ఎన్టీఆర్‌ జిల్లాలో పోలింగ్‌ పెరగడానికి అదే కారణమా?

గత రెండు ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్‌ శాతం.

Update: 2024-05-14 10:41 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలు ముందుకు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ సారి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగానే పెరిగింది. జిల్లాలోని విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో అర్థ రాత్రి వరకు క్యూలో ఉండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 78.94 శాతం పోలింగ్‌ కాగా అంతకు ముందు జరిగిన 2014 ఎన్నికల్లో 77.28 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే ఈ రెండు ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలింగ్‌ 2024 ఎన్నికల్లో నమోదు కావడం గమనార్హం. సాయంత్రం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం దాదాపు 78.76 శాతం వరకు పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో కొన్ని చోట్ల అర్థ రాత్రి వరకు పోలింగ్‌ కొన సాగింది. దీంతో పోలింగ్‌ శాతం ఇంకా పెరిగే చాన్స్‌ ఉంది. దాదాపు 83 శాతం వరకు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని రాజీయ వర్గాలు అంచనా వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గంలో 79.28 శాతం, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గంలో 68.30, విజయవాడ సెంట్రల్‌లో 68.15, విజయవాడ తూర్పులో 69.11, మైలవరంలో 78, నందిగామలో 72.72 శాతం, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గంలో 78.28 శాతం చొప్పున పోలింగ్‌ శాతం నమోదైంది.

సెంటిమెంట్‌గా రాజధాని అమరావతి అంశం
రాజధాని అమరావతి అంశంపై జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వస్తున్నారు. రాజధాని అమరావతి విజయవాడకు సమీపంలో ఉంది. తుళ్లూరులో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల దానికి చుట్టు పక్కల ఉన్న తెనాలి, గుంటూరు, విజయవాడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నాడు తెలుదేశ ప్రభుత్వం అంచనా వేసింది. అదే విధంగానే అమరావతికి రూట్‌ మ్యాప్‌ కూడా రూపొందించారు. విజయవాడ వ్యాపార కేంద్రంగా గుర్తింపు ఉన్నప్పటికీ తుళ్లూరు ప్రాంతంలో రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత విజయవాడ నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందింది. నగరం రూపు రేకలు మారిపోయాయి. అటు ఇబ్రహీంపట్నం వైపు కానీ, ఇటు కానూరు, గన్నవరం వైపు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విస్తరణకు పునాదులు పడ్డాయి. అందులో భాగంగా విస్తరణ కూడా జరిగింది. దీనికి తోడు రియల్‌ ఎస్టేట్‌ కూడా వేగంగానే అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చంద్రబాబు మారిన తర్వాత విజయవాడకు ఒక మోడ్రన్‌ లుక్‌ను తీసుకొచ్చారు. అయితే 2019 నుంచి సీన్‌ రివర్స్‌ అయింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంచనాలన్నీ ఎన్టీఆర్‌ ప్రజల అంచనాలన్నీ తారుమారయ్యాయి. రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, నిర్మాణ పనులు నిలచిపోవడం, రాజధానిపై సీఎం జగన్‌ స్టాండ్‌ మారి పోవడంతో అప్పటి వరకు రాజధానిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఎన్టీఆర్‌ జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో నిరాశకు లోనయ్యారు. టీడీపీ హయాంలో అమరాతికి ఉన్న ప్రాధాన్యత, సీఎం జగన్‌ ప్రభుత్వంలో అమరావతికి ఉన్న ప్రాధాన్యత అనేది కూడా ఒక ఫ్యాక్టర్‌గా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నవరత్నాలు, సంక్షేమ పథకాలను ప్రధాన అజెండగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఎన్నికలకు వెళ్లగా రాజధాని అమరవాతిని రక్షించుకోవాలనే నినాదంతో టీడీపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలు గత ఐదేళ్ళుగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజధాని అంశం ఈ ఎన్నికల్లో కీలక అంశంగా మారిందని అదే పోలింగ్‌లో రిఫ్లెక్ట్‌ అయిందని, దీంతోనే పోలింగ్‌ పర్సెంటేజీ కూడా పెరిగి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇలా రాజధాని అమరావతి అంశం ఎన్టీఆర్‌ జిల్లా ఓటర్లకు ఒక సెంటిమెంట్‌గా మారిపోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News