హలో... అమ్మా...నాన్నా... నేను నీ కూతురు ను
సోమవారం పెనుకొండలోని రొద్దం ఎంజేపీలో టెలిఫోన్ బాక్సులను ప్రారంభించనున్న మంత్రి ఎస్ సవిత;
హలో... అమ్మా... నాన్నా... బాగున్నారా..? నేను మీ కూతురును. అంటూ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల స్కూళ్లలో పిల్లలు తల్లిదండ్రులతో టెలిఫోన్ సంభాషణ చేస్తారు. తమ తల్లిదండ్రులను ఫోన్లో రోజూ పలుకరించే అవకాశం ప్రహభుత్వం కల్పించింది. కళ్లెదుటే ఉండాల్సిన బిడ్డ ఎక్కడో దూరంగా గురుకులంలో ఉంటూ తింటోదో లేదో... అనే బెంగతో మదనపడే తల్లిదండ్రులకు రోజూ తమ బిడ్డ పలుకరింపు వినే సదావకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది.
మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలిఫోన్ బాక్స్ లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 గురుకుల పాఠశాలల్లో పే ఫోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గురుకుల పాఠశాలలో ఆరు చొప్పున పే ఫోన్లు ఏర్పాటు చేయబోతోంది. ఈ ఫోన్లను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం పెనుకొండ నియోజక వర్గం రొద్దం ఎంజేపీ స్కూల్లో ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 గురుకుల పాఠశాలల్లో 40 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కుటుంబానికి, తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. నెలకో, రెండు నెలలకో తల్లిదండ్రులు వస్తే వారితో కాసేపు మాట్లాడడం, వారు వెళ్లిపోయాక దిగాలు పడిపోవడం విద్యార్థులకు పరిపాటిగా మారిపోయింది. విద్యార్థుల మానసిక వేదనను గుర్తించిన ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో పే ఫోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ఫోన్ల ద్వారా తమ తల్లిదండ్రులు, బంధువులతో రోజూ మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. తరుచూ తల్లిదండ్రులతో మాట్లాడుతుండడం వల్ల విద్యార్థులకు ఇంటిపై ఉన్న బెంగపోవడంతో పాటు విద్యపై దృష్టి సారించడానికి అవకాశం కలుగుతుందనేది ప్రభుత్వ భావన.
రోజుకు రెండు గంటలు...
రాష్ట్రంలో ఉన్న 110 గురుకుల పాఠశాలల్లో ఒక్కో స్కూలుకు ఆరు పే ఫోన్లు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. తల్లిదండ్రులు, బంధువులతో ఫోన్ లో మాట్లాడానికి రోజుకు రెండు గంటల సమయం కేటాయించనున్నారు. ఉదయం తరగతలు ప్రారంభానికి ముందు ఒక గంట, సాయంత్రం మరో గంట ఫోన్లో మాట్లాడానికి అవకాశం కల్పిస్తారు. ఆయా పాఠశాలల సౌలభ్యాన్ని బట్టి సమయం నిర్ణయించుకునే అవకాశం ప్రిన్సిపాళ్లకు ప్రభుత్వం కల్పించింది.
స్మార్ట్ కార్డుతో ఫోన్ చేసుకునే వీలు..
విద్యార్థులకు ప్రభుత్వం ఏటీఎం కార్డుల తరహాలో స్మార్ట్ కార్డులు అందజేస్తోంది. ఈ కార్డులకు రూ.10లు రీ ఛార్జి చేయాల్సి ఉంటుంది. ఒక్కో నిమిషానికి ఒక్కో రూపాయి వ్యయమవుతుంది. విద్యార్థులే తమ కార్డులకు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి ఎన్ని పర్యాయాలైన స్మార్ట్ కార్డుకు రీఛార్జి చేసుకోవొచ్చు. తల్లిదండ్రులు సూచించిన నాలుగు ఫోన్ నెంబర్లు మాత్రమే ఆ స్మార్ట్ కార్డులో పొందుపరుస్తారు. విద్యార్థులు ఆ ఫోన్ నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న పే ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఉండేలా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో...
కార్పొరేట్ విద్యా సంస్థల్లో పే ఫోన్ల సౌకర్యం ఉంటుంది. ఇపుడీ అవకాశం ఎంజేపీ స్కూళ్లో చదువుకునే బీసీ విద్యార్థులకు వచ్చింది. ప్రభుత్వ పరిధిలో ఉన్న మిగిలిన గురుకుల సంక్షేమ పాఠశాల్లో ఈ తరహా టెలిఫోన్ బాక్సులు ఇంకా ఏర్పాటు చేయలేదు. గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలు అత్యధికులు పేద విద్యార్థులే. తమ బిడ్డలను చూసుకోవడం సుదూర ప్రాంతాల్లో ఉండే పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారంతో కూడుకున్నది. పే ఫోన్ల ఏర్పాటుతో తమ బిడ్డలతో రోజూ మాట్లాడుకునే అవకాశం తల్లిదండ్రులకు, బంధువులకు, సంరక్షలకు కులుగుతుంది.
ప్రభుత్వంపై భారం లేదు...
110 గురుకుల పాఠశాల్లో ఏర్పాటు చేసే పే ఫోన్ల వల్ల ప్రభుత్వంపై ఎటువంటి భారమూ పడడం లేదు. ఎంఆర్కెఆర్ ఐటీ సొల్యూషన్ సంస్థ ఈ ఫోన్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. విద్యార్థులు చేసుకునే రీ ఛార్జే ఆ సంస్థకు ఆదాయంగా వస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ ఇదే తరహాలో టెలిఫోన్ బాక్సులు ఏర్పాటు చేస్తుంటారు.
పే ఫోన్లతో విద్యార్థులకు మేలు
‘‘గురుకుల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే లక్ష్యం. 110 ఎంజేపీ స్కూళ్లో పే ఫోన్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుంది. తమ వారితో రోజూ మాట్లాడుకునే అవకాశం కలుగుంది. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక ధృడత్వం పెరిగి విద్యపై మరింత దృష్టి పెట్టే అవకావం కలుగుతుంది’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తెలిపారు.