారిపైన ఉంటుది. ఇదే విధంగా జగన్‌ ప్రభుత్వంలో కూడా జరిగింది.
నేడు కనిపించని నాటి సాంప్రదాయం
నాడు స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌ సీటు వద్దకు తీసుకెళ్లే సమయంలో టీడీపీ తరపున ప్రతిపక్షంలో ఉన్న అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. నాటి సీఎం జగన్‌తో పాటు అచ్చెన్నాయుడు నాటి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌ సీటు వద్దకు తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టి సభ సంప్రదాయాలను, గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా కాపాడారు. కానీ వైఎస్‌ జగన్‌ కానీ, వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులు కానీ ఈ సారి అగౌరవాన్ని తెచ్చి పెట్టారనే టాక్‌ అటు రాజకీయ వర్గాల్లోను, సభ్యుల్లోను సాగింది.
అయితే ఎంతో కీలకమైన స్పీకర్‌ ఎన్నిక, అనంతర కార్యక్రమానికి జగన్‌తో పాటు ఆయన పార్టీ సభ్యులు హాజరు కాకపోవడం, మాకుమ్మడిగా డుమ్మా కొట్టిన తీరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా చేయడం వల్ల తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వైఎస్సార్‌సీపీ అపవాదు మూటగట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి సమావేశాల్లోనే జగన్, ఆయన పార్టీ సభ్యుల తీరు ఇలా ఉంటే ఇక భవిష్యత్‌లో జరగబోయే సమావేశాల్లో ఎలా వ్యవహరిస్తారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
స్పీకర్‌ను సీటు వరకు తీసుకుపోయిన నేతలు
Delete Edit
స్పీకర్‌గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడును స్పీకర్‌ సీటు వరకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే పవన్‌ కల్యాణ్, మంత్రి, సీనియర్‌ సభ్యులు అచ్చెనాయుడు, మరో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌లు ఆయనను సీట్లో కూర్చోబెట్టి, శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యంత్రి పవన్‌ కల్యాణ్, లోకేష్, అచ్చెనాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితర మంత్రులు పలువురు సభ్యులు స్పీకర్‌ ఎన్నిక, ఆయన వ్యక్తిత్వంపై మాట్లాడారు.
Tags:    

Similar News