రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయొచ్చని ఆలోచించా
నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయొచ్చని ఆలోచించా.. అది విజన్ అంటే అని సీఎం చంద్రబాబు అన్నారు. సంవిధాన్ దివస్ సంర్భంగా ఏపీ అసెంబ్లీలో బుధవార రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.... ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో ప్రిపేర్ అవ్వాలి. అదే నేను రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ గా చేరాలని అడిగితే...లెక్చరర్‌గా రాను ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. 1978లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని చెప్పి గెలిచి చూపించాను. నిరంతరం శ్రమ చేయాలి. ప్రతి ఒక్కరికీ సంక్షోభాలు వస్తాయి...వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలి. అందువల్లే నేను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 30 ఏళ్లకే నేను మంత్రి అయ్యాను..40 ఏళ్లకు సీఎం అయ్యాను. అని చంద్రబాబు తన నేపథ్యాన్ని వివరించారు.
విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు చాలా అభినందనీయం. 175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు...చాలా బాగా రాణించారు. అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్ గా వ్యవహరించారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.