ఏపీ కి మొంథా తుపాను ముప్పు తప్పదా?

ఆంధ్రా తీరంపై తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 20 లక్షల ఎకరాల పంటకు ముప్పు పొంచి ఉంది. ఈ ఆందోళన రైతులను నిద్ర పోనివ్వటం లేదు.

Update: 2025-10-27 08:06 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'మొంథా' తుపానుగా మారి, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, ఈ తుపాను అక్టోబరు 28న కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో, తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

తుపాను ప్రభావం ఇప్పటికే ప్రారంభమైంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి తుప్పర్లుగా మొదలైన వర్షం మధ్యాహ్నం 2 గంటలకు మోస్తరు వర్షంగా మారింది. ప్రస్తుతానికి గాలి లేదు కానీ, సాయంత్రానికి గాలి, వర్షం పెరిగే అవకాశం ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే వరి పంటతో పాటు పలు రకాల పంటలు సాగులో ఉన్నాయి. పంట చేతికి వచ్చే పరిస్థితి లేదనే భయం రైతులను వెంటాడుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల రైతుల గుండెల్లో భయాందోళనలు పరుగెడుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, సుమారు 20 లక్షల ఎకరాల పంటకు ముప్పు పొంచి ఉంది.


తుపాను ధాటికి ఇప్పటికే చాలా వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి. బీచ్‌లు, బోటింగ్ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు సమావేశాలు నిర్వహించి, సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా కట్టడి చేశారు. ప్రధాన కాలువలు, రోడ్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను ఇటీవలే పరిశీలించి, తగిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఐఎండీ హెచ్చరికల ప్రకారం, తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటిన తర్వాత గాలుల వేగం 100 కిమీలకు చేరవచ్చు. ఇది కృష్ణా-గోదావరి బెల్ట్‌లో నష్టాన్ని కలిగించవచ్చు. ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు.

తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది. రైతులు పంటలను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లను సిద్ధం చేసింది. ప్రజలు అధికారిక హెచ్చరికలను పాటించాలి. ఈ తుపాను ఆర్థిక, వ్యవసాయ నష్టాలను కలిగించే అవకాశం ఉంది. కానీ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించవచ్చు.

Tags:    

Similar News