కేటీఆర్ మూడు తప్పులుచేశారా ?

ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి కారు రివర్స్ గేరులోనే నడుస్తోంది. పదేళ్ళు తెలంగాణాను ఏలిన బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోతోంది.

Update: 2024-10-15 05:21 GMT

ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి కారు రివర్స్ గేరులోనే నడుస్తోంది. పదేళ్ళు తెలంగాణాను ఏలిన బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోతోంది. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి అధికార కాంగ్రెస్ పై ఏదో విధంగా బురదచల్లేయాలని తెగ ప్రయత్నంచేస్తోంది. ఈ ప్రయత్నంలో చాలా తప్పులు చేస్తోంది. ప్రభుత్వంలో ఉన్నపుడు తాము టేకప్ చేసిన ప్రాజెక్టులు, చేసిన నిర్ణయాలకు ఇపుడు విరుద్ధంగా నడుచుకుంటోంది. ఇదంతా చూసిన తర్వాత బీఆర్ఎస్ నేతల్లో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ బయటపడుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న గోల తాజాగా జారీచేసిన ప్రెస్ నోటే ఇందుకు నిదర్శనం.

ముచ్చటగా ముడు విషయాల్లో కేటీఆర్ తప్పులో కాలేశారు. మొదటిది ఆక్రమణల తొలగింపు, రెండోది మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు, ఇపుడు దామగుండం రాడార్ స్టేషన్ పై ప్రకటించిన వైఖరి. మొదటగా మూడో పాయింట్ చూస్తే రంగారెడ్డి జిల్లా పూడూరు గ్రామం దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మంగళవారం కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్ధాపన జరగబోతోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తు కేటీఆర్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై నిప్పులుచెరిగారు. ఏ ప్రయోజనాలను ఆశించి తెలంగాణాను కేంద్రానికి రేవంత్ రెడ్డి తాకట్టుపెడుతున్నారని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నేవీ స్టేషన్ ఏర్పాటువల్ల మూసీనది అంతర్ధానం అయిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గంగానదికి ఒక న్యాయం, మూసీనదికి మరో న్యాయమా అంటు నిలదీశారు.

కేటీఆర్ ప్రశ్నలు అంతా బాగానే ఉన్నాయి కాని తాము అధికారంలో ఉన్నపుడు చేసిందేమిటి అనే ఎదురు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ? ఎందుకంటే దామగూడెం రిజర్వు ఫారెస్టులో 2900 ఎకరాల భూమిని రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీచేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. 2017, డిసెంబర్ 19వ తేదీన జారీచేసిన జీవో 44 లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాడిన తర్వాత దామగూడెం రిజర్వ్ ఫారెస్టు 2900 ఎకరాలను కేంద్రంకు బదలాయిస్తే ఎంత చెల్లింపులు చేయాలనే విషయాన్ని అప్పటి జిల్లా ఫారెస్టు అధికారే నేవీ విభాగానికి లేఖ పంపారు. 2017న నేవీకి రాసిన లేఖలో పెరిగిన ధరల ప్రకారం భూమి ధర చెల్లించాలని కోరారు. 2017 మార్చి 2వ తేదీన రాష్ట్ర అటవీశాఖ పంపిన డిమాండ్ నోట్ ప్రకారమే నేవీ రు. 133.54 కోట్లను రాష్ట్రప్రభుత్వానికి చెల్లించింది. భూసంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చులో 25 శాతం చెల్లించాలని డీఎఫ్వో పంపిన నోట్ ఆధారంగా నేవీ అధికారులు రు. 18.56 కోట్లు చెల్లించారు. అంటే దీన్నిబట్టి ఏమి తెలుస్తోంది ? భూమి కేటాయింపులు, దానికి సంబంధించిన చెల్లింపులు, అటవీశాఖ భూమిని రక్షణశాఖ నేవీకి బదిలీచేయటం అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిపోయింది.

నిజానికి ఇపుడు జరగుతున్న శంకుస్ధాపన నేపధ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదు. తమ హయాంలోనే అటవీశాఖ భూములను కేటాయించి రాడార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఓకే చెప్పిన కేటీఆర్ ఇపుడు ఇదేదో కొత్త వ్యవహారం అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోయటం విచిత్రంగా ఉంది. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. ఇక ఆక్రమణల కూల్చివేతలు, మూసీనది ప్రాజెక్టు విషయంలో కూడా కేటీఆర్ ఇలాగే వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేల అక్రమనిర్మాణాలున్నాయని కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. వాటన్నింటినీ కూల్చేస్తామని, హైదరాబాద్ పరిధిలో ఆక్రమణ అంటేనే అందరికీ భయంపుట్టేలా చర్యలు తీసుకోబోతున్నట్లు స్వయంగా కేసీఆరే చెప్పారు.

కేసీఆర్ ప్రకటన తర్వాత కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించి బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను కూల్చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటుచేసి ఆక్రమణలను కూల్చేస్తుంటే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నానా గోలచేస్తున్నారు. మూసి డెవలప్మెంట్ ప్రాజెక్టును టేకప్ చేసిందే కేటీఆర్. మూసీని డెవలప్ చేయటంలో భాగంగా నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించాలని అధికారులను కేటీఆర్ స్పష్టంగా ఆదేశించారు. ఎవరు అడ్డుపడినా మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆగదని కూడా ప్రకటించారు. అలాంటిది ఇపుడు రేవంత్ మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు టేకప్ చేయగానే నివాసితుల ఇళ్ళను కూల్చేందుకు లేదంటు జనాలను కేటీఆర్, హరీష్ రావు, నేతలు రెచ్చగొడుతున్నారు. బాధితులతో సమావేశాలు పెట్టి వాళ్ళందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఆక్రమణలను కూల్చేయాలని నిర్ణయించి, మూసీనదికి రెండువైపులా ఉన్న నిర్మాణాలను తొలగించాలని ఆదేశించిన కేటీఆర్ ఇపుడు అవే పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంటే తట్టులేకపోతున్నారు. అంటే కేటీఆర్ వైఖరి ఎలాగుందంటే అధికారంలో ఉంటే తామే ఉండాలి పొరబాటున ప్రతిపక్షంలో కూర్చోవాల్సొస్తే అధికారంలో ఉన్నవాళ్ళని ప్రశాంతంగా ఉండనీయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నారు. అందుకనే అధికారంలో ఉన్నపుడు తాము తీసుకున్న నిర్ణయాలు ఇపుడు అమల్లోకి వస్తుంటే వ్యతిరేకిస్తు నానా గోలచేస్తున్నారు. ఇందుకనే కారు రివర్సు గేరులో నడుస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News