హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు ఇప్పటికైనా గుర్తొచ్చాయి
టాయిలెట్లు ఉన్నాయి. అయితే వాటిని శుభ్రపరిచేవారు లేరు. అన్నం వండి రెడీగా ఉంచినా వడ్డించే వాడు లేకపోతే పరిస్థితి ఏమిటో హాస్టళ్లలో టాయిలెట్ల పరిస్థితి అదీ...
ఆంధ్రలో ఇప్పుడు ఒక్కసారిగా సంక్షేమ హాస్టళ్లలో శుద్ధి చేసిన తాగునీరు, పారిశుద్ధ్యం గురించి ప్రభుత్వానికి గుర్తొచ్చింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలో “ఒక్క చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు, నేరుగా చర్యలు” అంటూ ఉన్నతాధికారులను హెచ్చరించారు. కానీ ప్రశ్న ఒక్కటే ఇన్నేళ్ల పాలనలో ఈ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు ఎందుకు పూర్తి కాలేదు? ఇప్పుడు రూ.40 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం రాజకీయ డ్రామాగానే కనిపిస్తోంది.
గత ఐదేళ్లలో బీసీ, ఎస్టీ హాస్టళ్లలో పదుల సంఖ్యలో ఫుడ్ పాయిజనింగ్, కలుషిత నీటి కేసులు వచ్చాయి. పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఆ హాస్టళ్లను సందర్శించారా? ఒక్క ట్వీట్ అయినా వేశారా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర దాటిన తరువాత “యుద్ధప్రాతిపదిక” అంటూ ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు, బ్లడ్ శాంపిల్స్, డిజిటల్ హెల్త్ రికార్డులు, కమాండ్ కంట్రోల్ రూం, ఒక్కసారిగా అన్నీ ప్రకటించడం వెనుక రాజకీయ లాభమా, నిజమైన ఆందోళనా?
ఇంకో విషయం ఇప్పుడు ప్రకటించిన రూ.40 కోట్లు కొత్తవా? లేక గతంలోనే కేటాయించి, పనులు పూర్తి చేయని నిధులను మళ్లీ “విడుదల” పేరుతో ప్రకటిస్తున్నారా? రాష్ట్రంలో 20 శాతం హాస్టళ్లలో ఇప్పటికీ టాయిలెట్లు లేవు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. రెసిడెన్సియల్ స్కూళ్లలో మాత్రం టాయిలెట్లు ఉన్నాయి.
“గత ప్రభుత్వం నిర్లక్ష్యం” అని ఒక్క మాటతో సరిపెట్టేస్తే సరిపోదు. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ హాస్టళ్లను అలాగే నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం మళ్లీ కళ్ల ముందు కనిపిస్తోంది. కానీ ఈసారి బాధ్యత మాత్రం చంద్రబాబు సొంత ప్రభుత్వందే.
అధికారంలో ఉన్నవాడు మేలుకుంటే చాలదు, ముందుగానే మేలుకోవాలి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం మంచిదే, కానీ ఆ చర్యలు కేవలం పత్రికా ప్రకటనల్లోనే ఆగిపోకూడదు. రంగంలోకి దిగి, నిధులు సక్రమంగా వినియోగమవుతున్నాయో లేదో ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించాలి. లేకపోతే... మళ్లీ ఐదేళ్ల తర్వాత మరో ముఖ్యమంత్రి వచ్చి “గత ప్రభుత్వం నిర్లక్ష్యం” అని అదే డైలాగ్ చెప్పడం తప్ప మరేమీ మిగలదు.
బడుగు బలహీన వర్గాల పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు రాజకీయ ఆరోపణలకు మించిన విషయాలు. ఇప్పుడు ప్రకటించిన చర్యలు నిజంగా అమలు అయితేనే... ఈ సమీక్షకు అర్థం ఉంటుంది. కాకపోతే మరోసారి “హైప్” మాత్రమే మిగులుతుంది.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు
ఆర్వో ప్లాంట్లు లేని ‘ప్రతి హాస్టల్, ప్రతి రెసిడెన్షియల్ స్కూల్’ లో తక్షణమే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.
20 శాతం హాస్టళ్లలో ఇంకా పూర్తి కాని టాయిలెట్ల నిర్మాణానికి రూ.40 కోట్లు విడుదల. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి.
అన్ని హాస్టళ్లలో ‘వారం వారం ఆర్వో ప్లాంట్ల ఆడిటింగ్’ జరపాలి.
ప్రతి హాస్టల్ నుంచి ‘వాటర్ శాంపిల్స్’ తీసి పరీక్షించాలి.
4.17 లక్షల మంది విద్యార్థుల ‘రక్త నమూనాలు’ సేకరించి, ఎనిమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు ముందుగానే గుర్తించి చికిత్స అందించాలి.
ప్రతి విద్యార్థికీ ‘డిజిటల్ హెల్త్ రికార్డు’ ఏర్పాటు చేయాలి.
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ‘ప్రత్యేక కౌన్సెలింగ్’ కార్యక్రమాలు బాలురకు పురుష కౌన్సెలర్లు, బాలికలకు మహిళా కౌన్సెలర్ల ద్వారా నిర్వహించాలి.
సంక్షేమ శాఖలన్నీ కలిపి ఉమ్మడి ‘కమాండ్ కంట్రోల్ రూం’ ఏర్పాటు చేయాలి.
మంత్రులు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాలి. నిత్యం టెలీకాన్ఫరెన్స్‌లు జరపాలి.
గత ఐదేళ్లుగా సంక్షేమ హాస్టళ్లలో శుద్ధ తాగునీరు, మురికిలేని వాతావరణం కోసం ఎదురుచూస్తున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ నిర్ణయాలు ఊరట కలిగించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని సమగ్ర చర్యలు చేపట్టడం స్వాగతించదగిన అడుగు అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.