దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశా..చంద్రబాబు, లోకేష్ చేస్తారా

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసు కలకలం రేపుతోంది. వైసీపీ నాయకుల మెడలకు చుట్టుకునే అవకాశం ఉందని చర్చ ఉంది.

Update: 2025-10-27 09:17 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపుతోన్న నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సత్యప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్ద చేరుకున్న ఆయన, చేతిలో దివ్వెను వెలిగించుకుని "ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని ప్రమాణం చేశారు. తన వ్యక్తిత్వంపై నిందలు వేసి, కుటుంబాన్ని అవమానపరిచినవారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. 

సోమవారం ఉదయం జోగి రమేశ్ తన భార్య, పిల్లలతో కలిసి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్దే ఆగి, దివ్వెను వెలిగించుకుని ప్రమాణం చేశారు. "నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును బాధపెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశాను" అని ఆయన మీడియాకు తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గమ్మలపై ప్రమాణానికి సిద్ధమని ముందుగానే చెప్పిన జోగి, ఈ సవాల్‌కు కట్టుబడి ప్రమాణం చేశారు. అదే సమయంలో, నార్కో అనాలసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమని పునరుద్ఘాటించారు.

"నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు? నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా? పోనీ.. లై డిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి" అని జోగి రమేష్ మరోసవాల్ విసిరారు. ఈ ప్రమాణం తర్వాత, వైసీపీ కార్యకర్తులు ఆలయంలో "జోగి జిందాబాద్" అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తెరపైకొచ్చిన నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 50కి పైగా మరణాలు, వందలాది మంది దీని వల్ల ప్రభావితులు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 జనార్ధన్ రావు, తన వీడియోల్లో జోగి రమేష్ పేరు ప్రస్తావించాడు. "జోగి రమేష్ ప్రలోభాలకు లొంగి నకిలీ మద్యం తయారీ ప్రారంభించాను. ఆయన రూ.3 కోట్లు సాయం చేస్తానని చెప్పారు" అని జనార్ధన్ విచారణలో చెప్పాడు. TDP అధికారంలోకి రాగానే తయారీ ఆపేశామని కూడా వెల్లడించాడు. ఈ ఆరోపణలు వైసీపీ పాలనలో మద్యం కల్తీ వ్యవహారాన్ని బయటపెట్టాయని కూటమి నేతలు ప్రచారం చేశారు. జోగి రమేష్ మాత్రం "నాకేం తెలియదు" అని గతంలోనే తిరస్కరించారు. పోలీసులు జోగిని నిందితుడిగా చేర్చేందుకు ఆధారాలు సేకరిస్తున్నట్లు వైసీపీ వర్గాలు విమర్శలు చేస్తున్నారు. 

Tags:    

Similar News