బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు? రెండా? నాలుగా?
మంత్రి పదవుల కేటాయింపులు చంద్రబాబుకు కత్తిమీద సాములా మారింది. బీజీపీకి ఎన్ని ఇస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.
Byline : Vijayakumar Garika
Update: 2024-06-11 12:30 GMT
మంత్రి పదవుల కేటాయింపుల అంశంపై గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయనే దానిపై అటు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఇటు జనసేన, బీజేపీ నేతల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికలకు ముందు.. సీట్ల కేటాయింపుల అంశాలలో తగ్గింపు, త్యాగాలు చూపించిన జనసేన, బీజేపీలు తాజాగా మంత్రుల పదవులు అంశంలోను చూపిస్తాయా అనేది తాజాగా హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగుదేశానికి, జనసేనకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది పక్కన పెడితే.. కూటమిలో కోటా కింద బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి.. ఆ మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బీజేపీ మొత్తం 10 అంసెబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపు జెండాను ఎగుర వేసింది. వీరిలో కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ, సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సత్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలు ఉన్నారు.
సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నుంచి గెలుపొందారు. వాల్మీకి పార్థసారథి ఆధోని నుంచి , ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి, సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్‌రాజు గెలుపొందారు.
2014 ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందితే ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించారు. కామినేని శ్రీనివాస్‌కు, పైడికొండల మాణిక్యాలరావులు మంత్రులయ్యారు. ఈ సారి 8 మంది బీజీపీ నుంచి గెలిచారు. అయితే ఈ సారి ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండే కేటాయిస్తారా లేదా నాలుగు ఇస్తారా అనేది చర్చగా మారింది. అయితే బీజేపీ కోటా కింద ఇద్దరికే చోటు దక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరు ఎవరనేది బీజేపీ వర్గాల్లో కూడా స్పష్టత లేదు. అయితే ఒకరు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి మరొకరనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ చంద్రబాబు నాయుడుకి సన్నిహితులు కావడం, బీజేపీ కంటే కూడా టీడీపీ నేతలుగానే వీరిపైన ముద్ర ఉండటం, గతంలో కామినేని శ్రీనివాస్ మంత్రిగా పని చేయడం, సుజనా చౌదరి బాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా పేరు ఉండటం, గతంలో కేంద్ర మంత్రిగా పని చేయడం వంటి అంశాల ఆధారంగా వీరిద్దరికే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని టాక్ ఆ పార్టీలో నడుస్తోంది.
అయితే ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇద్దరిలో ఒకరికి చోటు దక్కడం కష్టమనే టాక్ కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది. ఒక పదవి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినా.. రెండోది రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే చాన్స్ ఉందనే టాక్ ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డికి ఈ సారి మంత్రి పదవి వరించే చాన్స్ ఉందనే టాక్ ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా పని చేశారు. లేదంటే బీసీ కోటా కింద ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్‌కు దక్కే చాన్స్ ఉందని టాక్ ఉంది. 2014లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కామినేనికి, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాణిక్యాలరావుకి మంత్రి పదవులు దక్కాయి. అయితే కేంద్ర బీజేపీ పెద్దలు సూచించిన వారికే మంత్రి పదవులు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ ఆ పార్టీల నేతల్లో వినిపిస్తోంది.