‘లడ్డు’ సిబిఐ చేతిలో పడితే చంద్రబాబుకి చిక్కులే..

బాబు తొలిసారి సీబీఐ జాబితాలోకి ఎక్కుతారా. అదే జరిగితే చంద్రబాబు నరేంద్ర మోదీ చేతికి చిక్కినట్టే. అందుకే ఒక ప్రశ్న: సీబీఐని రాష్ట్రంలోకి రానిస్తాడా?

Update: 2024-10-01 18:03 GMT

తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం కొత్త మలుపు తిరిగింది. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సంధించిన ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సెట్) తన విచారణను తాత్కాలికంగా నిలిపివేసింది. సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో జరిగిన వాదనల ప్రకారం- ఒకవేళ న్యాయస్థానం ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లయితే ఏమి జరుగుతుందన్న అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


సుప్రీం ధర్మాసనం సంధించిన ప్రశ్నలు తిరుపతి లడ్డూ వివాదాన్ని సీబీఐకి అప్పగించవచ్చునేమో అనే అనుమానానికి తావిస్తున్నాయి. సీబీఐకి ఈ కేసును అప్పగించినట్లయితే చంద్రబాబు సెప్టెంబర్ 18న ఎన్డీఏ సమావేశంలో ఈ అంశాన్ని పబ్లిక్ గా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే అంశం మొదలు టీటీడీ ఈవో జే.శ్యామల రావు చేసిన ప్రకటన కూడా సీబీఐ విచారణ పరిధిలోకి రావచ్చు. అప్పుడు తీగ లాగితే డొంకంతా కదలవచ్చు. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం- గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూల తయారీలో జంతు కొవ్వును వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడంతో వివాదం మొదలైంది. రాజకీయ లబ్ధి కోసమే నాయుడు ‘నీచమైన ఆరోపణలు’ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపైనా విచారణ జరగవచ్చు. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్.డీ.డీ.బీ) కి చెందిన “సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్” (కాఫ్) లేబొరేటరీ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం లడ్డూలను తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, ఇతర ప్లాంట్ ఆధారిత నూనెలు కలిశాయి. ఆ నెయ్యిలో నిర్దిష్ట ప్రమాణాలు ఉండాల్సిన స్థాయిలో లేవని పేర్కొంది. దీనిపై వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉటంకిస్తూ ఈ వివాదంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగిస్తే తప్ప నిజానిజాలు బయటకు రావని స్పష్టం చేసింది.

సీబీఐ విచారణను చంద్రబాబు స్వాగతిస్తారా?
నిజానికి చంద్రబాబు నాయుడు 2018లోతమ రాష్ట్రంలోకి సిబిఐ రానివ్వనని అభ్యంతరం తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని తెలుగుదేశంతో భావసారుప్యత ఉన్న పారిశ్రామిక వేత్తల ఇళ్లపై దాడులకు సంబంధించిన వ్యవహారంలో 2018 ఆగస్టు లో ఓ జీవో తీసుకువచ్చారు. దాని ప్రకారం సీబీఐకి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. సీబీఐ అనేది కావడానికి కేంద్ ప్రభుత్వ సంస్థే అయినా ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలి. దాని పరిధి అంతా ఢిల్లీ ప్రాంతమే. మిగతా రాష్ట్రాలలో ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏదైనా విచారణ సాగించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. ఒకవేళ సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు ఆనాడు జారీ చేసిన జీవోను రద్దు చేసుకుని సీబీఐని అనుమతించాలనే వాదన వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నియమిస్తుంది గనుక చంద్రబాబు అనివార్యంగా సీబీఐని అనుమతించాల్సి ఉన్నందున గుట్టుచప్పుడు కాకుండా ఆ జీవోను ఉపసంహరించుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం చంద్రబాబు ప్రతిష్టకు సంబంధించినదవుతుందన్నది పరిశీలకుల భావన.
కేసు ఎవరి మీద పెట్టినా బాబుదే బాధ్యత..
లడ్డూ విచారణ కేసు సీబీఐకి పోతే కేసు ఎవరి మీద పెడతారు? ఎఆర్ ఫుడ్స్ మీదనా లేక తొందరపడి మీడియాకెక్కిన చంద్రబాబు మీదనా? రెండు ప్రెస్ కాన్ఫరెన్సుల్లో భిన్న స్వరాలు వినిపించిన టీడీడీ ఇవో జేశ్యామలరావు మీద కూడా సీబీఐ విచారణ జరపవచ్చు. ఎవరి మీద పెట్టినా సీబీఐ అధికారులు అనివార్యంగా చంద్రబాబును విచారించాలి. ఆ విధంగా చంద్రబాబు తొలిసారి సీబీఐ విచారణ జాబితాలోకి వస్తారు. అదే జరిగితే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ చేతికి చిక్కినట్టే. చంద్రబాబు పార్టీ మద్దతు మీద ఆధారపడి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్నే ఓ ఆటబొమ్మలా ఆడించే అవకాశం ఉంది.
సీబీఐతో విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని అటు వైసీపీ నేత, టిటిడి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సెప్టెంబర్ 30న దీనిపై విచారణ జరిగింది. దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడి కి చురకలంటించారు. టీటీడీ ఈవో చెప్పిన దాని ప్రకారం కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వాడలేదు. కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను తిరిగి పంపించామని సెప్టెంబర్ 19న పత్రిక విలేకరుల సమావేశంలో జేశ్యామలరావు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వైసీపీ హయాంలో కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఆ పాత టెండరుదారు సరఫరా చేసిన కల్తీ నెయ్యితోనే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారైంది. ఆ లడ్డూలనే అయోథ్య రామాలయ ప్రారంభోత్సవానికీ పంపారని ఆరోపించారు.

కల్తీ నెయ్యి నమూనాలను జూన్ 12వ తారీఖున గుజరాత్ లోని ఎన్డీడీబీ లాబ్ కి పంపితే జులై 24న నివేదిక వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే సుమారు రెండు నెలల పాటు ఈ నివేదికను బయట పెట్టకుండా సెప్టెంబర్ 18న ఎందుకు బయటపెట్టారనే విషయమై ముఖ్యమంత్రిని సీబీఐ విచారించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు సంధించిన ముఖ్యమైన ప్రశ్నలలో ఇదొకటి. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భక్తులను తీవ్ర ఆందోళనలకు గురిచేసేలా ఇట్లాంటి సున్నిత విషయాలను మీడియాతో ఎందుకు చెప్పాల్సివచ్చిందన్న విషయాన్నీ విచారించవచ్చు. వైసీపీ ఆరోపించినట్టుగా లడ్డూ గొడవలో రాజకీయాంశం ఉందా అనే అంశంపై చంద్రబాబును, జగన్ కూడా సీబీఐ విచారించవచ్చు. ఇలాంటి అనేక విషయాలు సీబీఐ పరిధిలోకి వస్తాయి. అప్పుడు ఏమి జరుగుతుంది అన్నది చర్చనీయాంశం.
సీబీఐకి ఇస్తారనే సిట్ విచారణ ఆగిందా..
సుప్రీంకోర్టులో వాదోపవాదల తీరు చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయడం ఈ కేసు విచారణ సీబీఐకి పోతుందేమో అనే అనుమానాలకు బలం చేకూర్చింది. కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు సమీక్షలో ఉన్నందున సిట్ దర్యాప్తును అక్టోబర్ 3 వరకు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ద్వారకా తిరుమలరావు తెలిపారు. "తిరుపతి లడ్డూ ప్రసాదం కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటైందన్నారు. "సిట్ ఏర్పాటుపైనా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
జగన్ పార్టీకి ప్రాణం పోసిన చంద్రబాబు..
2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై కొట్టుమిట్టాడుతున్న వైసీపీకి చంద్రబాబు ప్రాణం పోశారనే టాక్ విస్తృతంగా వినబడుతోంది. ఒక్క జగన్ తప్ప మరే నాయకుడూ తమ నియోజకవర్గాల్లో తిరగడానికి కూడా వెనకాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చిన లడ్డూ వివాదం ఒక విధంగా వైసీపీకే లాభించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దర్నీ బీజేపీ ఆడిస్తోందన్న నానుడి ఉన్నప్పటికీ ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు వైఎస్ జగన్ కే లాభించేలా ఉన్నాయి. ముగ్గురు సభ్యులు రాజీనామా చేసిన తర్వాత కూడా వైసీపీకి రాజ్యసభలో 8 మంది సభ్యులున్నారు. బీజేపీ ప్రభుత్వం మున్ముందు తీసుకువచ్చే ఏ బిల్లయినా పాస్ కావాలంటే వైసీపీ మద్దతు అనివార్యం. కొందరు ఈ కోణంలోనూ లడ్డూ వివాదాన్ని చూస్తున్నారు.
Tags:    

Similar News