ప్రవీణ్ కుమార్ అంత జ్ఞనోదయం ఎలా వచ్చింది?

తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం, ప్రవీణ్ ప్రకాష్ అంతర్మథనంలో ఆవిష్కరించారు.

Update: 2025-11-13 02:48 GMT

భారతీయ పరిపాలన సేవల్లో 30 ఏళ్ల అనుభవం. ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎస్ అధికారిగా సేవ చేసి వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్. తన తప్పును బహిరంగంగా ఒప్పుకుని క్షమాపణ చెప్పడం విచిత్రం.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలిత హయాంలో ముఖ్య కార్యదర్శిగా ఉండగా, రిటైర్డ్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్‌లపై క్రమశిక్షణ చర్యలకు ఆమోదం తెలిపిన ప్రవీణ్ ప్రకాష్, ఇప్పుడు ఆ తీర్పును తాను చేసిన 'తప్పు'గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ మార్పు అంటే జ్ఞానోదయానికి కారణం ఏమిటో?


ఏబీ వెంకటేశ్వరరావు,                                                                 జాస్తి కృష్ణ కిశోర్

రాజకీయ ఒత్తిడి మధ్య తీసుకున్న తీర్పులు

1994 బ్యాచ్ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్ల సేవలో అనేక శాఖల్లో కీలక పాత్రలు పోషించారు. 2019-2024 మధ్య YSRCP ప్రభుత్వంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండగా రిటైర్డ్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (అప్పటి ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్) మీద డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌కు 2020లో ఆమోదం తెలిపారు. అదే విధంగా రిటైర్డ్ IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్ పైనా క్రమశిక్షణ చర్యలు, అభియోగాల నమోదుకు సంబంధించిన తీర్పులకు అంగీకారం తెలిపారు. సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఇవి 'సరైనవి' అని ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ తీర్పులు 'నీతి, నైతిక విలువలు' కోణంలో తప్పులుగా మారాయని అంగీకరిస్తున్నారు.

YSRCP ప్రభుత్వం పతనం తర్వాత TDP నేతృత్వంలోని NDA కూటమి అధికారంలోకి వచ్చిన జూలై 2024లో ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏడేళ్ల ముందు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న ఆయన, రాజకీయ మార్పుల మధ్య తన స్థానాన్ని పరిశీలించుకుని, ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ రిటైర్మెంట్ తీసుకున్న సంవత్సరం తర్వాత నవంబర్ 12, 2025న ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ఈ అంతర్మథనాన్ని బహిర్గతం చేశారు. "చదువు, సంస్కారంతో పాటు ఎదిటి వారికి సాయం చేసే గుణాన్ని మర్చిపోయాను" అని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇద్దరు అధికారులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి క్షమాపణ చెప్పినట్లు తెలిపారు.

రాజకీయ ఒత్తిడి నుంచి మానవత్వం వైపు

 రాజకీయ ప్రభావం కింద తీర్పులు తీసుకునే సందర్భాలు భారతీయ పరిపాలనలో అసాధారణం కాదు. YSRCP హయాంలో విమర్శలు ఎదుర్కొన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సాధారణమైంది. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆయనకు వచ్చిన 'జ్ఞానోదయం' కేవలం రాజకీయ మార్పు వల్ల కాదు, వ్యక్తిగత అంతర్దృష్టి వల్ల. "ప్రభుత్వ ఉద్యోగికి వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య అంతరం ఉండాలి, కానీ అది లేకుండా పోయింది" అని ఆయన అంగీకరించడం, తన తప్పును 'సిస్టమ్'కు ఆపాదించకుండా వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం అనేది అసలు మార్పు.

ఈ క్షమాపణ బహిరంగంగా ఉండటం వల్ల మరింత ప్రాముఖ్యత పొందింది. సాధారణంగా అధికారులు తమ తప్పులను మూసివేస్తారు. లేదా రాజకీయ ఆధారంగా రక్షించుకుంటారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ "నీతి కోణం నుంచి ఆలోచించలేకపోయాను" అని చెప్పి, ఇద్దరు అధికారులకు పబ్లిక్ అపాలజీ చెప్పటం, సివిల్ సర్వీసెస్‌లో 'అకౌంటబిలిటీ'ని పునరుద్ధరించే ప్రయత్నం. ఇది యువ IAS అధికారులకు స్పూర్తి. రాజకీయ ఒత్తిడి కింద కూడా మానవ విలువలు మరచిపోకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాజకీయ మార్పులు (TDP విజయం తర్వాత) ఇలాంటి పశ్చాత్తాపాలను ప్రేరేపించాయా? లేదా ఇది వ్యక్తిగత పరిణతా? రెండూ కలిసి పనిచేస్తున్నాయా అనే సందేహాల నుంచి విశ్లేషకులు బయటకు వచ్చి ఆలోచించాల్సి వస్తోంది.

పరివర్తన అంటే... ఒక IAS హీరో నుంచి మానవత్వం వైపు...

IAS పరివర్తన  చెందటం అంటే కేవలం అనుభవం నుంచి నేర్చు కోవడం కాదు, తప్పుల నుంచి నేర్చుకోవడం. సర్దుకోవడం. ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారి 30 ఏళ్ల సేవల తర్వాత "ఒక్క తప్పుతో హీరో నుంచి విలన్ అయ్యాను" అని ఒప్పుకోవడం. ఇది ఆయన పరిణతికి అద్దం పట్టింది. ఈ సంఘటన ఆంధ్ర రాజకీయాల్లో 'విలన్లు'గా మారిన అధికారులు తమ చరిత్రను రాసుకోవచ్చని చూపిస్తోంది. మిగిలిన IASలకు ఇది పాఠం. పరిపాలనలో 'సిస్టమ్' కాదు, 'మానవత్వం' ముందుండాలి. ప్రవీణ్ ప్రకాష్ లో ఈ మార్పు, సివిల్ సర్వీసెస్‌లో కొత్త శక్తిని రేకెత్తిస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News