నెహ్రూని విమర్శించే స్థాయి ఆర్ఎస్ఎస్ కి ఎక్కడుంది?

నెహ్రూపైన 79 వ్యక్తిగత ఆరోపణలా.. ఇదేం తీరు..

Update: 2025-11-13 11:10 GMT
నెహ్రూ జయంతి సభలో ప్రసంగిస్తున్న తులసిరెడ్డి
నవభారత నిర్మాత, తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూని విమర్శించే స్థాయి మతోన్మాద సంస్థ ఆర్ఎస్ఎస్ కి లేదని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్, పార్లమెంటు మాజీ సభ్యులు డాక్టర్ ఎన్. తులసీ రెడ్డి. భారత సమగ్రాభివృద్ధికి పునాదులు వేసిన నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పై విమర్శలు చేయడం తగదని అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవించే ఆర్.ఎస్.ఎస్ లాంటి సంస్థలు సోషల్ మీడియాలో నెహ్రూ వ్యక్తిత్వ హననానికి పూనుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నవంబర్ 13న గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రగతిలో నెహ్రూజీ పాత్ర అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ఎన్. తులసీ రెడ్డి ప్రసంగించారు.
నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసి, పంచవర్ష ప్రణాళికలను అమలు చేసి, అతి పేదరికంలో ఉన్న భారత్ ను ముందుకు నడిపిన మహనీయుడని కొనియాడారు. అమెరికా, రష్యా కూటముల వైపు మొగ్గకుండా అలీన ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందినారన్నారు. దేశ విభజన అనంతరం 565 సంస్థానాలను విలీనం చేసి ఫ్రెంచ్ నుండి పుదుచ్చేరిని, పోర్చుగీసు నుండి గోవాను విముక్తి చేసి భారత దేశ సమగ్రతను కాపాడారని తెలిపారు.
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ సామాజిక మధ్యమాలలో నెహ్రూ గురించి 79 తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని, మహా పురుషులను గౌరవించే సాంప్రదాయమున్న మనదేశంలో తల్లితండ్రులను, మహిళలను అగౌరవ పరచడం అమానవీయమన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కు షేక్ అబ్దుల్లా, మహారాజ హరిసింగ్ తో సత్సంబంధాలతో నేడున్న జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోగలిగామన్నారు.
శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఐఐటి, ఐఐఎం, ఇస్రో, ఎయిమ్స్ , సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, ఆర్ ఈ సి లాంటి విద్య పరిశోధనా సంస్థలను, నాగార్జున సాగర్, హీరాకుడ్, భాక్రానంగల్ లాంటి బహుళార్ధక సాధక నీటి ప్రాజెక్టులను, బిహెచ్ఈఎల్, ఐడిపిఎల్ , సెయిల్, కోల్ ఇండియా లాంటి పారిశ్రామిక సంస్థలను ప్రారంభించి అభివృద్ధి చేసి దేశం వేగంగా పయనించడానికి కారణ భూతుడైనాడని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ జవహర్ లాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై 1929లో సంపూర్ణ స్వాతంత్య్రన్ని సాధించాలనే తీర్మానాన్ని ఆమోదింప చేశారన్నారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, 9ఏళ్ల జైలు జీవితం అనుభవించినారన్నారు.
'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'Glimpses of world History, 'లెటర్స్ టు ద డాటర్' లాంటి గ్రంథాలను రచించి సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలను అవగాహన చేసుకున్న ప్రపంచ మేధావి నెహ్రూ అని అభివర్ణించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రంగయ్య ప్రసంగిస్తూ రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలోనూ, రాజ్యాంగ రూపకల్పన లోను నెహ్రూ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. రాజ్యాంగ పీఠికను రూపొందించడంలో, ఆదేశిక సూత్రాల రచనలో నెహ్రూది ముఖ్య భూమిక అన్నారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కొండవీటి చిన్నయసూరి ప్రసంగిస్తూ స్వాతంత్ర్య ఉద్యమం సాంస్కృతిక జాతీయవాదం, ఉదార జాతీయవాదం, సోషలిస్ట్ జాతీయ వాదాలుగా కొనసాగిందని, నేడు సాంస్కృతిక జాతీయవాదమే అగ్ర భాగాన చేరి నెహ్రూపై నిందలు వేసిందన్నారు.
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ నెహ్రూ 1956లో ప్రారంభించిన నాగార్జున సాగర్ ఫలితంగా పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు కారణ భూతమయ్యిందన్నారు. నెహ్రూ నాడు చాటి చెప్పిన సోషలిజం, సమ్మిళత వృద్ధి, లౌకిక వాదాల పట్ల వ్యతిరేక భావాలు ఉన్న ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి సంస్థలు నెహ్రూపై నిందలు వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు , రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాల్, తెలుగు సాహితీవేత్త డాక్టర్ వి. సింగారావు, సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు ప్రసంగించారు.
Tags:    

Similar News