హోం ఓటర్లు మూడు శాతమేనా?

భారత ఎన్నికల కమిషన్‌ హోం ఓటింగ్‌కు అవకాశం కల్పించింది. దాన్ని వినియోగించుకుంటున్న వారు మాత్రం చాలా తక్కువ మంది. ఎందుకు ఇలా జరుగుతోంది?

Update: 2024-05-04 02:59 GMT

హోం ఓటింగ్‌ అర్హులు 7,28,484 మంది

ఇంటివద్దే ఓటు వేస్తున్న వారు 28,591 మంది
భారత ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన అవకాశాన్ని వృద్ధులు, దివ్యాంగులు సరిగా వినియోగించుకోలేదు. హోం ఓటింగ్‌కు చాలా మంది విముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కారణం ఏమిటి? పోలింగ్‌ బూత్‌ వద్దకే వారు వచ్చి ఓటు వేయాలనుకున్నారా? అసలు ఓటు వేయటానికి వారు సుముఖత చూపడం లేదా? ఇందులో ఏది నిజం? ఎలా ఈ విషయాన్ని మేధావులు అర్థం చేసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలిసిన వారు దీనిని ఎలా అర్థం చేసుకుంటారనే దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దనే ఓటు వేసేందుకు అర్హులు. వారికి భారత ఎన్నికల సంఘం ఆ సౌకర్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 7,28,484 మంది హోం ఓటింగ్‌కు అర్హులు ఉన్నారని ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది ఉన్నారు. 40 శాతం పైబడి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.
2024 మార్చి 16న భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుంచి ఏప్రిల్‌ 22 వరకు అధికార బృంధాలు హోం ఓటర్ల కోసం అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి హోం ఓటింగ్‌ను వినియోగించుకోవాలనుకునే వారి వివరాలు సేకరించింది. పారం నెంబరు 12డి ద్వారా వారి వివరాలు ఎన్నికల సంఘం అధికారులు సేకరించారు. మొత్తం హోం ఓటింగ్‌ అర్హుల్లో కేవలం మూడు శాతం మాత్రమే ఇంటి వద్ద ఓటు వేసేందుకు అంగీకరించారు. అందుకు సంబంధించిన ఫారం నెంబరు 12డి ని పూర్తి చేసి అందించారు. హోం ఓటుకు అర్హులైన వారిలో కేవలం మూడు శాతం ఓటర్లు మాత్రమే హోం నుంచి ఓటు వేసేందుకు అంగీకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం 3 శాతం హోం ఓటింగ్‌లో ఆంతర్యం ఏమిటి?
హోం ఓటుకు అర్హులైన వారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే హోం ఓటు వేసేందుకు అంగీకరించారంటే తప్పకుండా మతలబు ఉంటుందనే అనుమానాలు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు శాతం అంటే కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటు వేస్తారు. మిగిలిన వారు పోలింగ్‌ బూతులకు వచ్చి ఓటు వేసేందుకు అంగీకరించినట్లు ఎన్నికల సంఘం వారు భావిస్తున్నారు. హోం ఓటును ఎంచుకున్న వారిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 14,577 మంది ఉన్నారు. 40 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు 14,014 మంది ఉన్నారు.
తీవ్రమైన ఎండలు
ప్రస్తుతం 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఏపీలోని ప్రధాన పట్టణాల్లో నమోదవుతున్నది. పల్లెల్లో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక గంటపాటు ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 85 సంవత్సరాలు పైబడి వృద్ధులు పోలింగ్‌ బూతులకు ఎలా వస్తారనేది పెద్ద ప్రశ్న. వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్నికల అధికారులు అడిగినప్పుడు పారం నెంబరు 12డిని ఎందుకు తిరస్కరించారనేది కూడా చర్చనియాంశంగా మారింది. చైతన్య వంతులైన ఓటర్లు ఇంటి వద్ద కంటే పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు సుముఖంగా ఉంటారని, ఇది పెద్ద అచీవ్‌మెంట్‌గా ఎన్నికల సంఘం చెబుతోంది. ఇవన్నీ నిజాలు కావని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటి వద్ద ఓటు వేసేందుకు 97 శాతం మంది వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ ఎందుకు నిరాకరించారనే విషయమై ఎన్నికల కమిషన్‌ ఆలోచించాల్సి ఉంది. ఇంటి వద్ద అధికారులో, ఇంట్లోని వారో వారికి ఇష్టమైన వారికి బలవంతంగా ఓటు వేయించే ప్రయత్నం చేస్తారనే ఆలోచనలతోనే ఇంటి వద్ద ఓటింగ్‌కు సుముఖత వ్యక్తం చేయలేదని ఒక వృద్ధురాలు ఫెడరల్‌కు చెప్పిన మాటలను బట్టి అర్ధమవుతోంది. మీకు 85 సంవత్సరాలు పైబడ్డాయి. నడవడం కూడా కొంత ఇబ్బంది. ఎవరో ఒకరు పోలింగ్‌ బూత్‌ దగ్గరకు తీసుకు రావాలి. అలా కాకుండా మీరు ఇంట్లోనే పోలింగ్‌ అధికారులు వచ్చినప్పుడు ఓటు వేయవచ్చుకదా? అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చెబితే ఆశ్చర్య పోవాల్సిందే. నా ఓటు నేను ఇంట్లో ఉండి ఎవ్వరికీ తెలియకుండా నా ఇష్టం వచ్చిన వారికి వేయడం సాధ్యమేనా? అందుకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలనుకుంటున్నానని రమణమ్మ అనే వృద్ధురాలు ఫెడరల్‌కు తెలిపారు. అయితే ఓటర్ల జాబితాలోని ఆమె నెంబరు కానీ, ఉండే ఏరియాకానీ చెప్పటానికి ఇష్టపడలేదు. కష్టమో నష్ణమో మేమే పోలింగ్‌ బూత్‌ వద్దకు నేరుగా వచ్చి ఓటు వేస్తాం. అప్పుడు మా ఇష్టం అంటూ ఆమె చెప్పిన మాటలు ఎన్నికల సంఘం చెప్పిన మాటలను చిన్నబుచ్చుతున్నాయి.
ఈనెల రెండు నుంచి ప్రారంభమైన హోం ఓటింగ్‌
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు శాతం మంది ఓట్ల ద్వారా ఓటు వేయించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. అయినా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభించింది. మూడు రోజులుగా హోం ఓట్లు నమోదు అవుతున్నాయి. గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసులు ఉన్నందు వల్ల బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ ఒక రోజు ఆలస్య మైందని, అందువల్ల 2వ తేదీ కొన్ని జిల్లాల్లో హోం ఓటింగ్‌ ప్రారంభిస్తే 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ హోం ఓటింగ్‌ సేకరణకు శ్రీకారం చుట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి పరిస్థితులకు అనుకూలంగా హోం ఓటింగ్‌ షెడ్యూల్‌ను రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 8వ తేదీలోపు హోం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
Tags:    

Similar News