కృష్ణయ్య పిటీషన్‌లు వైఎస్‌ఆర్‌సీపీకి ఎఫెక్టేనా?

బీసీ నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య గతంలో ముస్లిం, కాపు రిజర్వేషన్లను రద్దు చేయాలని కోర్టులో పిటీషన్‌లు వేశారు. ఈ ప్రభావం వైఎస్‌ఆర్‌సీపీపై ఉంటుందా?

Update: 2024-05-11 06:30 GMT

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా తెరపైకి వచ్చిన అంశం ముస్లిం రిజర్వేషన్లు. బీజేపీ దీనిని తెరపైకి తీసుకొచ్చింది. అయితే బీజేపీ మంత్రులు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మంత్రులు చెబుతుంటే, ముస్లిం రిజర్వేషన్‌ల రద్దుకు తాము వ్యతిరేకమని, ముస్లిం రిజర్వేషన్లను తాము సమర్థిస్తున్నామని బీజేపీకి గుండెకాయ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

ముస్లిం రిజర్వేషన్లు రద్దు కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ పిటీషన్‌
దీంతో పాటు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి మరో అంశం కూడా ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య గతంలో సుప్రీం కోర్టుకు వెళ్లిన అంశం కూడా తాజాగా చర్చనీయాంశంగా మారింది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కల్పించారు. ఆయన వారసుడిగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సమర్థిస్తుండగా అదే పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌ కృష్ణయ్య మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలని గతంలో సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీలో ముస్లిం రిజర్వేషన్‌లపై భిన్న స్వరాలు వినిపిస్తుండటం కూడా ముస్లిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ అంశం సామాజి మాధ్యమాల్లోను వైరల్‌గా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారంటే ఆ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నట్టే కదా అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ కూడా గొంతెత్తారు. వారం రోజుల క్రితం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపైన, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్‌ కృష్ణయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇక్బాల్‌ మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్‌ల పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి చిత్త శుద్ధి లేదని విమర్శించారు. అందుకే ముస్లిం రిజర్వేషన్‌ల రద్దు కోరుతో సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఆర్‌ కృష్ణయ్య వేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకునే విధంగా సీఎం జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 16 ప్రకారం ముస్లిం 4 శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది. అయితే ముస్లింలకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేసిన ఆర్‌ కృష్ణయ్య వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ కాదా అని నిలదీశారు.
కాపు రిజర్వేషన్లపైన గతంలో కృష్ణయ్య పిటీషన్లు
గతంలో తెరపైకి వచ్చిన కాపు రిజర్వేషన్‌ల అంశంపైనా కూడా ఆర్‌ కృష్ణయ్య తీవ్రంగానే స్పందించారు. కాపు రిజర్వేషన్‌లను ఆర్‌ కృష్ణయ్య తీవ్రంగా వ్యతిరేకించారనే విమర్శలు ఉన్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అంతేకాకుండా కాపు రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో కూడా పిటీషన్‌లు దాఖలు చేశారు. దీంతో అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారింది.
వైఎస్‌ఆర్‌సీపీకి కీలకం
తాజాగా ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీకి ముస్లిం, కాపు ఓట్లు చాలా కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో వీరి మద్దతును కూడగట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సారి ఎన్నికల్లో కూడా వీరి ఓట్లు పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి నేతలు వైఎస్‌ఆర్‌సీపీలో ఉండటం వల్ల వారి మద్దతు లభిస్తుందని సీఎం జగన్‌ అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేనలు బీజేపీతో కూటమిగా ఏర్పడటం, బీజేపీని ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తుండటంతో వారి మద్దతు కూడా తమకే ఉంటుందని సీఎం జగన్‌ భావిస్తున్నారు. అయితే ఎంతో కీలకమైన కాపులు, ముస్లిం మైనారిటీల వర్గాలకు వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య కోర్టులో పిటీషన్‌లు వేయడం ఆ రెండు వర్గాల్లో దుమారం రేపుతోంది. మరో వైపు కోర్టులో పిటీషన్లు వేసిసిన ఎంపీ ఆర్‌ కృష్ణయ్య వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన నేత కావడంతో సీఎం జగన్‌ అంచనాలు బెడిసి కొట్టే అవకాశం ఉందని, దీంతో ముస్లిం, కాపు వర్గాల ఓట్లు ఆ పార్టీకి పడే అవకాశాలు తగ్గుతాయని, ఫలితాల్లో ఇది తీవ్ర ప్రభావం చూపే చాన్స్‌ ఉందని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News