Kavitha BC demand|కవితది ఓవర్ యాక్షనేనా ? రిజర్వేషన్ సాధ్యమేనా ?
కామారెడ్డిలో రేవంత్ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ఇచ్చిన హామీ ఆచరణ సాధ్యంకానిదని అందరికీ తెలుసు.
కల్వకుంట్ల కవిత ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకు హాట్ టాపిక్ అయిపోయిందంటే బీసీ రిజర్వేషన్ల అంశంపై సెగ రాజుకుంటోంది కాబట్టే. స్ధానికసంస్ధల ఎన్నికలను తొందరలోనే నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth reddy Government)అనుకుంటోంది. తేదీలు నిర్ణయం కాలేదుకాని ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండచ్చని ప్రభుత్వవర్గాల సమాచారం. ఈ విషయంలోనే బీఆర్ఎస్ ఎంఎల్సీ, కేసీఆర్ కూతురు కవిత(Kavitha) ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయారు. తనింట్లో 40 బీసీల సంఘాల నేతలతో(BC Leaders) కవిత భేటీ అయ్యారు. ఆ భేటీతర్వాత మీడియాతో మాట్లాడుతు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి పెద్ద వార్నింగే ఇచ్చారు. ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ (BC Reservations)అమలుచేయాలనే నిర్ణయం తీసుకోకుండా స్ధానికసంస్ధల ఎన్నికలు జరిపేందుకు లేదట. స్ధానికఎన్నికల్లో బీసీలకు 42శాతం అమలుచేస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేసేంతవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతునే ఉంటామన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని అమలుచేసేట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని హెచ్చరించారు. జ్యోతీరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు.
42శాతం రిజర్వేషన్ అమలును ప్రభుత్వం ప్రకటించకపోతే అసలు ఎన్నికలే జరగనివ్వమని భీకరమైన ప్రతిజ్ఞచేశారు. సావిత్రీబాయ్ పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర బీసీల సంఘాలతో భారీఎత్తున మీటింగ్ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తర్వాత బీసీలకు రిజర్వేషన్ల అమలుకోసం జాగృతి సంస్ధ(Jagruthi) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయబోతున్నట్లు ప్రకటించారు. మొత్తం జనాభాలో బీసీల జనాభా సగానికన్నా ఎక్కువున్నపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని కాంగ్రెస్ ఏ విధంగా నిర్ధారించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాతమాత్రమే స్ధానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. జ్యోతీరావుపూటే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్రం చేయబోయే జనగణనలో కులగణన కూడా చేయాలన్నారు. జనాభాలెక్కల్లో కులానికి సంబంధించిన కాలమ్ కూడా ఉండేట్లుగా కేంద్రప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ఒప్పించాలని అల్టిమేటమ్ ఇచ్చారు.
మీడియా సమావేశంలో కవిత హెచ్చరికలు, ప్రకటనలు, అల్టిమేటమ్, ప్రతిజ్ఞ చూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎంఎల్ఏ ఆదిశ్రీనివాస్(Congress MLA Aadi Srinivas) మాట్లాడుతు బీసీల రిజర్వేషన్ కు కల్వకుంట్ల కవితకు అసలు ఏమి సంబంధమో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హక్కులను ఎలా సాధించుకోవాలో బీసీ కులాల నేతలకు బాగా తెలుసన్నారు. హక్కుల సాధనలో బీసీలకు కవిత నాయకత్వం అవసరమేలేదని ఎంఎల్ఏ తేల్చేశారు. బీసీలకు కవితకు సంబంధమేలేదన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కవిత ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఎంఎల్ఏ డిమాండ్ చేశారు. బీసీల సభను ఏ హక్కుతో కవిత నిర్వహిస్తామని ప్రకటించారో చెప్పాలన్నారు. బీసీల హక్కుల కోసం కవిత చేస్తున్న ఓవర్ యాక్షన్ మానుకోవాలని కూడా ఎంఎల్ఏ వార్నింగ్ ఇచ్చారు.
ఇదేవిధంగా బీజేపీ రాష్ట్రకార్యదర్శి ఆకులవిజయ(BJP leader Aakula Vijaya) కూడా కవితపై మండిపోయారు. పదేళ్ళ కేసీఆర్ మంత్రివర్గం(KCR Cabinet)లో బీసీల్లో ఎంతమందికి అవకాశం కల్పించారో కవితకు తెలుసా ? అని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కవిత ఎందుకు ప్రయత్నించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు బీసీల రిజర్వేషన్ల గురించి నోరిప్పని కవిత సంవత్సరం చివరలో పెద్ద జోక్ పేల్చినట్లు ఎద్దేవాచేశారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే కేసీఆర్ అన్న విషయం అయినా కవితకు తెలుసా అని ఎగతాళి చేశారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించేసిన కేసీఆర్ రాజ్యాంగవిరుద్ధంగా ముస్లింలకు కేసీఆర్ రిజర్వేషన్ కల్పించిన విషయం కవితకు తెలీదా అని నిలదీశారు. దొంగసారా కేసులో జైలుకు వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన కవిత జనాల దృష్టిమళ్ళించేందుకు బీసీల రిజర్వేషన్ అంటు కొత్త డ్రామాకు తెరలేపినట్లు ఎద్దేవా చేశారు.
42 శాతం రిజర్వేషన్ సాధ్యమేనా ?
బీసీలరిజర్వేషన్ అంశంతో జనాల్లోకి వెళ్ళాలని కవిత చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానికఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 34 శాతం ఉండేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ 34 నుండి 23 శాతానికి తగ్గిపోయింది. ఇందుకు ప్రధానకారణం కోర్టుతీర్పే. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మంచకూడదన్న సుప్రింకోర్టు తీర్పుకు అనుగుణంగానే బీసీల రిజర్వేషన్ను కేసీఆర్ ప్రభుత్వం 34 నుండి 23కి తగ్గించేసింది. బీసీలకు రిజర్వేషన్ తగ్గించటంపై కేసీఆర్ ప్రభుత్వం సమర్ధవంతంగా రివ్యూపిటీషన్ కూడా దాఖలుచేయలేదన్నది వాస్తవం.
ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు అనేక హామీలిస్తుంటాయి. అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయటం సాధ్యంకాదు. ఈ విషయం హామీలిచ్చే నేతలకు తెలుసు, ఓట్లేసే జనాలకు కూడా బాగానే తెలుసు. అయినాసరే నేతలు హామీలిస్తుంటే జనాలు ఓట్లేస్తున్నారు. 2023 ఎన్నికలసమయంలో కామారెడ్డిలో రేవంత్ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ఇచ్చిన హామీ ఆచరణ సాధ్యంకానిదని అందరికీ తెలుసు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రింకోర్టు తీర్పున్నపుడు రేవంత్ బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ ఏ విధంగా అమలుచేయగలరు ? ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలుచేయక తప్పదు. మొత్తం 50 శాతంలో 28 శాతం పై రెండు వర్గాలకు పోతే ఇక మిగిలింది 22 శాతం మాత్రమే. అమలుచేయగలిగిన రిజర్వేషన్ 22 శాతం మాత్రమే అయినపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని రేవంత్ చెప్పింది పూర్తిగా తప్పుడు హామీనే.
బీసీల రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్రజనాభాలో అత్యధిక బీసీలే అని తమిళనాడు తరహాలో శాస్త్రీయంగా నిరూపించాలి. అలా నిరూపించాలంటే కులగణన జరగకుండా బీసీల జనాభా ఎంతో తేల్చేందుకు లేదు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ నియమించింది ఇదుకోసమే. కమిషన్ కూడా కులగణన చేస్తోంది. మరో పదిరోజుల్లో కమిషన్ తనరిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వబోతున్నట్లు సమాచారం. కమిషన్ ఇచ్చే రిపోర్టును క్యాబినెట్ చర్చించి అవసరమైతే అధ్యయనం కోసం ఒక సబ్ కమిటీని వేస్తుంది. లేకపోతే ఆ రిపోర్టును క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో చర్చకు పెట్టి బిల్లును ఆమోదించి చట్టంచేయాలని విజ్ఞప్తిచేస్తు ఆమోదంకోసం కేంద్రప్రభుత్వానికి పంపిస్తుంది. కేంద్రప్రభుత్వం(Central Government) అసెంబ్లీ తీర్మానాన్ని, కమిషన్ రిపోర్టును అధ్యయనం చేసి నిపుణుల సలహా తీసుకుంటుంది. అన్నీకోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఆమోదంకోసం బిల్లు తయారుచేసి పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. పార్లమెంటులో బిల్లు ఆమోదంపొంది రాష్ట్రపతి సంతకం అయితే అప్పుడు తెలంగాణాలో బీసీల రిజర్వేషన్ పెంపు సాధ్యమవుతుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీల రిజర్వేషన్ పెంచటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కసరత్తు, తీర్మానానికి అనుకూలంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా స్పందిస్తుంది ? ఒకవేళ క్రెడిట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందే కాని పార్లమెంటులో బిల్లుపాస్ చేసి చట్టం చేసిన నరేంద్రమోడీ(Narendra Modi)కి ఎందుకు వస్తుంది ? కాబట్టి రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలవ్వటం దాదాపు సాధ్యంకాదు. ఈ విషయం కవితతో పాటు అందరికీ తెలుసు. అయినా సరే రేవంత్ కామారెడ్డిలో హామీ ఇచ్చారు కాబట్టి ఇపుడు అమలుచేయాల్సిందే అని బీఆర్ఎస్ నేతలు పదేపదే డిమాండ్లతో ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.