హలో ఇండియా ఏపీ వైపు చూడు..కిలో అరటి రూ.50 పైసలు

అరటి పండ్లే కాదు ఉల్లి నుంచి టమాటా వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.

Update: 2025-12-01 14:15 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల దుస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రైతులు పడుతున్న కష్టాలను ప్రపంచం తెలిసేలా చేసే ప్రయత్నం చేశారు. ఆ మేరకు రైతుల పక్షిపాతిగా ‘ఎక్స్’ (X) వేదికగా మరోసారి గళమెత్తారు. “హలో ఇండియా.. ఒకసారి ఏపీ వైపు చూడండి” అంటూ పోస్టు చేసి, రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కిలో అరటిపండ్లు రైతుల వద్ద నుంచి రూ.50 పైసలకే అమ్ముడవుతున్నాయని, అగ్గిపెట్ట, బిస్కెట్ కంటే కూడా  అరటి చౌకయ్యిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే చివరకు రైతులకు దక్కిన ప్రతిఫలం ఇదేనని ప్రశ్నించారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.

 పోస్టులో జగన్ ఏమన్నారంటే.. అరటి పండ్లే కాదు ఉల్లి నుంచి టమాటా వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌లో అరటిపండ్లు రూ.60-70కి విక్రయిస్తున్నాయి. ఈ డబ్బులు మధ్యలోని దళారుల జేబుల్లోకే వెళ్తున్నాయి.  రైతులకు మాత్రం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదు. దీంతో రైతులు ఆవేదనతో పంటలను రోడ్లపై పడివేస్తున్నారు. బొప్పాయి, ఉల్లి, టమాటా ధరలు మార్కెట్‌ను బట్టి మారిపోతున్నాయి. కానీ రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేది ఎలా అని జగన్ ప్రశ్నించారు. విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఉచిత పంట బీమా లేదు. కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పాలనలో (YSRCP హయాంలో) అరటి పండ్ల ధర టన్ను రూ.25 వేలు పలికేదని, రైతులకోసం ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడిపామని గుర్తు చేశారు. కృతనిశ్చయంతో రైతులకు ఎంతో మేలు చేశామని, రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతులు వీడియోలను కూడా దీనితో పాటు షేర్ చేశారు. 

Tags:    

Similar News