Revanth and chandrababu in Davos|దావోస్ లో రేవంత్-చంద్రబాబుకు పోటీ ?

ఇద్దరు సీఎంలు తెలంగాణ, ఏపీ వేదికలను ఏర్పాటుచేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేబిజీలో ఉన్నారు.;

Update: 2025-01-21 08:30 GMT

తెలుగుముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు పోటీపడుతున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్(Davos) లో మూడురోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరం(World Economic Forum) సదస్సు మొదలైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ రంగాల్లో పేరుమోసిన కంపెనీలయాజమాన్యాలు పాల్గొంటున్నాయి. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రపంచదేశాలు కూడా ఈ సదస్సుకు హాజరవుతాయి. పెట్టుబడిదారులు+కంపెనీల యాజమాన్యాలు, వివిధ దేశాలప్రతినిధులు ఒకేచోట మూడురోజులు సమావేశం అవుతారు కాబట్టి ఏ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తెలుస్తుంది. అలాగే తమ కంపెనీల ఏర్పాటు, విస్తరణకు వివిధ దేశాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు, దేశాలు అనుసరిస్తున్న విధానాలను కంపెనీల యాజమాన్యాలు తెలుసుకుంటాయి. దావోస్ సదస్సు అభివృద్ధిచెందుతున్న దేశాలకు చాలా కీలకమైనదనే చెప్పాలి.

ఇంతటి కీలకమైన దావోస్ సదస్సుకు క్రమంతప్పకుండా మనదేశం నుండి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొంటున్నారు. తమరాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను, ప్రోత్సాహకాలను కంపెనీల యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు వివరిస్తారు. ఆసక్తిచూపిన కంపెనీలు, పెట్టుబడిదారులతో రాష్ట్రప్రభుత్వాలు అక్కడే ఒప్పందాలుచేసుకుంటాయి. చేసుకున్న ఒప్పందాలన్నీ ఆచరణలోకి రాకపోయినా కొన్నిఒప్పందాలు కార్యరూపం దాల్చినా గొప్పనే అనుకోవాలి. ఇంతటి కీలకమైన మూడురోజుల సదస్సుకు రేవంత్(Revanth), చంద్రబాబు(Chandrababu) హాజరయ్యారు. సోమవారం దావోస్ చేరుకున్న ఇద్దరు సీఎంలు విడివిడిగా ‘తెలంగాణ రైజింగ్’ పెవిలియన్, ‘ఏపీ లాంజ్’ ను ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ వేదికలను ఏర్పాటుచేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేబిజీలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడువేలమంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే సదస్సులో ఎలాగైనా పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటమే ఇద్దరు టార్గెట్ గా పెట్టుకున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), పునరుత్సాధక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి, ఉక్కురంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రులు ఇద్దరు పోటీపడుతున్నారు.

తెలంగాణ(Telangana), ఏపీ(AP)కి పెద్ద తేడానే ఉంది. అదేమిటంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణ అన్నీవడ్డించిన విస్తరివంటిది. ఏపీయేమో చిందరవందరగా ఉంది. రాజధాని లేక, స్ధిరమైన పారిశ్రామిక విధానాలు లేక, పాలకులపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఏ పెట్టుబడిదారుడైనా, పారిశ్రామికవేత్తయినా రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామని పరిశ్రమలు పెట్టడు. ఎక్కడ పరిశ్రమపెడితే, ఎక్కడ యూనిట్లను విస్తరిస్తే తమకు లాభంవస్తుందో చూసుకుని అక్కడే అన్నీఏర్పాటుచేస్తాడు. ఈకోణంలోచూస్తే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు తెలంగాణనే బెస్ట్ ఆప్షన్ అనటంలో సందేహంలేదు. నిజానికి మైనస్ హైదరాబాద్ మిగిలిన తెలంగాణలో అయిన డెవలప్మెంట్ పెద్దగాలేదనే చెప్పాలి. అలాగే ఏపీకి సంబంధించి వైజాగ్ ను పక్కనపెడితే మిగిలిన జిల్లాల్లో జరిగిన అభివృద్ది కూడా పెద్దగా లేదు. అయితే తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్(Hyderabad) ఉంటే ఏపీకి సరైన రాజధాని కూడా లేదు. చంద్రబాబు చెబుతున్న అమరావతి(Amaravati)లో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఒకటికిరెండుసార్లు ఆలోచిస్తారనటంలో సందేహంలేదు.

చంద్రబాబు చెబుతున్నట్లుగా అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎప్పుడవుతుందో ఎవరికీ తెలీదు. చంద్రబాబుకు చేతలకన్నా మాటలే ఎక్కువ. అందుకనే తనహయాంలో డెవలప్మెంట్ పెద్దగా కనబడదు. పైన చెప్పుకున్న రంగాల్లో పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీలుపడుతున్నారు. అమెజాన్, యూనీలీవర్, స్కైరూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ లాంటి అతిపెద్ద కంపెనీల సీఈవోలతో రేవంత్ వరుసగా భేటీలవుతున్నారు. పోయిన ఏడాది దావోస్ పర్యటనలో రేవంత్ బృందం ఎంవోయూలతో రు. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసందే. ఈసారి పర్యటనలో ఫోర్త్ సిటి(ఫ్యూచర్ సిటీ)ని రేవంత్ ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాడు. కాబట్టి ఈసారి ఏ రంగంలో ఎన్ని వేలకోట్లరూపాయల పెట్టుబడులు తీసుకొస్తారో చూడాలి.

ఇదేసమయంలో ఉక్కురంగంలో పేరొందిన లక్ష్మీమిట్టల్(Lakshmi Mittal) తో చంద్రబాబు, లోకేష్(Lokesh) భేటీ అయ్యారు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. అలాగే సోలార్ పవర్ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలోని 930 కిలోమీటర్ల సముద్రతీర ప్రయోజనాలను, పోర్టులను, విమానాశ్రయాలను పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు వివరిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్ సెల్ పవర్ యూనిట్లు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఇద్దరు సీఎంలు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించటమే టార్గెట్ గా వరుసబెట్టి సమావేశాలు జరుపుతున్నారు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ‘తెలంగాణా రైజింగ్’ ఆకర్షిస్తుందా లేకపోతే ‘ఏపీ లాంజ్’ ఆకర్షిస్తుందా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News