బాలినేని పార్టీ మారటం ఖాయమైనట్లే...

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారటం ఖాయమైనట్లేనని సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-09-13 06:56 GMT

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీని వీడి జనసేన పార్టీలో చేరేందుకు మార్గం సుగుమమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీరు నచ్చక పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఒంగోలులో బలిజ, కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. వారంతా జనసేన వైపునే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. వైఎస్సార్సీపీకి రెడ్డి, ఎస్సీ, బీసీల్లో కొందరు అండగా ఉన్నారు. అయితే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ క్యాడర్ ను బాగా దెబ్బ తీశాయని వైఎస్సార్సీపీ వారు భావిస్తున్నారు. సాధారణంగా పార్టీలో లోయర్ క్యాడర్ నిలబడాలన్నా, గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్నా స్థానికుల్లో పార్టీ చేస్తున్న మంచి గురించి బలంగా నమ్మే వారు ఉండాలి. అలా ఉండాలంటే తప్పకుండా కింది స్థాయి కేడర్ ను విస్మరించకూడదు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చిన్న చిన్న నామినేషన్ వర్కులు పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇవి సాధారణంగా జరిగేవి. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలయ్యారు. దీంతో చాలా మంది నాయకుల్లో జగన్ పై అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ వద్ద ఉన్న చనువు వైఎస్సార్సీపీలో జగన్ వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డికి లేకుండా పోయింది. జగన్ ను కలవాలంటే బాలినేని అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

తెలుగుదేశం పార్టీలోనే చేరాలనుకున్నారు..

ఎన్నికలకు ముందుకు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోనే చేరాలనుకున్నారు. అయితే ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు కాస్త వెనక్కు తగ్గారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైఎస్సార్సీపీ తరపున ఒంగోలు టిక్కెట్ ఇవ్వాలని, తాను ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచి చూపిస్తామని ఎంత చెప్పినా జగన్ వినలేదు. నేను ఎవరిని పెట్టినా గెలుస్తారనే ధీమాతో తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా పోటీకి దింపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో వ్యతిరేకించి మట్టికరిపించారు. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంటకు మరోసారి అవకాశం కల్పించారు. నిజానికి ఎన్నికలకు ముందు టీడీపీలోకి మాగుంటతో పాటు బాలినేని కూడా వెళ్లాలనుకున్నా అది సాధ్య పడలేదు.

జనసేనలో చేరే అవకాశం

జగన్ తనకు బంధువని, తాను పార్టీని వీడితే జగన్ కు నష్టం జరిగే అవకాశం ఉందని బాలినేని భావించడం లేదనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఎన్నికల సమయంలో తన మాటకు జగన్ విలువ ఇవ్వలేదు. అందువల్ల రాజకీయాల్లో ఎవరి దారి వారిదని, తాను ఇలాగే ఉంటే తన కుమారుని రాజకీయ భవిష్యత్ కూడా అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉన్నందున తప్పకుండా పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి జనం ఏమనుకుంటున్నారో తెలుసు కోవాలనుకున్నారు. అందులో భాగంగానే ఈ విధమైన లీకులు ఇచ్చి ఉంటారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో బాలినేని మాట్లాడినట్లు సమాచారం. హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం ఉంటున్నందున పవన్ కళ్యాణ్ తో సందర్భం చూసుకుని మాట్లాడారని సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్ పవన్ కే ఉంటుందని, జనసేన పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ముందున్నారనే భావన బాలినేనిలో ఉంది. తన బంధువైనా తనకు గౌరవం ఇవ్వని జగన్ వద్ద ఉండే కంటే పవన్ కళ్యణ్ పార్టీలో ఉండటమే మంచిదనే ఆలోచనకు బాలినేని వచ్చారనేది ఆయన సన్నిహితుల మాట.

ఇవన్నీ అబద్దపు ప్రచారాలని కొట్టేసిన బాలినేని

తనపై కావాలని కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తాను పార్టీ మారే అవకాశమే లేదన్నారు. జగన్ తో కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చేమో కాని ఆయన వెయ్యమంటేనే తాను ఈవీఎం వ్యవహారంపై కేసు వేశానని, జనసేనలో చేరుతున్నాననే ప్రచారంలో నిజం లేదన్నారు. వైఎస్సార్సీపీ నుంచి సగం మంది టీడీపీలో ఒంగోలు మునిసిపల్ కార్పొరేటర్లు చేరినందున వారిని బుజ్జగించి తిరిగి పార్టీలోనే ఉండే విధంగా చేస్తున్నారు. అందులో భాగంగా 20 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను హైదరాబాద్ పిలిపించి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు.

Tags:    

Similar News