ఏపీలోనూ, దేశంలోనూ పెట్టుబడులకిదే సమయం..
దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇదే సరైన అదను అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-11-14 09:07 GMT
విశాఖపట్నంలోపి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదనంలో రెండు రోజుల పాటు జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఆనంతరం ఆయన దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల నుద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే..?
‘ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్థిక సుసంపన్న దేశంగా భారత్ ఎదుగుతోంది. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోంది. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు రోల్‌మోడల్. ఉమ్మడి ఆంధప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి అంతే కృషి చేస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు సాధించ ఆనికి చంద్రబాబు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. విశాఖపట్నం కూడా పెట్టుబడులతో ఎంతో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఏపీలో వ్యాపారానికి అనువైన వాతావరణం నెలకొంది. దేశం, రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకానమీ ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. టెక్నాలజీ నాలెడ్జి డ్రైవెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలున్నాయి. దేశంలోనూ, ఏపీలోనూ పెట్టుబడులకు ఇదే సరైన సమయమని అందరికీ పిలుపునిస్తున్నాను. పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకోండి.
భారత్ ఎవరినీ శాసించాలని కోరుకోదు..
ప్రతి దేశంతోనూ భారత్ మైత్రినే కోరుకుంటుంది. అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారత దేశానిది. ఎవరినీ శాసించాలని కోరుకోదు. ఇతరులకు నష్టం కలిగించడం కాదు.. ప్రయోజనాలు కల్పించడం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదం. కార్మిక చట్టాల్లో, ట్యాక్స్ విధానంలోనూ సంస్కరణలు తీసుకొస్తున్నారు ప్రధాని మోదీ. వచ్చే మూడేళ్లలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది’ అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
సమ్మిట్‌నుద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
పెట్టుబడులకు గేట్‌వే ఆంధ్రప్రదేశ్ః సీఎం చంద్రబాబు..
‘సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ‘ఏపీ ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం. డూయింగ్ బిజినెస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు వచ్చాం. పది ప్రిన్సిపల్స్‌తో విభిన్నంగా పని చేస్తున్నాం. 1995లో హైటెక్ సిటీ, ఐటీని ప్రమోట్ చేశాను. స్పేస్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్ సిటీల్లో ముందుకు వెళ్తున్నాం. కొత్తగా క్వాంటమ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. మా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రండి. ఏపీకి డేటా సెంటర్లు వస్తున్నాయి. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గుగూల్ డేటా సెంటర్ వస్తోంది. డీప్ టెక్నాలజీపైనా పెట్టుబడులు పెట్టండి. రెండేళ్లలో ఏపీలో డ్రోన్ ట్యాక్సీని అందుబాటులోకి తెస్తాం. పర్యాటకరంగానికి ఏపీ ఎంతో అనుకూలం. ఆ రంగంలోనూ పెట్టుబడులు పెట్టండి.
సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులు
విశాఖలో ఐటీపీవో సెంటర్..
విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ ఐటీపీవో.. కన్వెన్షన్ సెంటర్‌ను జాయింట్ వెంచర్‌లో నిర్మిస్తాం. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా అన్ని వసతులూ కల్పిస్తాం. సీ వ్యూ ఉండేలా కొండపై దీనిని కడతాం. రాష్ట్రంలో భూములకు కొరత లేదు. క్లియరెన్స్‌కు ఇబ్బంది లేదు. సకాలంలో అనుమతులిస్తాం. ఇన్వెస్టర కోసం ఎస్క్రో అకౌంట్స్ తెరుస్తాం. వచ్చే మూడేళ్లలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 5 మిలియన్ ఉద్యోగాలు కల్పిస్తాం. ఒకసారి మీరు ఎంవోయూ చేసుకుంటే మళ్లీ మీరు రిమైంyŠ చేయాల్సిన అవసరం రాకుండా మేం అన్ని పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది కూడా విశాఖపట్నంలోనే పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను ఇంతకంటే మెరుగ్గా నిర్వహిస్తాం’ అని చంద్రబాబు వివరించారు.
సదస్సులో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
సాంకేతికతను ప్రజలకు చేరువ చేస్తున్నాం..కేంద్రమంత్రి పీయూష్
ఏపీ ఎగుమతులు, దిగుమతులకు గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖపట్నం నిలుస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లోనూ ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. సీఐఐ సమ్మిట్‌లో ప్రసంగించిన ఆయన ఇంకా ఏమన్నారంటే... 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతోంది. స్వర్ణాంధ్ర కావాలన్న చంద్రబాబు ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను. 2047 నాటికి సుసంపన్న దేశంగా భారత్ అవతరిస్తుంది. టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. 104 శాటిలైట్లను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన దేశంగా సాంకేతికతను ప్రజలకు చేరువ చేస్తున్నాం. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. 30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. 500 గిగావాట్ల గ్రీన్ ఎన ర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నాం. వసుధైక కుటుంబం అనే భారతీయ భావనను కోవిడ్ సమయంలో 110 దేశాలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేసి నిరూపించాం. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని వాణì జ్య బంధాలను బలోపేతం చేస్తున్నాం. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా జీఎస్టీ సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులున్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. అత్యంత పారదర్శక విధానంలో వాణిజ్యం ఉండాలని కోరుకుంటున్నాం. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావడం అభినందనీయం. వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, సదస్సుల నిర్వహణకు ఢిల్లీలో ఉన్న భారత్ మండపం ఉన్నట్టే ఆంధ్ర మండపం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని కేంద్రంమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
పెట్టుబడుల స్వర్గధామం విశాఖః గవర్నర్ నజీర్
పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ భాగస్వామ్యానికి ఈ సదస్సు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్‌కు ఏపీ చిరునామాగా మారిందని చెప్పారు. ఈ సమ్మిట్‌లో ఇంకా కేంద్రమంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్రమంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.