పెరిగిన పోలీస్ పహారా
ఎన్నికల అనంతరం హింసపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ పహారాను పెంచారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-05-22 14:31 GMT
ఎన్నికల అనంతరం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా, ఎలాంటి హింసాయుత సంఘటనలకు అవకాశం లేకుండా పటిష్టమైన రక్షణ చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న అల్లర్ల సంచలనంగా మారాయి. వీటిపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రాత్రి వేళల్లో కూడా తనిఖీలు, గస్తీలు నిర్వహించాలని స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారిని విచారణ చేపట్టాలని ఆదేశించారు. హోటళ్లు, లాడ్జీలను కూడా తనిఖీలు నిర్వహించే చర్యలు చేపట్టారు. నేర నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేక పికెట్లను, బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరచిన ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. దీని చుట్టు పక్కల ఎవరు రాకుండా పట్టిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా కార్టెన్ సెర్చ్‌లు, ఆపరేషన్లు, పెట్రోలింగ్‌లు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ హిహెచ్‌డి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల అనంతరం అల్లర్ల నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. సమస్యాత్మక ప్రాంతాలపైన దృష్టి పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. కౌంటింగ్ అనంతరం ఎలాంటి ప్రేరేపిత హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా పోలీసుల పహార పెట్టారు.
ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మందుగుండు సామాగ్రి నిల్వలపైన ప్రత్యేక నిఘా పెట్టారు. హింసకు ప్రేరేపించినా, అల్లర్లకు దిగినా వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌ల నేతృత్వంలో నిర్వహించిన పెట్రోలింగ్‌లో ఇప్పటి వరకు 60 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు మరో 61 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను ఇరిష్ ద్వారా చెక్ చేస్తున్నారు. ఫుట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు, కార్టెన్ సెర్చ్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిని, నేరాలు చేసిన వారిని గుర్తించి వారిలో ఇద్దరు వ్యక్తులపై పిడి యాక్ట్‌లు పెట్టడంతో పాటు ఒకరిని నగర బహిష్కరణ చేసారు. మరో 20 మందిపై రౌడీ షీట్లు, 50 మందిపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తూ, విద్వేషాలను రెచ్చగొడుతూ, ఘర్షణలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని సీపీ రామకృష్ణ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కౌంటింగ అనంతరం ర్యాలీలు, ఊరేగింపులు, బాణా సంచాలు కాల్చడాలు నిషేధించారు. బాణా సంచాలు విక్రయాలు, బాణా సంచాలను తయారీ చేయడాన్ని కూడా నిషేధించారు.
ఓట్ల లెక్కింపు అనంతరం శాంతి భద్రతలకు విఘాతం లేకుండా గుంటూరు జిల్లాలో ఆ జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని స్థానిక పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. ఈవీఎంలు భద్రపరచిన ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భధ్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. బాటిళ్లల్లో పెట్రోలు, డీజల్ పోయకుండా పెట్రోలు బంకు నిర్వాహకులకు నోటీసులిచ్చారు. జిల్లాలో 144 సెక్ష¯Œ అమలు చేస్తున్నారు. ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. కృష్ణా జిల్లాలో కూడా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు.