పరామర్శకు వెళ్తే కేసు పెడుతారా

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.;

By :  Admin
Update: 2025-01-22 12:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పక్ష పార్టీకి చెందిన నేతలపై కేసుల పర్వం కొనసాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత కాకాణి గోవర్థన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల చేత ఫిర్యాదులు ఇప్పించడం కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ కేసు నమోదైంది. కాకాణి గోవర్థన్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కావలి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని కోళ్లదిన్నె గ్రామానికి చెందిన ప్రసన్న కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయశారు. బోగోలు మండలం కోళ్లదిన్నెలో పోలీసులుపై కాకాణి గోవర్థన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రసన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

తనపై నమోదైన కేసుపై కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పందించారు. కూటమి నేతలు, కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేడర్‌పై దాడులు చేస్తున్నారని, పరామర్శకు వెళ్లిన తనపై అక్రమ కేసు నమోదు చేశారని, ఇది దారుణమని విమర్శలు చేశారు. తనపై మరిన్ని కేసులు పెట్టేందుకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారని ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన శ్రేణులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు తమ గొంతును నొక్కలేరని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులపై భవిష్యత్‌లో తప్పవని హెచ్చరించారు. ఈ అక్రమ కేసులు, అరెస్టులపై కోర్టుకు వెళ్తామన్నారు. ఈ అరెస్టులు, కేసులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ జగన్‌ హార్డ్‌ కోర్‌ అభిమానులను ఆపలేరని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ధైర్యంగా వాటిని ఎదుర్కొంటామని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు పోరాడుతామని కాకాణి తెలిపారు.
Tags:    

Similar News