ఏపీలో వరదలకు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల కారణంగా భారీగానే ప్రాణ నష్టం వాటిల్లింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోనే మృత్యువాత పడ్డారు. ఏయే జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే..
Byline : Vijayakumar Garika
Update: 2024-09-07 07:59 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య ఆందోళనకరంగా మారింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు 6వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వరదల్లో కొట్టుకొని పోయిన మరో ఇద్దరి ఆ చూకీ ఇంత వరకు తెలియ లేదు. వారు ప్రాణాలతో మిగిలి ఉన్నారా లేదా వదరలకు బలై పోయారా అనేది నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మిస్సిగ్ అయిన ఆ ఇద్దరిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది వరదలకు బలి కాగా.. ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువ మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. తర్వాత గుంటూరు జిల్లాలో అధిక సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరి ఆచూకీ ఇంత వరకు తెలియ లేదు. విజయవాడ నగరంలో ఐదుగురు మరణించారు. విజయవాడ తూర్పు మండలం పరిధిలోని మొగల్‌రాజపురం కొండ చరియలు విరిగి పడిపోవడంతో వాటి కింద పడి ఈ ఐదుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కూడా మరణించిన వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. విజయవాడ రూరల్ ప్రాంతాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.
విజయవాడ నార్త్, జి కొండూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఒక జి కొండూరు మండలంలోనే నలుగురు మరణించారు. విజయవాడ నార్త్ మండలంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మైలవరం మండలంలో ఇద్దరు, ఇబ్రహీంపట్నం మండలంలో ఇద్దరు, రెడ్డిగూడెం మండలంలో ఒకరు, కంచికచర్ల మండలంలో ఒకరు, విజయవాడ తూర్పు మండలంలో ఒకరు చొప్పున ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గుంటూరు జిల్లాలో కూడా అధిక సంఖ్యలోనే మరణాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. పెద్దకాకాని మండలంలో వరదకు కారు కొట్టుకొనిపోయిన దుర్ఘటనలో ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మంగళగిరి టౌన్ ఒకటో వార్డు పరిధిలో బండరాళ్లు పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. తాడికొండ మండలం పొన్నేకల్లులో కొండవీటి వాగు వరద ప్రవాహంలో కొట్టుకొని పోయిన దుర్ఘటనలో ఒకరు మరణించారు. పెద్దకాకాని మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుంటూరు నగరం నందివెలుగు రోడ్డులో వరద ప్రవాహానికి కొట్టుకొని వచ్చిన ఒక డెడ్ బాడీని గుర్తించారు. పల్నాడు జిల్లాలో కూడా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు టూవీల్ మీద ప్రయాణిస్తూ స్థానికంగా సంభవించిన వరద ప్రవాహంలో కొట్టొకొనిపోయిన ఘటనలో ఒకరు మరణించినట్లు శనివారం ఉదయం ప్రభుత్వం ప్రకటించింది.
యానిమల్స్, కోళ్ల నష్టం కూడా పెద్ద ఎత్తున వాటిల్లింది. 462 యానిమల్స్ మరణించగా వీటిల్లో పెద్ద యానిమల్స్ 106, చిన్న యానిమల్స్ 356 ఉన్నాయి. 61,974 పౌల్ట్రీ కోళ్లు మరణించాయి. మత్స్యకారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. 217 బోట్లు పనికి రాకుండా పోయాయి. 226 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చేపల వేటకు ఉపయోగించే 1371 వలలు పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోగా, మరో 70 వలలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఇప్పటి వరకు చేపట్టిన అంచానాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3913.90కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 20 జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం కూడా వాటిల్లింది. 1,81,538 హెక్టార్లలో 2,05,194 మంది రైతుల పంటల ఎఫెక్ట్ అయ్యాయి. 12 జిల్లాల్లో హార్టీకల్చర్ క్రాప్స్ కూడా దెబ్బతిన్నాయి. 19686 హెక్టార్లలో 30,877 మంది రైతుల పండ్ల తోటలు వరదలకు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.