కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షికి తొందరెక్కువలాగుంది
మొదటి మీటింగులోనే సీనియర్ నేతలకు క్లాసులు పీకినట్లున్నారు;
మీనాక్షి నటరాజన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తెలియని వారుండరు. ఎందుకంటే ఇపుడామె తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి. తెలంగాణకు ఇన్చార్జిగా నియమించిన తర్వాత మొదటిసారి మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి(Meenakshi Natarajan) శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో హైదరాబాదు చేరిన వెంటనే ఆమె గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి(Revanth), పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కొందరు మంత్రులు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు. తర్వాత మధ్యాహ్నంపైన నాంపల్లిలోని పార్టీ ఆఫీసు గాంధీభవన్(Gandhi Bhavan) కు చేరుకున్నారు. మొదటిసారి రావటం కాబట్టి పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఇన్చార్జిలు ఎవరైనా మొదటిసారి వచ్చినపుడు చేసేది ఇదే.
అయితే మీనాక్షి మాత్రం కాస్త డిఫరెంటుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మొదటి మీటింగులోనే సీనియర్ నేతలకు క్లాసులు పీకినట్లున్నారు. ప్యారాచూట్ నేతలకు పదవులు ఇవ్వటం సాధ్యంకాదన్నారు. కష్టపడి పనిచేసిన నేతలకే పార్టీలో స్ధానముంటుందన్నారు. పార్టీపటిష్టత కోసం కష్టపడిన నేతలను అధిష్ఠానం గుర్తిస్తుందనేటువంటి అరిగిపోయిన రికార్డులు వినిపించారు. పార్టీ, ప్రభుత్వం అధిష్ఠానానికి రెండుకళ్ళని చెప్పారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు. పార్టీ పటిష్టంకోసం నేతలు, క్యాడర్ అంతా ఏకతాటిపై నడవాలని చెప్పారు. ఇలాంటి విషయాలు మీనాక్షి చాలానే చెప్పారు.
అయితే మీనాక్షి మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే రేవంతే ప్యారాచూట్ లీడరని. రేవంత్ తో పాటు మంత్రి సీతక్క, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి లాంటి చాలామంది నేతలు టీడీపీ నుండి వచ్చిన వారే. అంటే మీనాక్షి భాషలో ప్యారాచూట్ లీడర్లే. అలాగే మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లాంటి ఆయారామ్ గయారామ్ నేతలు చాలామందే ఉన్నారు. పార్టీ కోసం గడచిన 30 ఏళ్ళుగా కష్టపడి పనిచేసిన జెట్టి కుసుమ్ కుమార్ లాంటి వాళ్ళకు పదవులు ఇంకెప్పుడిస్తారంటు స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డే మీడియా సమావేశం సాక్షిగా అధిష్ఠానాన్నే ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. కష్టపడేవాళ్ళకు పదవులు వస్తయని చెప్పటం, వినటంవరకే బాగుంటాయి. ఆచరణలో అది అందరి విషయంలోను సాధ్యంకాదు. ఎంఎల్ఏ కోటాలో తొందరలో భర్తీ చేయబోతున్న ఎంఎల్సీ సీట్లలో ఒకటి కచ్చితంగా కుసుమ్ కుమార్ కు ఇవ్వాల్సిందే అని జగ్గారెడ్డి పదేపదే చేస్తున్న డిమాండ్ మీనాక్షి చెవినపడిందో లేదో.
పార్టీ, ప్రభుత్వం అధిష్ఠానానికి రెండు కళ్ళని మీనాక్షి చెప్పింది నిజమే. అయితే తమకు పదవులు దక్కకపోతే పార్టీని థిక్కరించి, అధిష్ఠానంపై దుమ్మెత్తిపోసేందుకు చాలామంది సీనియర్లు రెడీగా ఉన్నారన్న విషయం మీనాక్షికి తెలీదా ? మీనాక్షి సామర్ధ్యం ఏమిటో తొందరలోనే తేలిపోతుంది. ఎలాగంటే వచ్చేనెలలో ఎంఎల్ఏ కోటాలో ఐదు ఎంఎల్సీ సీట్లను భర్తీ చేయాల్సుంది. ఈఐదింటిలో నాలుగు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్(BRS) కు దక్కుతుంది. కాంగ్రెస్ కు దక్కే నాలుగు సీట్లలో ఒకదాన్ని సీపీఐ, మరోదాన్ని ఎంఐఎం అడుగుతున్నాయి. ఇక మిగిలిన రెండుసీట్లలో ఎవరిని ఎంపికచేస్తారన్నది కత్తిమీద సాములాంటిదే. ఈ ఎంపికలోనే మీనాక్షి సత్తా ఏమిటో తేలిపోతుంది.