తెలంగాణాకు సోనియా రావటం ఖాయమేనా ?

అందుకనే డిసెంబర్ 9 వ తేదీన సోనియాను తెలంగాణా(Telangana)కు రప్పించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Update: 2024-11-03 07:10 GMT

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణా పర్యటన ఖాయమవుతుందా ? ఇపుడీ విషయమే పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా(Sonia Gandhi) తెలంగాణాకు రాలేదు. రేవంత్ ప్రమాణస్వీకారానికి హాజరైన సోనియా మరే కార్యక్రమానికి హాజరుకాలేదు. అందుకనే డిసెంబర్ 9 వ తేదీన సోనియాను తెలంగాణా(Telangana)కు రప్పించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 7వ తేదీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణా వ్యాప్తంగా భారీ ఉత్సవాలను నిర్వహించేందుకు రేవంత్ డిసైడ్ అయ్యారు. వారంరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఏడాదికాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలుచేసిన ఆరుహామీలను, అభివృద్ధిలో రాష్ట్రం సాధించిన ప్రోగ్రెస్ ను జనాలకు వివరించేట్లుగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ విషయాలన్నింటినీ డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటున్నారు.

పనిలోపనిగా డిసెంబర్ 9వ తేదీన భారీ బహిరంగసభను నిర్వహించేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. బహిరంగసభ హైదరాబాద్(Hyderabad) లోనే లేకపోతే వరంగల్(Warangal) లాంటి ఏదైనా రూరల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలా అన్న విషయం డిసైడ్ కాలేదు. ఈ బహిరంగసభకు సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీలను రప్పించాలన్నది రేవంత్ ఆలోచన. ఇదే సమయంలో సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్న తెలంగాణా తల్లి(Telangana Talli Statue) విగ్రహాన్ని సోనియా చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబందించిన పనులు సచివాలయంలో స్పీడుగా జరుగుతున్నాయి. 2009, డిసెంబర్ 9వ తేదీన తెలంగాణా ఏర్పాటు చేసినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. దాంతో డిసెంబర్ 9వ తేదీని తెలంగాణా ప్రకటన దినోత్సవంగా జరుపుకోవాలని రేవంత్ అనుకున్నారు. అంటే డిసెంబర్ 9వ తేదీన సోనియాను తెలంగాణాకు పిలిపించటానికి భారీ బహిరంగసభ, తెలంగాణా తల్లి విగ్రహం ఆవిష్కరణ, తెలంగాణా ఏర్పాటు ప్రకటన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవటం లాంటి నాలుగు అంశాలు కలిసివస్తున్నాయి.

అందుకనే సోనియాను తెలంగాణాకు రప్పించటంపై రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్(Rahul Gandhi), ప్రియాంక(Priyanka Gandhi) తెలంగాణాలో విస్తృతంగా పర్యటించినా సోనియా మాత్రం రాలేదు. సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందనే విషయం జనాల్లో బలంగా చొచ్చుకుపోయేట్లుగా రేవంత్ అడ్ కో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ పోరాటాల వల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పడలేదని, తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియాగాంధి అనుకోవటం వల్లే ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందన్న విషయం జనాలు గుర్తుంచుకునేట్లుగా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. నిరాహారదీక్షలు చేయటం, చావునోట్లో తలపెట్టి తెలంగాణాను సాధించానని కేసీఆర్(KCR) చెబుతున్నదంతా పూర్తిగా అబద్ధమని ఇప్పటికే రేవంత్ అండ్ కో పదేపదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.

తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి సంబందించి డిసెంబర్ 7వ తేదీకి బాగా ప్రాధాన్యత ఉన్న కారణంగా ఎలాగైనా సరే సోనియాను రప్పించాలని రేవంత్ గట్టిగా డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీకి ఇంకా నెలరోజుల సమయం ఉన్న కారణంగా అందుకు అవసరమైన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్ ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjuna Kharge)తో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) తో కూడా చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే వ్యక్తిగతంగా ఢిల్లీ(Delhi)కి వెళ్ళి ముఖ్యులందరినీ కలిసి సోనియాను ఆహ్వానించాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News