ఇంకా రియాలిటీలోకి రాలేకపోతున్న జగన్

జగన్ ఇంకా రియాలిటీని అంగీకరించలేదని, వాస్తవ ప్రపంచంలోకి రాలేదని ఆయన మాటలనుబట్టి అర్థమవుతుంది. నిన్నేమో ఈవీఎమ్‌లతో ఫలితాలను తారుమారు చేశారని ట్వీట్ చేశారు...

Update: 2024-06-20 13:57 GMT

సైకాలజీలో ఒక సూత్రీకరణ ఉంది. ఎవరికైనా ఒక తీవ్రమైన ఎదురుదెబ్బ/ఓటమి/విషాదం తాకినప్పుడు వారి స్పందన ఐదు స్టేజిలుగా ఉంటుందని కూబ్లర్ రాస్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ సూత్రీకరించాడు. అవి ఏమిటంటే - నిరాకరించటం, ఆగ్రహం, బేరమాడటం, కుంగిపోవటం, అంగీకరించటం. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మొదటి దశలోనే ఉన్నట్లు కనబడుతోంది.

జగన్మోహన్ రెడ్డి ఇంకా రియాలిటీని అంగీకరించలేదని, వాస్తవ ప్రపంచంలోకి రాలేదని ఆయన మాటలనుబట్టి అర్థమవుతుంది. నిన్నేమో ఈవీఎమ్‌లతో ఫలితాలను తారుమారు చేశారని ట్వీట్ చేశారు. ఇవాళేమో అసలు తాము ఓడిపోలేదని, ఈ ఫలితాలు శకుని పాచికలులాగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సింగిల్ డిజిట్‌కు పరిమితం చేస్తానని చెప్పారు.

న్యాయంగా, ధర్మంగా చూస్తే వైసీపీ ఓడిపోలేదని జగన్ అన్నారు. గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 2029 జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని జోస్యం చెప్పారు. ఈ ఫలితాలు శకుని మాయ పాచికలను గుర్తుకు తెచ్చాయని చెప్పారు. శకుని పాచికల ఘట్టం భారతంలో ఇంటర్వెల్‌లో జరుగుతుందని, పాండవులు ఓడిపోతారని, కానీ చివరికి వారే గెలుస్తారని అన్నారు. పరోక్షంగా కూటమి నేతలు కౌరవులుగానూ, తాము పాండవులుగానూ జగన్ అభివర్ణించుకున్నారు.

ప్రతి ఇంట్లోనూ వైసీపీ చేసిన మంచి పని ఉంది అని, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్ళగలం అని చెప్పారు. 2019తో పోల్చితే ఈ ఎన్నికల్లో వైసీపీకి 10 శాతం ఓట్లు తగ్గాయని, ఆ పది శాతం ప్రజలు కూడా త్వరలోనే చంద్రబాబు మోసాలను గుర్తిస్తారని అన్నారు. కాలం గడిచేకొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం పెరుగుతుందని, 2029 నాటికి ప్రజలే రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వైసీపీని గెలిపిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

2.7 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినా ఫలితాలు ఇలా రావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని జగన్ అన్నారు. విశ్వసనీయతకు వైసీపీ చిరునామా అని, తాము చేసిన మంచే తమకు శ్రీరామరక్ష అని జగన్ చెప్పారు. తనకు వయస్సుతోపాటు సత్తువ కూడా ఉందని అన్నారు. అసెంబ్లీలో తమ బలం తక్కువ కాబట్టి అక్కడ చేయగలిగిందేమీ ఉండదని చెప్పారు.

ఏది ఏమైనా జగన్ ఆత్మపరిశీలన చేసుకుని, తన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశాలు దరిదాపుల్లో కనబడటంలేదు. ప్రస్తుతం ఆయన ఓటమిపై స్పందించే విషయంలో మొదటి స్టేజిలోనే ఉన్నారు మరి. ఇంకా నాలుగు దశలు ఉన్నాయి. చివరి దశకు ఎప్పుడు చేరుకుంటారో చూడాలి. జగన్ తాను వాస్తవ ప్రపంచంలోకి రాకపోవటమే కాకుండా తన శ్రేణులను కూడా తనలాగే ఊహలలో విహరింపజేయటం ఇక్కడ గమనార్హం. వైసీపీలో 90 శాతం మంది ఈవీఎమ్‍‌లలో ఫలితాలను తారుమారు చేశారనే ఇంకా భావిస్తున్నారు.

బలమైన ప్రతిపక్షం ఉంటేనే ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. వైసీపీ మంచి ప్రతిపక్షంగా మారి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆశించటం తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు.

Tags:    

Similar News