వైసీపీ మేయ‌ర్ పీఠాన్ని కూట‌మి త‌న్నుకు పోతుందా?

అవిశ్వాసం దిశ‌గా పావులు క‌దుపుతున్న కూట‌మి నేత‌లు. జీవీఎంసీ మేయ‌ర్ ఎన్నిక‌లకు నాలుగేళ్లు పూర్తి. కార్పొరేట‌ర్ల‌కు వ‌ల‌వేసి లాక్కునేందుకు ముమ్మ‌ర య‌త్నాలు.;

Update: 2025-03-19 04:58 GMT
జీవీఎంసీ కార్యాల‌య భ‌వ‌నం

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్దదైన విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థపై కూట‌మి నేత‌లు క‌న్నేశారు. వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయ‌ర్ పీఠాన్ని త‌న్నుకు పోవ‌డానికి కొన్నాళ్లుగా పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌డు ఆ ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేశారు. అయితే దానిని అడ్డుకునేందుకు వైసీపీ నాయ‌కులు కూడా వ్యూహ ప్ర‌తివ్యూహాలతో చెక్ పెడుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో జీవీఎంసీ మేయ‌ర్ పీఠంపై కూట‌మి, వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు వేడెక్కాయి. .

నాలుగేళ్ల క్రితం విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) మేయ‌ర్ పీఠాన్ని అప్ప‌టి వైసీపీ ద‌క్కించుకుంది. మొత్తం 98 కార్పొరేట‌ర్ల స్థానాల‌కు గాను 59 స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. వైసీపీ అధిష్టానం పార్టీలో ఎంద‌రో సీనియ‌ర్ల‌ను కాద‌ని బీసీ (యాద‌వ‌) సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ గొల‌గాని హ‌రి వెంక‌ట కుమారికి మేయ‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌డంతో అప్ప‌ట్నుంచి మూడేళ్ల పాటు మేయ‌ర్ ప‌ద‌వికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. గ‌తేడాది వైసీపీ అధికారం కోల్పోయి కూట‌మి ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కింది. ఇక అప్ప‌ట్నుంచి కీల‌క‌మైన విశాఖ మేయ‌ర్ ప‌ద‌విని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని కూట‌మి నేత‌లు కుతంత్రాలు పన్నారు. ప్ర‌స్తుత మేయ‌ర్‌ను దించేసి కూట‌మి కార్పొరేట‌ర్‌ను మేయ‌ర్ గా కూర్చోబెట్టాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ్డారు. ఆ మేర‌కు వైసీపీ కార్పొరేట‌ర్ల‌కు బేర‌సారాల‌తో గాలం వేశారు. అస‌లే అధికారం కోల్పోయి ఉన్న వైసీపీ కార్పొరేట‌ర్లు కొంద‌రు గాలానికి చిక్కి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోకి చేరిపోయారు. అయితే ఎన్నికైన నాలుగేళ్లు పూర్త‌య్యే వ‌ర‌కు అవిశ్వాసం పెట్ట‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌తో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. ఇప్ప‌డు నాలుగేళ్లు పూర్తవుతుండ‌డంతో కూట‌మి నేత‌లు మ‌ళ్లీ అవిశ్వాసంపై ప్ర‌య‌త్నాలు ఉధ్రుతం చేశారు.

మేయ‌ర్ హ‌రివెంక‌ట కుమారి

 

కార్పొరేట‌ర్ల సంఖ్యా బ‌లం ఇలా..

జీవీఎంసీలో మొత్తం కార్పొరేట‌ర్ల సంఖ్య 98. నాలుగేళ్ల క్రితం జ‌రిగిన జీవీఎంసీ ఎన్నిక‌ల్లో 59 స్థానాల్లో వైసీపీ, 29 స్థానాల్లో టీడీపీ కార్పొరేట‌ర్లు గెలిచారు. మిగిలిన వాటిలో ఇండిపెండెంట్లు న‌లుగురు, జ‌న‌సేన నుంచి ముగ్గురు, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి ఒక్కొక్క‌రు చొప్పున విజ‌యం సాధించారు. వీరిలో ఇండిపెండెంట్ కార్పొరేట‌ర్లు న‌లుగురూ అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉండ‌డంతో ఆ పార్టీకే జైకొట్టారు. టీడీపీ నుంచి ఒక‌రు వైసీపీలో చేర‌గా మ‌రో ఇద్ద‌రు ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికారు. కొన్నాళ్ల త‌ర్వాత ఇండిపెండెంట్లు న‌లుగురిలో ఇద్ద‌రు జ‌న‌సేన‌లో, ఇద్ద‌రు టీడీపీలో చేరిపోయారు. క్ర‌మంగా వైసీపీకి చెందిన మ‌రో 20 మంది వ‌ర‌కు కార్పొరేట‌ర్లు టీడీపీ, జ‌న‌సేన కూట‌మిలోకి జంప్ చేశారు. దీంతో జీవీఎంసీలో కూట‌మి బ‌లం 53కి పెర‌గ్గా, వైసీపీ బ‌లం 38కి ప‌డిపోయింది. మేయ‌ర్ హ‌రివెంక‌ట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి వీలుగా కూట‌మి నేత‌లు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. తాజాగా వైసీపీ నుంచి కూట‌మిలో చేరిన‌, చేర‌బోతున్న కార్పొరేట‌ర్ల జాబితాను టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు.

అవిశ్వాసం అంత ఈజీ కాదు..

మేయ‌ర్ హ‌రివెంక‌ట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాలంటే నిబంధ‌న‌ల ప్ర‌కారం కూట‌మికి 64 (టూ థ‌ర్డ్‌) మంది కార్పొరేట‌ర్లు అవ‌స‌ర‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం కూట‌మికి 53 మంది కార్పొరేట‌ర్లున్నారు. ఈ లెక్క‌న మ‌రో 11 మంది కావల‌సి ఉంటుంది. త‌మ‌కు 64 మంది కార్పొరేట‌ర్ల మ‌ద్ద‌తు ఉంద‌ని కూట‌మి నేత‌లు క‌లెక్ట‌ర్‌కు జాబితాను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఆ విష‌యాన్ని క‌లెక్ట‌ర్ ఎన్నిక‌ల సంఘం ద్రుష్టికి తీసుకెళ్తారు. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించే తేదీన ఆ 64 మందిని కూట‌మి నేత‌లు హాజ‌రు ప‌రచాలి. వీరిలో ఒక్కరు త‌గ్గినా అవిశ్వాసానికి అనుమ‌తించ‌రు. అందువ‌ల్ల ముందుగా వైసీపీ నుంచి మ‌రో 11 మందిని లాక్కుంటే త‌ప్ప అవిశ్వాసానికి వీలుప‌డ‌ద‌న్న మాట‌! అదే జ‌రిగితే ప్ర‌స్తుత‌ మేయ‌రే త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌య్యే వ‌ర‌కు కొన‌సాగుతారు. ఒక‌వేళ 64 మందిని హాజ‌రైతే కొద్దిరోజుల త‌ర్వాత ఓటింగ్ తేదీని ప్ర‌క‌టిస్తారు. ఆ ఓటింగ్‌లో ఎక్స్ అఫీషియో స‌భ్యులుగా ఉన్న ఎమ్మ‌ల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనాల్సి ఉంటుంది. అందువ‌ల్ల కూట‌మి నేత‌లు ఊహిస్తున్న‌ట్టుగా జీవీఎంసీ మేయ‌ర్ పీఠాన్ని త‌న్నుకు పోవ‌డం ఏమంత తేలిక కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న కార్పొరేట‌ర్లు, ప్ర‌లోభాల‌కు గురైన వైసీపీ కార్పొరేట‌ర్లు చేజారి పోకుండా చూసేందుకు కూట‌మి నేత‌లు అప్పుడే క్యాంపు రాజ‌కీయాలు మొద‌లు పెట్టారు. వీరంద‌రితో ర‌హ‌స్య క్యాంపులు నిర్వ‌హిస్తున్నారు.

 

పీలా శ్రీ‌నివాస‌రావు

వ్యూహాల్లో వైసీపీ నేత‌లు..

కూట‌మి నేత‌ల కుతంత్రాల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు కూడా వ్యూహ ప్ర‌తివ్యూహాలు మొద‌లు పెట్టారు. ప్ర‌స్త‌తం త‌మ‌కున్న 38 కార్పొరేట‌ర్లు కూట‌మి వైపు వెళ్ల‌కుండా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే మిగిలి ఉన్న‌ వైసీపీ కార్పొరేట‌ర్ల‌తో వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ మంత‌నాలు జ‌రుపుతున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం వైసీపీ ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విశాఖ‌లో వైసీపీ కార్పొరేట‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనూహ్యంగా ఈ స‌మావేశానికి 34 మంది హాజ‌ర‌య్యారు. మ‌రో ముగ్గురు అనారోగ్య కార‌ణాల‌తో హాజ‌రు కాలేదు. మేయ‌ర్‌పై అవిశ్వాసానికి మ‌ద్ద‌తుగా కూట‌మిలోకి వెళ్లే ఆలోచ‌న ఉంటే మంగ‌ళ‌వారం నాటి స‌మావేశానికి ఇంత మంది వ‌చ్చే వారు కాద‌ని అంటున్నారు. కూట‌మిలోకి జంప్ చేస్తే త‌లెత్తే ప‌రిణామాలు, అన‌ర్హ‌త వేటు త‌దిత‌ర విష‌యాల‌ను వైసీపీ సీనియ‌ర్ నేత‌లు స‌వివ‌రంగా చెప్ప‌డంతో తొలుత కూట‌మి వైపు మొగ్గు చూపిన కార్పొరేట‌ర్లు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని చెబుతున్నారు.

మేయ‌ర్ పీఠంపై పీలా ఆశ‌లు.. అవాంత‌రాలు..

జీవీఎంసీ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డానికి కార్పొరేట‌ర్, టీడీపీ ఫ్లోర్ లీడ‌ర్‌ పీలా శ్రీ‌నివాస‌రావు చాన్నాళ్లుగా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. గ‌వ‌ర (బీసీ) సామాజిక వ‌ర్గానికి చెందిన ఈయ‌న ఆర్థికంగా స్థితిమంతుడు కూడా. అందువ‌ల్ల మేయ‌ర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా గద్దె దించ‌డానికి అవ‌స‌ర‌మైన వైసీపీ కార్పొరేట‌ర్ల‌కు ఆయ‌న రూ.ల‌క్ష‌ల్లో ఆఫ‌ర్ చేసిన‌ట్టు బ‌హిరంగంగానే ప్ర‌చ‌రారం జ‌రుగుతోంది. అయితే ప్ర‌స్తుత మేయ‌ర్ హ‌రివెంక‌ట కుమారి యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు. అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుకు అవిశ్వాస్వం ప‌ట్ల వ్య‌తిరేకత ఉన్న‌ట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే టీడీపీ, జ‌న‌సేన‌ల్లోని కొంత‌మంది ఎమ్మెల్యేలు కూడా పీలా అభ్య‌ర్థిత్వంతో పాటు మేయ‌ర్‌ను దించేందుకు సుముఖంగా లేర‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జీవీఎంసీ మేయ‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందోన‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

Tags:    

Similar News