వెదురు ఉత్పత్తుల ద్వారా ఆదాయం రాబట్టాలి

ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;

Update: 2025-08-14 13:38 GMT

వెదురు ఉత్పత్తుల ద్వారా ఆదాయం ఆర్జించే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమి వివరాలను జీఐఎస్‌ ద్వారా ల్యాండ్‌ మ్యాపింగ్‌ చేయాలని, ఈ–రిజిస్ట్రేషన్లు, బౌండరీలను జీఐఎస్‌ సహాయంతో మ్యాప్‌ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వాహనాల పన్ను చెల్లింపులు సక్రమంగా జరిగేలా ఆర్టీజీఎస్, సీసీ కెమెరాలను ఉపయోగించాలని సీఎం స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఇస్తున్న రాయితీని కొనసాగించాలని ఆదేశించారు. స్క్రాప్‌ వాహనాల పాలసీని కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని సీఎం సూచించారు. డ్రోన్, శాటిలైట్‌ టెక్నాలజీతో గనుల తవ్వకాలను గుర్తించి డేటా అనలటిక్స్‌ ద్వారా ఆదాయాన్ని పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు.

ఆదాయార్జనలో మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర నిధులు, టాక్స్‌ డెవల్యూషన్‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏపీ టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ద్వారా పన్ను వసూళ్లను పర్యవేక్షించాలని, సేవల రంగం ద్వారా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైన దృష్టి పెట్టాలని సూచించిన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో చేపట్టే కాంట్రాక్టు పనులకు వినియోగించే వాహనాల పెట్రోలు, డీజిల్‌ ఉత్పత్తులను రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని కాంట్రాక్టు సంస్థలు పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేయటం వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోతున్నామని, దీనిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కూటమి ప్రభుత్వానికి ఎక్సైజ్‌ ఆదాయం కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు, ఆర్ధిక లావాదేవీలకు అనుగుణంగానే భూ రిజిస్ట్రేషన్‌ విలువలు ఉండాలని నిర్దేశించారు. క్రయ విక్రయాలును శాస్త్రీయంగా విశ్లేషించాలని... భూమి విలువలు పెంచుకుంటూ పోవటం సరికాదని అన్నారు. మార్కెట్‌ విలువలు, ప్రాపర్టీ డేటా కోసం డేటా అనలటిక్స్‌ వినియోగించాలని అన్నారు. పన్ను ఎగవేతలను గుర్తించడానికి, ప్రభుత్వ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు చేయండంతో పాటు సాంకేతిక వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.
ఆర్టీజీఎస్‌ ద్వారా వచ్చే వివరాలతో పాటు టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పోరేషన్లలో ఆటో మ్యూటేషన్‌ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మున్సిపల్‌ రికార్డుల్లో తప్పులు సవరించి జియో ట్యాగింగ్‌ చేయాలని సీఎం సూచించారు. ఆధార్, మొబైల్, ఎలక్ట్రిసిటీ డేటాను కూడా అనుసంధానించి పన్ను వసూళ్ళ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. స్వామిత్వ సర్వే ద్వారా గ్రామకంఠాల గుర్తింపు ప్రక్రియ 2026 ఫిబ్రవరికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. పంచాయితీల్లో నిర్వహించే ఖాతాలను ఆడిట్‌ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అటవీశాఖ వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలతో రూ.1,500 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశముందని... అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు.
Tags:    

Similar News