అమిత్ షా చెప్పింది నిజమేనా?
కొండపావులూరులో జరిగిన సభలో అమిత్ షా రాష్ట్రానికి మూడు లక్షల కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. ఎందుకన్నారు. నిజంగా రాష్ట్రానికి గ్రాంట్ ఇచ్చారా?;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చితికి పోయింది. అప్పుల పాలైంది. ఈ విషయం భారత ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి, కేంద్ర మంత్రులు పలువురికి తెలుసు. ఎన్నోసార్లు ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా సాయం అందించాలని కోరుతూ వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూనే ఉన్నారు. నేటికీ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఆస్తుల విభజన పూర్తి కాలేదంటే కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను ఎలా ఆటాడుకుంటుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ పక్షాల కూటమి (ఎన్డీఏ) అధికారం చేపట్టింది. పదేళ్లు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిద్దరూ పదేళ్ల కాలం మోదీ అడుగులకు మడుగులొత్తారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వాల విధానాల కారణంగా అప్పులు లేని రాష్ట్రంగా ఉన్న ఏపీ అప్పుల కుప్పగా మారింది. ప్రజలు నివసించే భూములను కూడా అప్పుల కింద తాకట్టు పెట్టారు.
మూడు లక్షల కోట్లపై చర్చ
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎప్ వార్షికోత్సవానికి హాజరైన హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం ఈ ఏడు నెలల కాలంలో చేసినట్లు చెప్పారు. సభకు వచ్చిన వారు ఆశ్చర్య పోయారు. అంత డబ్బు రాష్ట్రానికి ఇస్తే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఎందుకు ముఖ్యమంత్రి చెబుతున్నారనే సందేహం అందరిలో ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా మొదలైంది. ఎందుకు ఇలా చెప్పారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమకే దిక్కు లేకుండా పోయింది. ఈ పరిశ్రమను ప్రైవేట్ వారికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఆంధ్రులు, తెలంగాణ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముడి సరుకు ఇప్పించకుండా నష్టాలు వస్తున్నాయని కేంద్రం చెప్పటం ఏమిటనేది పలువురి ప్రశ్న. చివరకు కాస్త వెనక్కు తగ్గింది. ప్రైవేట్ కు అప్పగించే విషయంలో ఆలోచనలో పడింది.
అమలు కాని విభజన హామీలు
విభజన సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని పట్టుబట్టిన వారిలో బీజేపీ వారు ముందు వరుసలో ఉన్నారు. అటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీని మరిచి పోయింది. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తమని ప్రకటించిన విద్యా సంస్థలు మాత్రం ఏర్పాటు చేశారు. వాటికి కూడా పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ విద్యా సంస్థల్లో స్థానికుల కంటే వేరే రాష్ట్రాలకు చెందిన వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించారు. ఉదాహరణకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ లో నార్త్ ఇండియాకు చెందిన వారే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి తెలుగు రాదు. దీంతో తెలుగు వారైన ఆంధ్రులు ఎయిమ్స్ లో భాషా సమస్య వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వైద్యులకు తెలుగు రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఏపీ పాలకులకు అడిగే దమ్ములేదు: సీపీఐ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్ కింద ఆర్థిక సాయం చేయాలని అడిగే దమ్ము ఆంధ్రప్రదేశ్ పాలకులకు లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆయన ‘ది ఫెడరల్’ ప్రతినిధి తో మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ లు ఇచ్చేందుకే డబ్బులు లేవు. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక సాయం అంటూ ఏమీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికొస్తే ప్లాంట్ వారు బాండ్స్ రిడప్షన్ ఇవ్వాలని, ఆ తరువాత సాయం అందిస్తామని స్టీల్ ప్లాంట్ కు కండీషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వారేమో సాయం అందించారి ఊదర గొట్టుకుంటున్నారు. అమరావతికి ఇస్తున్నది కూడా సాయం కాదని అందరికీ తెలుసు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మరిన్ని అప్పులు చేసే అవకాశం కేంద్రం కల్పించింది. దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇలా చాలా సార్లు జరిగాయి. పెట్టుబడులు రాలేదు. ఇదంతా షో చేయడమేనని రామకృష్ణ అన్నారు.