అన్నేళ్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు వెళ్లంది అందుకేనా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వెళ్లారు. ఆ మధ్య కాలంలో ఎందుకు వెళ్ల లేదు? ఏమి జరిగింది?

Update: 2024-07-08 09:38 GMT

నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్మమంత్రిగా అయిన తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు అడుగు పెట్టారు. అప్పటి వరకు హైదరాబాద్‌కు వెళ్తున్నా తన నివాసంలోనే నేతలను కలవడం, సమావేశాలు నిర్వహించడం, వారికి దిశా నిర్థేశం చేయడం చేస్తూ వచ్చిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలమైన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వెళ్ల లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసినా, రాష్ట్ర విభజన తర్వాత వాతావరణం ఒక్క సారిగా మారి పోయింది. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై చంద్రబాబు పూర్థి స్థాయిలో దృష్టి సారించడం, విజయవాడకు వచ్చి అక్కడ నుంచే రాజకీయాలను నడపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం దృష్టి పెట్టారు. టీడీపీని ఏపీలో తిరిగి అధికారంలోకి తీసుకొని రావడం కోసం కంకణం కట్టుకున్నారు. దాని కోసం పాదయాత్రకు ఉపక్రమించారు. అందుకోసమే తన సమయాన్నంతా కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి సరిగా సమయం వెచ్చించ లేక పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా ఉండటంతో 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా, నామమాత్రంగానే మారింది. పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాష్ట్రంగా కేటాయించడంతో ఇక అక్కడ నుంచే పాలన మొదలు పెట్టారు. దీని కోసం ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ను కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించుకున్నారు. ఎలాగూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి, ఒక వైపు అక్కడ నుంచే ఆంధ్రప్రదేశ్‌ పాలన సాగిస్తూ మరో వైపు తెలంగాణలో తన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావించారు. దీని కోసం తరచుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహించడం చేస్తూ వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉండటం, సీఎం హోదాలో చంద్రబాబు ఉండటంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు టీడీపీ శ్రేణులు వేల సంఖ్యలో వచ్చే వారు. దీంతో అటు ఏపీ ఉన్నతాధికారులతో సమీక్షలు, ఇటు తెలంగాణ టీడీపీ నేతల సమావేశాలతో చంద్రబాబు నిత్యం బిజీ బిజీగా ఉండేవారు.
ఈ నేపథ్యంలో నాటి తెలంగాణ కేసీఆర్‌ ప్రభుత్వం ఏపీ సచివాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంపైనా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ టీడీపీ కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి సారించింది. రహస్యంగా వివరాలను సేకరించేందుకు నిఘా విభాగాన్ని కూడా ఉపయోగించిందనే టాక్‌ కూడా అప్పట్లో నడిచింది. ఎప్పటికప్పుడు ఆ వివరాలను తెలుసుకుంటూ తెలంగాణలో టీడీపీకి చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా అసలు ట్విస్ట్‌ తర్వాత చోటు చేసుకుంది. సరిగ్గ అదే సమయానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటీఫికేషన్‌ జారీ చేశారు. నాటి టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు బరిలోకి దిగారు. అయితే టీడీపీకి, దాని మిత్ర పక్షమైన బీజేపీకి సరిపడిన ఓట్లు లేవు. టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే 17 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఇద్దరు ఎమ్మెల్యేలను తమ అభ్యర్థికి ఓటు వేసే విధంగా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్టీఫెన్‌సన్‌ కొనుగోలుకు తెరలేపారనే ఆరోపణలతో ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆయనను అరెస్టుకు నాటి కేసీఆర్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఈ ఓటుకు నోటు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైన, చంద్రబాబు నాయుడుపై తీవ్రంగానే పడింది. అప్పటి వరకు తరచుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వెళ్లే చంద్రబాబు విజయవాడపై దృష్టి పెట్టారు. విజయవాడలోని స్టార్‌ హోటళ్లలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం, కలెక్టర్లు, ఎస్సీల రివ్యూలు చేపట్టడం చేస్తూ వచ్చారు. తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడం, శర వేగంగా తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించడం, హైదరాబాద్‌ నుంచి పాలనా యంత్రాంగాన్ని, సచివాలయాన్ని అమరావతికి తరలించడం చకచక జరిగిపోయాయి. ఈ సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్‌ట భన్‌కు వెళ్లడం తగ్గి పోయింది.
ఈ లోగా 2019 ఎన్నికలు రానే వచ్చాయి. అంతకంటే ముందుగానే తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. ఓటుకు నోటు కేసుతో ఉక్కిరి బిక్కిరి అయిన చంద్రబాబు అంతటితో ఊరుకోకుండా ఈ సారి కూడా టీడీపీని ఎన్నికల రంగంలోకి దింపారు. చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో జత కట్టారు. అయినా ఒటమి తప్ప లేదు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రా పార్టీగా బలమైన ముద్ర పడింది. రెండో సారి కూడా కేసీఆర్‌ ప్రభుత్వమే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీలోను టీడీపీ ఓటమి పాలైంది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌కు కామన్‌ శత్రువైన చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో టీడీపీ ఏపీలో ప్రతిపక్ష హోదా దక్కినా తెలంగాణలో నామ మాత్రంగా మారి పోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వెళ్లడం మానేశారు. టీడీపీ పార్టీ కార్యక్రమాలు చేపడితే ఓటుకు నోటు కేసు తెరపైకి వస్తుందనే ఆలోచనలతో చంద్రబాబు ఆ నిర్ణయానికి వచ్చారనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది.
Tags:    

Similar News