ఆగస్టు అంతా అధిక వర్షాలే

ఎక్కువ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల హాట్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.;

Update: 2025-08-11 07:16 GMT

తుపానులు, వర్షాలు, వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల హాట్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు. ఎక్కువుగా నష్టం చేకూర్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని, ఆ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, మరో వైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా, వాయువ్య, పశ్చిమ దిశగా ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో వీటి ప్రభావం వల్ల బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హోం మంత్రి అనిత జిల్లా కలెక్టర్లు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశించారు.

బుధవారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావం వల్ల వచ్చే ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా దీని వల్ల గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరో వైపు ఈ నెల 18 వచ్చే సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారం రాయలసీమ ప్రాంతాలైన శ్రీసత్యసాయి జిల్లాతో పాటు కడప, తిరుపతి, చిత్తూరు, నంద్లా, అన్నమయ్య వంటి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అన్ని జిల్లాల్లో కంటే శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురంలో 98 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తత, ముందస్తు జాగ్రతలు తీసుకోవడం కోసం మంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Tags:    

Similar News