శుక్ర, శనివారాల్లో ఏపీలో భారీ వర్షాలు
గురువారం సాయంత్రం 5 గంటల నాటికి నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 60.2మిమీ, ఎనకండ్లలో 52.2మిమీ, పాములపాడులో 38.7మిమీ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు.;
By : The Federal
Update: 2025-09-11 13:13 GMT
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి వలన రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యేందుకు అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40–50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రానున్న రెండు రోజుల్లో సెప్టెంబరు 12న శుక్రవారం పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబరు 13 శనివారం ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం 5 గంటల నాటికి నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 60.2మిమీ, ఎనకండ్లలో 52.2మిమీ, పాములపాడులో 38.7మిమీ, కాకినాడ జిల్లా సామర్లకోటలో 35.2మిమీ, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 34.7మిమీ, విజయనగరం జిల్లా గొల్లపాడులో 33.2మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.