అభయారణ్యాల్లో పులుల ఏకాంతానికి వేళైంది...
అటువైపు ఎవరూ వెళ్లకండి...;
By : Shaik Saleem
Update: 2025-07-01 11:03 GMT
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పులుల శృంగారానికి ఆటంకం కలగకుండా సఫారీ యాత్రలను నిలిపివేశారు. అభయారణ్యాల్లో పులుల సంతానోత్సత్తి కోసం అంతా గప్ చుప్ అంటున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నాగార్జునసాగర్, అమ్రాబాద్, కవ్వాల, శేషాచలం అభయారణ్యాల్లో వర్షాకాలం సందర్భంగా పులుల మేటింగ్ సీజన్ మూడు నెలలపాటు సాగనుంది. దీనికోసం అభయారణ్యాల అటవీశాఖ అధికారులు సఫారీ యాత్రలను జులై 1వతేదీ నుంచి సెప్టెంబరు 30వతేదీ వరకు నిలిపివేశారు.మేటింగ్ సీజన్ లో పులుల ఏకాంతానికి భంగం వాటిల్లకుండా అభయారణ్యాల్లో మనుషుల సంచారానికి బ్రేక్ ఇచ్చారు.
పులుల శృంగారం ఇలా...
అభయారణ్యాల్లో ఒక్కో పులి సాధారణంగా 40 కిలోమీటర్ల టెరిటరీని గిరి గీసుకొని అందులోనే సంచరిస్తోంది. కానీ వర్షాకాలం మేటింగ్ సీజనులో మాత్రం ఆడపులి తోడు కోసం పరితపిస్తూ తన టెరిటరీని దాటి వెళ్లి సంభోగిస్తుంది.వర్షాకాలంలో పులులు పిల్లల్ని కనేందుకు వీలుగా వాటికి ఏకాంతత కల్పించారు. అభయారణ్యాలే కాదు జూ పార్కుల్లోనూ పులుల మేటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఆడపులి మగపులి తోడు కోసం ఎదురుచూస్తూ అరుస్తుందని, అప్పుడు మగపులి వచ్చి దాంతో శృంగారం జరుపుతుందన్నారు. ఆడ, మగ పులి ఇలా 40 నుంచి 50 సార్లు కలిసిన తర్వాత ఆడపులి గర్భం దాలుస్తుంది. గర్భం దాల్సిన పులి మూడు నెలల్లోనే పులి కూనలను కంటోంది.
నెహ్రూ జూపార్కులో పులులు సంతానోత్పత్తికి ఏర్పాట్లు
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులో 20 ఆడ, మగ పులులున్న నేపథ్యంలో వాటి మేటింగ్ కోసం జూ వెటర్నీరీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు వేర్వేరు తల్లులకు చెందిన పులులను గుర్తించి వాటిని మేటింగ్ కోసం జూపార్కులోని బ్రీడింగ్ క్రాస్ సెంటర్లకు తాము పంపించామని నెహ్రూ జూపార్కు వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ముహ్మద్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జూపార్కు బ్రీడింగ్ సెంటరులో గర్భం దాల్చిన ఆడపులిని పరీక్షించాక వాటి నమూనాలను సేకరించి సీసీఎంబీకి పంపించి పులి గర్భం దాల్చిందా లేదా అనేది నిర్ధారిస్థామని ఆయన తెలిపారు. 20 అదనపు మాంసంతోపాటు కాల్షియం, విటమిన్లను అందిస్తామని డాక్టర్ వివరించారు. జూపార్కులో పులులే కాదు ఎలుగుబంట్లు, ఏనుగులు, ఇతర జంతువులు కూడా సంతానోత్పత్తి చేస్తున్నాయని డాక్టర్ హకీం వివరించారు.
మేటింగ్ సీజనులో పులులకు ఏకాంతాన్ని ఇవ్వండి
అభయారణ్యాల్లో పులులకు జులై, ఆగస్టు, సెప్టెంబరు మూడు నెలల పాటు మేటింగ్ సీజన్ ఉంటుంది. ఈ మూడు నెలలు మగపులి, ఆడపులితో 40 నుంచి 50 సార్లు శృంగారం జరుపుతుంటుంది. ఈ సమయంలో సఫారీ టూర్ల పేరిట యాత్రికులు వెళ్లి పులుల ఏకాంతానికి భంగం వాటిల్లకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ అధికారులకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ టీ సీఏ) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమెట్ ఛేంజ్ (ఎంఓఈఎఫ్)
పులుల మేటింగ్ సీజన్ ఆరంభమైంది...సఫారీ టూర్లకు బ్రేక్
అభయారణ్యాల్లో పులులు శృంగారం జరిపే వేళైన నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ టీ సీఏ) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమెట్ ఛేంజ్ (ఎంఓఈఎఫ్) ఆదేశాలలతో తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, శేషాచలం రిజర్వు ఫారెస్టుల్లో సఫారీ యాత్రలను నిలిపివేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. అటవీశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని కవ్వాల్ పులుల అభయారణ్యం అటవీశాఖ అధికారి కారెం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అడవుల్లో మూడు నెలలు అంతా గప్ చుప్
జులై 1వతేదీ నుంచి సెప్టెంబరు 30 వతేదీ వరకు టైగర్ రిజర్వులలో పులులకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఈ మేరకు అటవీశాఖ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని డివిజన్లలోని ఫారెస్ట్ రేంజి అధికారులు లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేశారు. జంగిల్ సఫారీ వాహనాలను నిలిపివేసి అడవుల్లోకి ఎవరూ వెళ్లకుండా టైగర్ రిజర్వులలో ప్రవేశ ద్వారాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని అటవీశాఖ సూచించింది. సఫారీ టూర్లే కాకుండా అడవుల్లోకి ఎకో టూరిజం యాత్రలు కూడా నిలిపివేయాలని రెండు రాష్ట్రాల అటవీ అభివృద్ధి సంస్థ అధికారులను కూడా ఆదేశించారు.అమ్రాబాద్ లో పులుల సంతానోత్సత్తి కోసం అన్ని సఫారీ యాత్రలు నిలిపివేసి పులులకు ఏకాంత వాతావరణం కల్పించామని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కవ్వాలలో పెరగనున్న పులుల సంఖ్య
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యానికి మూడు వైపుల ఇతర రాష్ట్రాల పులుల అభయారణ్యాలు ఉండటంతో అక్కడి నుంచి కొన్ని పులులు మేటింగ్ కోసం కవ్వాల అడవులకు రానున్నాయి. ప్రస్థుతం కవ్వాల అభయారణ్యంలో రెండు, మూడు పులులే సంచరిస్తున్నాయని కెమెరా ట్రాప్ వీడియోల అనాల్ సిస్ ద్వారా తేలింది. మహారాష్ట్రలోని తాడోబా,తిప్పేశ్వర్, ఛత్తీస్ ఘడ్ లోని గంగావతి అభయారణ్యాల నుంచి మేటింగ్ కోసం ఆడపులులను వెతుక్కుంటూ కవ్వాల అభయారణ్యానికి వచ్చే అవకాశముందని, దీనివల్ల ఈ ఏడాది కవ్వాలలో పులుల సంఖ్య పెరుగుతుందని కవ్వాల అటవీశాఖ అధికారి కారెం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మేటింగ్ సీజన్ లో పులుల సంఖ్య పెరుగుతుంది : తెలంగాణ జూ డైరెక్టర్ సునీల్ ఎస్ హిరేమత్
జులై నుంచి సెప్టెంబరు 30 వతేదీ వరకు మూడు నెలల పాటు పులలు, ఇతర వన్యప్రాణుల కలుయికతో సంతానోత్సత్తి కోసం తాము అన్ని సఫారీ యాత్రలను నిలిపివేశామని తెలంగాణ జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మేటింగ్ సీజనులో పులులకు ఏకాంతత కల్పిస్తే అవి కలిసి శృంగారం జరపడం వల్ల పులుల సంతానోత్పత్తి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని అభయారణ్యాల్లో ఈ ఏడాది పులుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని సునీల్ వివరించారు. నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో ప్రస్తుతం 87,అమ్రాబాద్ అభయారణ్యంలో 36, కవ్వాల అభయారణ్యంలో మూడు, శేషాచలం అభయారణ్యంలో 10 పులులుండగా ఈ మేటింగ్ సీజన్ వల్ల వీటి సంఖ్య పెరిగే అవకాశముందని అటవీశాఖ అధికారులు చెబుుతున్నారు.