బీసీ మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయామా?
వైసీపీ నాయకుల్లో ఒక మహానటి వుందని మంత్రి కొల్లు విమర్శలు;
By : V V S Krishna Kumar
Update: 2025-07-13 13:07 GMT
రాజకీయాలకోసం బీసీ మహిళను అడ్డంపెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.వైసీపీ నాయకత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి పైశాచిక రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గుడివాడలో జరిగిన సంఘటనలపై కొల్లు మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .వైసీపీ నాయకుల్లో ఒక మహానటి ఉందన్నారు.
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కారును టీడీపీ నాయకులు వదిలేశారని, అయితే ఆమె కావాలనే తిరిగి వచ్చి పోలీసులను, టీడీపీ నాయకులను దుర్భాషలాడారని కొల్లు ఆరోపించారు. ఈ సంఘటనను టీడీపీ నాయకత్వానికి అంటగట్టి, రాష్ట్రవ్యాప్తంగా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నంలో వైసీపీ విఫలమైందని ఆయన తెలిపారు.బీసీలను అడ్డంపెట్టుకొని రాష్ట్రమంతా భగ్గుమనిపించాలని చూసి అడ్డంగా బుక్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ కుట్రల వెనుక వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.గత ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని కొల్లు రవీంద్ర విమర్శించారు.
పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మా నాయకులు తాపత్రయపడుతున్నారు. కానీ, వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అశాంతిలోకి నెట్టాలని చూస్తున్నారు అని ఆయన విమర్శించారు.వైసీపీ నాయకులు మానవత్వం లేని పైశాచిక రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి నీచ ఆలోచనలను గుర్తిస్తున్నారని హెచ్చరించారు.వైసీపీ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు, కుట్రలు కొనసాగిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి అన్నారు.