ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు
సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం సాయంత్రం బదిలీ చేసింది.;
ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీలు భారీస్థాయిలో ఉంటాయని ముందు నుంచీ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఈ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పనితీరు ప్రజల సంసతృప్తి స్థాయిని బట్టి నిర్ణయిస్తామని చాలా కాలంగా చెబుతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకాల అమలు తీరుపై సర్వేలు చేయించారు. ఇంటెలిజెన్స్ ద్వారా ఐఏఎస్ ల పనితీరుపై సమాచారం తెప్పించుకున్నారు. ఆ మేరకు బదిలీలు చేపట్టారు. సోమవారం జరిగిన బదిలీలు కొన్ని మాత్రమేనని, త్వరలో మరింత మంది బదిలీ అవుతారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయని చర్చ జరుగుతోంది. బాగా పనిచేసిన వారిని మూడేళ్ల పాటు అక్కడే ఉంచాలని, పనితీరు బాగోలేదని రిపోర్టులు వచ్చిన వారికి స్థాన చలనం కలిగించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
జి అనంత రాము: పర్యావరణ అటవీ విభాగం నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం.
అనిల్ కుమార్ సింఘాల్: తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా నియామకం.
ఎం.టి. కృష్ణబాబు: హెల్త్ విభాగం నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదిలీ. అదనంగా ఇన్ఫ్రా & ఇన్వెస్ట్మెంట్స్ బాధ్యతలు.
జె శ్యామలారావు: టీటీడీ ఈవో పోస్టు నుంచి బదిలీ చేసి జీఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం.
ముఖేశ్ కుమార్ మీనా: జీఏడీ నుంచి రెవెన్యూ (ఎక్సైజ్) విభాగానికి బదిలీ. అదనంగా మైన్స్ విభాగం బాధ్యతలు.
కాంతిలాల్ దాండే: రోడ్లు, భవనాల శాఖ నుంచి పర్యావరణ, అటవీ విభాగానికి బదిలీ.
సౌరభ్ గౌర్: సివిల్ సప్లైస్ నుంచి హెల్త్ శాఖ సెక్రటరీగా, సివిల్ సప్లైస్ అదనపు బాధ్యతలు కొనసాగింపు.
ప్రవీణ్ కుమార్: మైన్స్ నుంచి ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ.
సీ హెచ్ శ్రీధర్: మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియామకం. కమిషనర్ బాధ్యతలు అదనంగా ఇచ్చారు.
ఎంవి శేషగిరి బాబు: కార్మిక శాఖ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం ఆయన కార్మిక శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
ఎం హరి జవహర్ లాల్ (రిటైర్డ్): గవర్నర్ కార్యాలయం నుంచి రెవెన్యూ (ఎండోమెంట్స్) విభాగానికి బదిలీ చేశారు.